నిజామాబాద్

ప్రధాన పార్టీలకు తప్పని తిరుగుబాటు బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 20: శాసనసభ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీలకు తిరుగుబాటు బెడద తప్పడం లేదు. కొంతకాలంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటూ వచ్చిన ఆశావహులకు అభ్యర్థిత్వాలు దక్కకపోవడంతో ఎలాగైనా బరిలో నిలువాలనే భావనతో పలువురు ఇతర పార్టీల తరఫున పోటీ చేస్తుండగా, మరికొందరు రె‘బెల్స్’గా ప్రధాన అభ్యర్థుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగి అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. కానీ నేతల మాటలను సైతం ఖాతరు చేయకుండా తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీకి సై అంటున్నారు. ఈ అసమ్మతి ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు భావించి నేతలు ముందస్తు కసరత్తులు చేపట్టారు. అయితే ఆయా సెగ్మెంట్ల నుండి ఆశావహుల పోటీ ఎక్కువగా ఉండటంతో అన్ని పార్టీలకు తిరుగుబాటు బెడదను ఎదుర్కోక తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం 130మంది నామినేషన్లు వేశారు. అత్యధికంగా నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్‌లో 33మంది నామపత్రాలు సమర్పించారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే రెబెల్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ నుండి అభ్యర్థిత్వాన్ని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌కు కట్టబెట్టగా, టిక్కెట్‌ను ఆశించి భంగపడ్డ ఆ పార్టీ టీ.పీసీసీ కార్యదర్శి నరాల రత్నాకర్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ టిక్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణకు ఖరారు చేయగా, ఈ స్థానం నుండి పోటీ చేయాలని ఆశించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక నామినేషన్‌ను, శివసేన పార్టీ అభ్యర్థిగా మరో నామినేషన్‌ను దాఖలు చేశారు. దీంతో అర్బన్ సెగ్మెంట్‌లో అటు రత్నాకర్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు, ఇటు ధన్‌పాల్‌ను బరి నుండి తప్పించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపాటుకు గురైన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి రెబల్‌గా బరిలో నిలుస్తానంటూ గట్టిగా పట్టుబట్టి కూర్చున్నారు. బాన్సువాడ నుండి బరిలోకి దిగాలని ఆశించి భంగపడ్డ మల్యాద్రిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి తన సత్తా చాటుతానని చెబుతున్నారు. వీరిరువురికి నచ్చజెప్పేందుకు కాంగ్రెస్ నేతలు నానాతంటాలు పడాల్సి వస్తోందని తెలుస్తోంది. జుక్కల్‌లో కాంగ్రెస్ టిక్కెట్‌ను ఆశించి భంగపడ్డ అరుణతార, ఆర్మూర్‌లో తెరాస టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమైన వినయ్‌రెడ్డిలు బీజేపీ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. బాల్కొండ సెగ్మెంట్ నుండి తెరాస టిక్కెట్ తనకే ఖాయమని గట్టిగా విశ్వసించిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌కుమార్‌కు గులాబీ పార్టీ అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆయన బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్‌కు చెందిన ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి అయితే ఏకంగా తెరాస అసమ్మతి నేతగా ముద్రపడిన మీదట కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలువడం తెరాసకు గట్టి పోటీదారుగా మారారు. ఇలా ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని అవకాశం కలిసివస్తే చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్న వారంతా గత చాలాకాలం నుండే ప్రజలతో మమేకం అవుతూ క్షేత్రస్థాయిలో ప్రచారం సైతం నిర్వహించారు. దీంతో అనుకున్నట్టుగానే ముందస్తు ఎన్నికలు తెరపైకి రావడంతో వారి ఆనందానికి అడ్డూ అదుపులేకుండాపోయింది. ఎన్నికల నగారా మోగడంతో రంగంలోని దిగిన అభ్యర్థులు ఆయా పార్టీల తరఫున అభ్యర్థిత్వాల కోసం తుదికంటా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల్లో విఫలమైన పలువురు తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ ప్రధాన అభ్యర్థులకు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆ లోపు రెబెల్స్‌ను బరి నుండి పక్కకు తప్పించాలని ప్రధాన పార్టీల నాయకులు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.