నిజామాబాద్

ముందుకు కదలని క్రమబద్ధీరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మే 12: రాష్ట్రంలో కాంట్రాక్టు వెట్టిచాకిరీ ఉండకూడదంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను చేర్చి మంత్రివర్గంలో తీర్మానం చేసే వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవ చూపినప్పటికీ, క్షేత్ర స్థాయిలోని ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసే విషయంలో అలసత్వ వైఖరిని అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వరకు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినా, అందుకు అనుగుణంగా శాఖల వారీగా దస్త్రాలు ముందుకు కదలడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఇంటర్ విద్యలో నెలకొన్న పరిస్థితులు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ శాఖలో 3970 మంది లెక్చరర్లు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తున్నారు. అలాగే మరో 450 మంది మినిమమ్ టైమ్‌స్కేల్ ఉద్యోగులు ఉన్నారు. వీరంతా గత పదేళ్ల నుండి ఉద్యోగ భద్రత కోసం పోరాటాలు చేస్తున్నారు. చాలీ చాలని వేతనాలు, సవాలక్ష నిబంధనలతో కాలం వెళ్లదీస్తున్న ఈ ఉద్యోగుల వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలు మనుగడ సాగిస్తున్నాయని ఇంటర్ బోర్డు అధికారులే చెబుతున్నారు. ప్రతీ ఏటా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయడమే కాకుండా తమ ఉద్యోగాల పరిరక్షణ కోసం గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించడంలో విశేషంగా కృషి చేస్తూ సర్కారీ కాలేజీల్లో హాజరు శాతం పెరిగేలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరు సమైక్య రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం కూడా ఇందుకు అద్దం పడుతోంది. స్వరాష్ట్రం సిద్ధిస్తే తమ సర్వీసులు రెగ్యులరైజేషన్ అవుతాయన్న ఆశతో కాంట్రాక్ట్ లెక్చరర్లు తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. వారు ఆశించినట్టుగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ అంశాన్ని మెనిఫెస్టోలో చేర్చి మంత్రివర్గ తీర్మానం చేసి క్రమబద్ధీకరణ కోసం జీవో నంబర్ 16ను జారీ చేశారు. ఈ జీవో జారీ అయి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు కూడా కాంట్రాక్టు అధ్యాపకులకు క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు అందలేకపోయాయి. మరో ఇరవై రోజులలో 2016-17 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇంతలోపు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందితే కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాలలో సంతోషం వెల్లువెత్తే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఈ ప్రక్రియ నత్తనడకగా సాగుతుండటంతో అధ్యాపకులలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం కూడా తమకు మళ్లీ కాంట్రాక్టు బతుకులే ఎదురవుతాయేమోనని వారు వాపోతున్నారు. క్రమబద్ధీకరణను వేగవంతం చేసి త్వరితగతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా, శాఖల వారీగా అందుకు అనుగుణంగా దస్త్రాలు ముందుకు సాగకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
జీవో విడుదలైనప్పటికీ అధికారులు తాత్సారం చేయడం ఉద్యోగులను ఆవేదనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ తప్పిదాల కోసం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు కూడా ఈ వ్యవహారం మంచి అవకాశంగా మారనుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి అధికారులు పలు దఫాలుగా ఆదేశాలు జారీ చేసినా, కిందిస్థాయి అధికారులు మాత్రం అలసత్వ ధోరణినే ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్ చేసేందుకు ఆర్థిక శాఖ జారీ చేసిన చెక్‌లిస్టు ఆధారంగా ఉద్యోగులు తమ వివరాలను ప్రభుత్వానికి తెలియచేశారు. సర్ట్ఫికెట్లు సైతం అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు పరిశీలించి జిరాక్స్ కాపీలపై సర్టిఫై చేసినట్లు సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. కానీ ఇప్పటి వరకు కూడా అర్హుల జాబితా రూపొందించకపోవడం వెనుక మతలబు ఏమిటిన్నది అంతుచిక్కడం లేదు.