నిజామాబాద్

ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 20: చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలనే తలంపుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఉదయం 7గంటల నుండి మొదలుకుని రాత్రి 10గంటల వరకు వాడవాడలా తిరుగుతూ ఓటర్లతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ ఆకుల లలిత మంగళవారం తన ప్రచారం సందర్భంగా ఇస్ట్రీ షాపు వద్ద బట్టలను ఇస్ర్తి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధానంగా చతుర్ముఖ పోటీ నెలకొని ఉన్న నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్‌లో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరికివారు తమదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచార పర్వంలోనే పై చేయిని చాటుకోవాలనే గట్టి తలంపును ప్రదర్శిస్తున్నారు. తెరాస అభ్యర్థి బిగాల గణేష్‌గుప్తా, మహాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ తదితరులు ఎవరికివారు గెలుపు ధీమాతో ప్రచార బరిలో ముందుకు సాగుతున్నారు. సదరు అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేలా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తెరాస అభ్యర్థి, తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా కూరగాయల బండిపై కూరగాయలు విక్రయిస్తూ, మిర్చిబజ్జీలు వేస్తూ ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత ఆలస్యంగా అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్‌బిన్ హందాన్ సోమవారం నామినేషన్‌ను దాఖలు చేసిన మీదట ప్రచార బరిలోకి దిగారు. మైనార్టీ నేతలతో సమావేశమై వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అర్బన్‌లో మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉండడంతో అధిష్టానం తాహెర్‌కు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కువగా మైనార్టీ ఏరియాలలో ప్రచారంపై దృష్టిని కేంద్రీకరించాలని భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ కూడా ఇంటింటికి పాదయాత్రగా తిరుగుతూ ప్రచారం నిర్వహించడమే కాకుండా ఆయా షాపుల వారి వద్దకు వెళ్తూ తాను గిరాకీ చేస్తున్నారు. ఇలా పై ముగ్గురు అభ్యర్థులు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికల సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తుండడంతో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఇతిమిద్థంగా ఇప్పుడే తేల్చి చెప్పలేని పరిస్థితి నెలకొని ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పై మూడు పార్టీల్లోనూ అభ్యర్థులను ఎంపిక చేసి టిక్కెట్లు కేటాయించిన సమయంలో సొంత పార్టీలకు చెందిన నాయకుల నుండే ఒకింత అసంతృప్తి, నిరసనలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ తరఫున అర్బన్ టిక్కెట్‌ను ఆశించిన మహేష్‌కుమార్‌గౌడ్, రత్నాకర్‌లను పక్కనబెట్టి తాహెర్‌కు అభ్యర్థిత్వం కట్టబెట్టడంతో నిరాశకు లోనైన నాయకుల వర్గీయులు మొదటి రెండు రోజుల పాటు కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. రత్నాకర్ ఏకంగా ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానంటూ నామినేషన్ దాఖలు చేశారు. అన్నింటికి మించి రాజ్యసభ సభ్యుడు, తెరాస అసంతృప్త నేత డి.శ్రీనివాస్ ఇప్పటికీ స్తబ్ధంగానే వ్యవహరిస్తుండడంతో ఆయన కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు అందిస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే త్వరలోనే అసంతృప్త నేతలను కలుపుకుని ముందుకు సాగడంలో తాహెర్ సఫలీకృతులవుతారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణకు కూడా అసమ్మతి ఎదురవుతోంది. ఆ పార్టీ తరఫున అర్బన్ టిక్కెట్‌ను ఆశించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తాకు టిక్కెట్ కేటాయిస్తామన్న హామీ నెరవేరలేకపోయింది. ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ యెండలకు అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో అసంతృప్తికి గురైన ధన్‌పాల్ శివసేన అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు.