నిజామాబాద్

సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, నవంబర్ 21:బోధన్ పట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్‌హెచ్‌వో నాగార్జునగౌడ్ సూచించారు. ఎవ్వరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. ప్రభుత్వం పై గానీ, అధికారుల పై గానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. కోడ్ అమలులో ఉన్నందున సోషల్ మీడియా అడ్మిన్‌లు తమతమ గ్రూపులలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టింగ్‌లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా పై జిల్లా స్థాయిలో నిఘాను ముమ్మరం చేయడం జరిగిందని, అన్ని మొబైల్ ఫోన్‌లపై నిఘా ఉందన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద రాజకీయ పార్టీలు ప్లెక్సీలు, జెండాలు, ఎన్నికల రాతలు రాయకూడదన్నారు. ఎక్కడైనా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకుంటే ఆ భవనానికి సంబంధించి యజమానుల నుండి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. బోధన్‌లో రాజకీయ పరమైన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలంటే ముందుగా పూర్తి వివరాలు తెలియచేసి ఎన్నికల అధికారుల నుండి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అనుమతులు లేకుండా ప్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ఎవ్వరైనా ఫిర్యాదులు చేస్తే చట్టపరంగా సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకెళ్లవద్దని ఆయన సూచించారు. వ్యాపారులు నగదును గనుక తీసుకెళ్లినట్లయితే వాటికి సంబంధించి ఆధారాలు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఎక్కడైనా తనిఖీలు చేసినట్లయితే తమ వద్ద ఉన్నటువంటి నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలు దగర్గ పెట్టుకుని తనిఖీ అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. బోధన్ మున్సిపల్ పరిధిలోని 35 వార్డులలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఈ ప్రాంతాలలో ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నిర్దేషిత గడువు తర్వాత ఎవ్వరూ ప్రచారాలు చేయకూడదన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విపరీతమైన సౌండ్ సిస్టంతో ప్రచారాలు చేసినా కేసులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటి కప్పుడు ఉన్నతాదికారులకు నివేదించడం జరుగుతుందని ఈ విషయాన్ని అన్ని పార్టీల నాయకులు గమనించి కోడ్ ఉల్లంఘన జరుగకుండా ప్రచారాలు సాగించాలన్నారు. ఎన్నికలలో అనవసరంగా గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, అందులో ఉన్నటువంటి వివాదాస్పద వ్యక్తుల పై నేడు ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. వారు మళ్లీ వివాదాస్పంగా వ్యవహరించకుండా, గొడవలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నామన్నారు. మున్సిపల్ పరిధిలో ఎవ్వరైనా పనిగట్టుకుని గొడవలు సృష్టిస్తే ప్రజలు వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. పాత నేరస్థులు, వివాదాస్పద వ్యక్తులు, రాజకీయ గొడవలు చేసే వారు మళ్లీ పాత పంథాను అవలంభించినట్లు తెలిస్తే బైండోవర్‌లు చేయడం జరుగుతుందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటి నుండియే పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామన్నారు.

ఆర్మూర్ డివిజన్‌లో గెలుపు గుబులు
* విజయంపై ఎవరి అంచనాలు వారివే
నిజామాబాద్, నవంబర్ 21: జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గెలుపు గుబులు పట్టుకుంది. తమదే విజయం అంటూ అన్ని పార్టీలు వారివారి అంచనాలపై ధీమా వ్యక్తం చేసుకుంటున్నాయి. డివిజన్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉంటూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ మొట్టమొదటి టికెట్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ఆర్మూర్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డికి కేటాయించారు. దీనిని బట్టి డివిజన్‌లో తమకు ఎంత పట్టుఉందో గుర్తించుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులు రాజకీయ విశే్లషకులకు కూడా అంతుచిక్కని పరిస్థితి. ఆర్మూర్ నియోజకవర్గంలో తాజామాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ నుండి పొద్దుటూరి వినయ్‌రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచార పర్వంలో అన్ని పార్టీల ప్రభంజనం కనిపిస్తున్నప్పటికీ, టీఆర్‌ఎస్ కంటే మిగతా ఇద్దరు ముందంజలో ఉన్నట్లుగానే సరళి కనిపిస్తోంది. ఆకుల లలిత ఒక అడుగు ముందుకేసి నియోజకవర్గాన్ని రెండు పర్యాయాలు చుట్టేశారు. ఆమె సొంత మండలం కూడా మాక్లూర్ కావడంతో అక్కడ ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సాధించవచ్చన్నది విశే్లషకుల అంచనా. ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. బాల్కొండలోనూ తెరాస ప్రచారంలో ముందుకు దూసుకెళ్లినప్పటికీ, ఆలస్యంగా అభ్యర్థులను ఖరారు చేసుకున్న కాంగ్రెస్ తన వర్గాన్ని తిరిగి సొంత గూటికి ఆహ్వానించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి బాల్కొండ నియోజకవర్గంలో బీఎస్పీ నుండి పోటీ చేస్తున్న ముత్యాల సునీల్‌కుమార్ బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన బాల్కొండలో ఆ పార్టీ అభ్యర్థికి బలమైన ఓటు బ్యాంకే ఉంది. ఇక్కడ యువ ఓటర్లు, మహిళా ఓటర్ల సంఖ్యతో పాటు ఒక వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య కూడా 40వేల పైచిలుకు ఉంది. దీనిని బట్టి వారి ఓట్లే విజయంలో ప్రధాన భూమిక పోషించనున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న ప్రచార సరళిని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంలో ప్రచారం కంటే ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను తమతమ పార్టీల్లోకి ఆహ్వానించడంలోనే అభ్యర్థులు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆయనకు విజయం వరించేలా పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ కవిత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుండి నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి, అత్యున్నత స్పీకర్ పదవి అధిష్ఠించిన కేఆర్.సురేష్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో తమ బలం రెట్టింపు అయ్యిందన్నది తెరాస అంచనా. అయితే నేత మాత్రమే వెళ్లారని, తమ ఓటు బ్యాంకు మాత్రం అలాగే స్థిరంగా ఉందన్నది కాంగ్రెస్ నేతల అంచనా. మిగతా పార్టీలు ఊహించని స్థాయిలో గెలుపు సాధించి బాల్కొండ కోటపై బీఎస్పీ జెండాను ఎగరవేస్తామన్నది సునీల్‌కుమార్ వర్గీయుల అంచనా. పైకి గెలుపు అంచనాలపై అన్ని పార్టీలు గట్టిగా చెబుతున్నప్పటికీ, ఎదుటి పార్టీల బలాలు, బలహీనతలపై అంచనాలు వేసుకుంటూ, అభ్యర్థుల్లో గెలుపు గుబులు కనిపిస్తుందన్నది విశే్లషకుల అంచనా. మొత్తానికి ఆర్మూర్ డివిజన్‌లోని రెండు నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం గెలుపు ఎవరిని వరించినా తక్కువ మెజార్టీయే ఉంటుందన్నది రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.