నిజామాబాద్

ఈవీఎంలు స్వయంగా నిర్వహించేలా సిబ్బందికి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 14: ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ.ప్యాట్‌లు స్వయంగా ఆపరేట్ చేసేలా ప్రయోగాత్మకంగా శిక్షణ అందించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. అన్ని గదులలో తిరుగుతూ, శిక్షణ పొందుతున్న సిబ్బందికి ఏ రీతిలో శిక్షణ అందిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీవీ.ప్యాట్‌లో ఓటు ఎవరికి వేశారనే రసీదు ఎన్ని సెకన్ల వరకు కనిపిస్తుంది, ఎవరైనా రసీదు అడిగితే ఏం చేస్తారు, ఒక ఓటరు ఓటు వేయడానికి ఎంత సమయం పడుతుంది, ఓటింగ్ కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేసే విధానం, గోప్యత కోసం ఆ కంపార్ట్‌మెంట్ వద్ద చేపట్టాల్సిన చర్యలు తదితర వాటి గురించి శిక్షణ పొందుతున్న సిబ్బందికి ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టడం ద్వారా వారు ఎన్నికల నిర్వహణ అంశాలను ఎంతమేరకు ఆకళింపు చేసుకున్నారన్నది నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది అందరూ తప్పనిసరిగా ఈవీఎంలు, వీ.వీ ప్యాట్ల పనితీరు గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటింగ్ యంత్రాలకు, వీవీ.ప్యాట్లకు కనెక్షన్ ఇవ్వడం, మళ్లీ సురక్షితంగా ఆ కనెక్షన్‌ను తొలగించడం గురించి ప్రయోగాత్మకంగా తర్ఫీదు పొందాలని ఆదేశించారు. అనుకోని రీతిలో ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉత్పన్నమైతే వాటిని గుర్తించి వెంటనే పరిష్కరించుకునేలా సన్నద్ధం కావాలని హితవు పలికారు. మాక్ పోలింగ్ నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవాలని, పోలింగ్ బూత్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్‌లను అనుమతించకూడదని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ ఎంతో అప్రమత్తంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏవైనా పొరపాట్లకు అవకాశం కల్పిస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కలెక్టర్ హెచ్చరించారు.
ఎన్నికల వ్యయ పరిశీలకులతో కలెక్టర్, సీ.పీ భేటీ
కాగా, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించబడిన వంతకుమార్, శేక్ శంషేర్‌ఆలంలు బుధవారం కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు, పోలీస్ కమిషనర్ కార్తికేయలతో భేటీ అయ్యారు. కలెక్టర్ చాంబర్‌లో జరిగిన ఈ సమావేశం సందర్భంగా అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అభ్యర్థులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ఎన్నికల వ్యయ పరిశీలన కోసం నియమించిన బృందాలు, వారు నిర్వర్తిస్తున్న విధులు, తీసుకున్న చర్యల గురించి కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు వ్యయ పరిశీలకుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు శాఖ చేపడుతున్న చర్యల గురించి సీ.పీ కార్తికేయ వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన మీదట అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై మరింత పకడ్బందీగా నిఘాను కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని పరిశీలకులు పేర్కొనగా, ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి ఎంఆర్‌ఎం.రావు వివరించారు.