నిజామాబాద్

హేమాహేమీల ఖిల్లాలో రసవత్తర ‘పోరు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 14: హేమాహేమీలు ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈసారి శాసనసభ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగనుంది. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఇందూరు జిల్లా నుండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎం.పీగా కొనసాగుతుండగా, పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్, ఆపద్ధర్మ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డి, శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, మాజీ మంత్రులు పీ.సుదర్శన్‌రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు వంటి ఉద్ధండులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గడిచిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా తెరాసకు ఇందూరు ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు, రెండు పార్లమెంటు స్థానాల్లోనూ తెరాస అభ్యర్థులనే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిపించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే తరహా ఫలితాన్ని పునరావృతం చేయాలని తెరాస నేతలు, ప్రత్యేకించి ఎం.పీ కవిత అన్నీ తానై వ్యవహరిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అన్నిచోట్ల తాజామాజీలకే తెరాస అధిష్టానం అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే వారికి మద్దతుగా తెరాస అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల మలివిడత ప్రచారాన్ని నిజామాబాద్ నుండే మొదలుపెట్టారు. మరోవైపు గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం తాలూకు చేదు జ్ఞాపకాలను స్మృతిపథం నుండి చెరిపేస్తూ, ఎలాగైనా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ నేతలు సైతం పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. మహాకూటమితో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రానప్పటికీ, ముఖ్య నేతలు ఎలాగూ తమకే టిక్కెట్ ఖాయమనే ధీమాతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కామారెడ్డిలో షబ్బీర్‌అలీ, బోధన్‌లో సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌లో ఎమ్మెల్సీ ఆకుల లలితలు తెరాస అభ్యర్థులకు దీటుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 20వ తేదీన కామారెడ్డిలో ఎన్నికల ప్రచార సభకు హాజరవుతుండడంతో పార్టీ శ్రేణులంతా ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. కాగా, మిగతా సెగ్మెంట్లలో ఒక నియోజకవర్గాన్ని మహాకూటమిలోని తెలుగుదేశం పార్టీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. తెరాస అసమ్మతి నేతగా మారిన రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ సైతం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవలే నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు చెందిన ఆయన అనుచరులు భారీ సంఖ్యలో తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు. డీఎస్ సైతం త్వరలోనే సొంత గూటికి చేరనున్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, రాజ్యసభ పదవి విషయమై ప్రతిష్టంభన కొనసాగుతోంది. డీఎస్ మళ్లీ కాంగ్రెస్‌కు చేరువైన నేపథ్యంలో అర్బన్, రూరల్ సెగ్మెంట్ల రాజకీయ సమీకరణల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్బన్ నుండి ఎన్నికల బరిలోకి దిగాలని డీఎస్‌ను అనుచరులు ఒత్తిడి చేస్తున్నా, తన ప్రధాన అనుచరురాలికి అభ్యర్థిత్వం ఖరారు చేయించేందుకు డీఎస్ పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతోంది. ఇదిలాఉండగా, కమలం పార్టీలోనూ ఈసారి ఎన్నికల జోష్ కనిపిస్తోంది. డీఎస్ రెండవ తనయుడు ధర్మపురి అరవింద్ పార్లమెంటు సెగ్మెంట్ నుండి బరిలోకి దిగాలనే యోచనతో బీజేపీలోకి చేరి తన దూకుడు వైఖరితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, బోధన్, బాల్కొండ తదితర సెగ్మెంట్ల నుండి బీజేపీ తరఫున బరిలోకి దిగాలనే ఆ పార్టీ శ్రేణులు ఒకరి కంటే ఎక్కువ సంఖ్యలో హోరాహోరీగా పోటీపడుతున్నారు. తెరాస అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న పలువురు ఆశావహులు కూడా ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరి ఎన్నికల్లో తలపడుతున్నారు. ఈ కోవలో ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గంకు చెందిన వినయ్‌రెడ్డి బీజేపీలో చేరి ఆపార్టీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహిస్తుండగా, బాల్కొండ నుండి తెరాస టిక్కెట్ ఆశించిన ముత్యాల సునీల్‌కుమార్ కూడా ఈసారి ఏదిఏమైనా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేల్చిచెప్పారు. దీంతో పై రెండు సెగ్మెంట్లలోనూ తెరాస అభ్యర్థులు అసమ్మతి బెడదను ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందూరు ఉమ్మడి జిల్లాలో ఈసారి ఎన్నికలు ఇదివరకటి తరహాలో ఏకపక్షంగా కొనసాగే అవకాశాలు ఏమాత్రం లేవని తాజా పరిస్థితులు చాటుతున్నాయి.