నిజామాబాద్

జిల్లాలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 21: మత ప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలైహివ సల్లమ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ముస్లిం సోదరులు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గత వారం పదిరోజుల ముందు నుండే ఈ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్న ముస్లిం యువకులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సదస్సు నిర్వహించారు. మిలాద్-ఉన్-నబీ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ర్యాలీ మాలపల్లి, బోధన్ రోడ్, చార్‌భాయి పెట్రోల్‌పంప్, బోధన్ బస్టాండ్, ముస్తాయిద్‌పురా, అహ్మద్‌పురా కాలనీ, మక్కామసీదు, మహ్మదీయ కాలనీ, ఖిల్లా, బర్కత్‌పురా, అహ్మదీబజార్ తదితర ప్రాంతాల మీదుగా నెహ్రూపార్క్ వరకు కొనసాగింది. తలపై టోపీలు ధరించి, పచ్చజెండాలు చేతబూని యువకులు ఎంతో ఉత్సాహంగా ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు, కార్లు, ఇతర వాహనాల్లో నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 10వేల మందికి పైగా వాహనాలతో ర్యాలీలో పాల్గొనడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. నిజామాబాద్ ఏసీపీ నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ముందుగానే ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి తగు సూచనలు చేయడం, ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టి వాహనాలను దారి మళ్లించడం సత్ఫలితాలిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అడుగడుగునా పోలీసులు గట్టి నిఘా కొనసాగించారు. వెంటదివెంట ర్యాలీ ముందుకు సాగేలా మిలాద్ కమిటీ ఏర్పాటు చేసిన వాలంటీర్లు సైతం కృషి చేస్తూ పోలీసులకు తమవంతు సహకారం అందించారు. ర్యాలీ అనంతరం నెహ్రూపార్క్ వద్ద సదస్సు నిర్వహించగా, ముస్లిం మత పెద్దలు మిలాద్-ఉన్-నబీ వేడుక ప్రాశస్త్యాన్ని వివరించారు. మహ్మద్ ప్రవక్త జీవనశైలి, ఆయన సూచించిన బోధనలను పాటించాల్సిన ఆవశ్యకత గురించి హితబోధ చేశారు. నగరంలోని నెహ్రూపార్క్ వద్ద డీసీసీ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి తాహెర్‌హందాన్ తదితరులు ర్యాలీకి స్వాగతం పలికి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ఈ వేడుకను పురస్కరించుకుని గత వారం రోజుల ముందు నుండే మైనార్టీ ఏరియాలను ఆకుపచ్చ జెండాలతో రెపరెపలాడేలా చేశారు. ఎటుచూసినా యువకుల కోలాహలమే కనిపించింది. ముస్లింలు తమ వ్యాపార సంస్థల వద్ద విద్యుద్దీపాలను వెలిగిస్తూ పండుగ వాతావరణాన్ని సంతరింపజేశారు. మైనార్టీ కాలనీల్లో దాదాపుగా ప్రతి ఇంటిపైనా ఆకుపచ్చ జెండాలు రెపరెపలాడాయి. ఇదివరకటితో పోలిస్తే ఈసారి మరింత పెద్దఎత్తున హంగు, ఆర్భాటాలతో ఈ వేడుకను చేపట్టి మిలాద్ కమిటీ అందరి దృష్టిని ఆకర్షించింది. మత ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాన కూడళ్ల వద్ద అన్నదానం సైతం ఏర్పాటు చేశారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ముస్లిం సోదరులంతా ఈ ఉత్సవంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని మహ్మద్ ప్రవక్త పట్ల తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఈ వేడుకలో మిలాద్ కమిటీ ప్రతినిధులు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.