నిజామాబాద్

ఎన్నికల ఫలితాలపై ఇందూర్‌లో జోరుగా బెట్టింగ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 9: అన్ని రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. పోలింగ్ సరళిని బట్టి అభ్యర్థుల గెలుపోటములను అంచనా వేస్తూ వేయి రూపాయలు మొదలుకుని పది లక్షల రూపాయల వరకు పందెం డబ్బులు కాస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, డిచ్‌పల్లి, కామారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో చోటామోటా లీడర్లతో పాటు, ప్రముఖ వ్యాపారులు సైతం బెట్టింగ్‌లు కట్టడంలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. పోలింగ్ సరళిని బట్టి విశే్లషకులు వెలువరిస్తున్న అంచనాలకు అనుగుణంగా, ప్రచార సాధనాలు తాజామాజీలకే మెజార్టీ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఆయా సెగ్మెంట్లలో ‘కారు’ పరుగులు పెట్టడం ఖాయమని భావిస్తూ బెట్టింగ్‌లకు ఆసక్తి చూపుతున్నారు. మరోపక్క కాంగ్రెస్ అభ్యర్థులు కూడా హోరాహోరీగా పోరాడుతూ హంగు ఆర్భాటాలతో విస్తృత ప్రచారం కొనసాగించారు. ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఇతర స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహించి మద్దతును కూడగట్టారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న మరికొందరు వారి గెలుపు ఖాయమంటూ పందేలు కడుతున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున బెట్టింగ్‌లు కట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ పక్షాన కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగడంతో ఫలితాలపై ఒకింత ఉత్కంఠ కొనసాగుతోంది. పోలింగ్ సరళి అనంతరం కూడా ఈ స్థానం నుండి ఎవరు గట్టెక్కుతారన్నది అంచనా వేయలేని పరిస్థితి ఉండడంతో పందేలు పెద్దఎత్తున కడుతున్నారు. పలుచోట్ల అభ్యర్థుల విజయం నల్లేరుపై నడకేనని తేటతెల్లం అయిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా రెండో స్థానంలో ఏ రాజకీయ పక్షం నిలుస్తుందన్న దానిపైనా బెట్టింగ్‌లు కడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ నెలకొని ఉండడంతో స్వతంత్రులు, ఇతర పార్టీల నుండి పోటీ చేసిన వారికి ఆయా చోట్ల డిపాజిట్లైనా వస్తాయా లేదా అన్నది కూడా బెట్టింగ్ అంశంగానే మారింది. ప్రతీసారి ఎన్నికల్లో బెట్టింగ్‌లు కట్టే పలువురు ఎన్నికల శైలిని గమనించేందుకు ప్రచారం సందర్భంగా ఎంతో ప్రాధాన్యత కనబర్చారు. ఆయా పార్టీల అధినేతల సభలకు హాజరైన జనాల సంఖ్య, ప్రజల్లో లభించిన ఆదరణను పసిగట్టినా ఓటరు నాడి ఎటువైపు నిలిచిందన్నది ఇతిమిద్థంగా తెలియలేకపోయింది. దీంతో పోలింగ్ నాటి వరకు కూడా జిల్లాలో బెట్టింగ్‌ల జాడ అంతగా కానరాకపోగా, ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ముగియడం, ఎన్నికల ఫలితాలు తాజామాజీలకే అనుకూలమన్న ప్రచారం జరుగుతుండడంతో బెట్టింగ్‌ల జోరు ఒక్కసారిగా ఊపందుకుంది. వ్యాపారులు, రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన మోతుబరి రైతులు, చోటామోటా లీడర్లతో పాటు పలువురు కిందిస్థాయి కార్యకర్తలు సైతం బెట్టింగ్‌లు కడుతూ, ఎన్నికల ఫలితాలపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సాహసిస్తున్నారు. వీరి బెట్టింగ్‌ల భాగోతం ఇప్పటికే లక్షల రూపాయల వరకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సమయానికి ఛాలెంజుకు సరిపడా పైకం లేకపోతే తమవద్ద గల బంగారు ఉంగరాలు, ఇతర ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. ఫలానా అభ్యర్థి విజయం సాధిస్తాడు.. ఫలానా పార్టీ రెండో స్థానంలో నిలవడం ఖాయమంటూ సవాల్ విసురుతూ ఎదుటి వారిని ఉద్వేగానికి లోనుచేస్తూ బెట్టింగ్ కట్టేందుకు ప్రేరేపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలేమో కానీ, బెట్టింగ్‌ల జోరుతో లక్షలాది రూపాయలు చేతులు మారి అమాయకులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా, గతంలో ఎన్నడూలేని విధంగా రాజకీయ పక్షాలతో పాటు, సామాన్యులు సైతం ఎన్నికల ఫలితాల పట్ల ఎనలేని ఆసక్తిని కనబరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎటుచూసినా పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాలపైనే రసవత్తర చర్చ జరుగుతోంది.