నిజామాబాద్

జాతీయతా భావం వెల్లివిరియాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 11: ఈ నెల 26న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతయతా భావం వెల్లివిరిసేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కార్యక్రమాలు జాతీయ సమగ్రత, దేశాభిమానం, జాతీయ జెండాకు గౌరవం కలిగించే విధంగా రూపకల్పన చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత రంగాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేసేలా కార్యక్రమాలు, నివేదికలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాను గతంలో కంటే అన్ని రంగాల్లో ముందంజలో నిలుపడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సంక్షేమం, ధాన్యం సేకరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వాహణ, శాంతిభద్రతలు, విద్యాపరంగా ఉత్తీర్ణత శాతం మెరుగుపడటం తదితర అంశాల్లో జిల్లాను ముందంజలో ఉంచడం జరిగిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకముందు మరింత మెరుగైన ఫలితాలు అందించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఆయా శాఖల అభివృద్ధి, సంక్షేమం, ప్రాధాన్యత, పథకాల నివేదికను జిల్లా ప్రణాళిక అధికారికి ఈ నెల 18లోగా సమర్పించాలన్నారు. ఉద్యోగుల ప్రశంసా పత్రాలకు సంబంధించి సాధారణ విధులు కాకుండా ప్రశంసా పూర్వకంగా పని చేసే వారికే ప్రోత్సహించేలా ఉండాలని, ఈ అవార్డులు గతంలో ఇచ్చిన వారికి కాకుండా భాగా పని చేసే ఇతర సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నెల 19లోగా జాబితాలను సిద్ధం చేసి కలెక్టరేట్ కార్యాలయంలో సమర్పించాలని, ఆ తర్వాత వచ్చే వాటిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోబడదని స్పష్టం చేశారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను డీఆర్‌డీఓ, ఆర్టికల్చర్, సెరికల్చర్, నీటిపారుదల, ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ, మత్స్యశాఖ, మిషన్ భగీరథ, పశు సంవర్ధక శాఖ, డైరీ, నెడ్‌క్యాప్, ఆర్టీసీ, ఐసీడీఎస్ తదితర శాఖలకు సంబంధించినవి తయారు చేయాలన్నారు. అదే విధంగా పై శాఖలతో పాటు జాతీయ ఓటర్ల దినోత్సవంపై శకటాలను ప్రదర్శించాలన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎట్టి పరిస్థితుల్లో కాగితంతో తయారు చేయబడిన జెండాలను మాత్రమే ఉపయోగించాలని, ఫ్లాస్టిక్ జెండాలను వాడరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాతీయ జెండాను గౌరవంగా చూడాలని, కింద పాడేయడం లాంటివి చేయవద్దని కలెక్టర్ సూచించారు. గణతంత్ర దినోత్సవం రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్యతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవానికి
విస్తృత ఏర్పాట్లు

ఇందూర్, జనవరి 11: ఈ నెల 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పెద్దఎత్తున ఓటరు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఈ నెల 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రాధాన్యత, తేదీ 1-1-2019నాటికి 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా ఓటర్ల జాబితాలో పేరు నమోదు లేకుండా ఉండరాదన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలైన డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు, జిల్లా ఒకేషనల్ అధికారి, ఇంటర్మీడియట్ సంబంధిత శాఖలు, అధికారులు అన్ని చోట్ల ర్యాలీలు నిర్వహించాలని, ఉదయం 11గంటలకు విద్యార్థులు, ప్రజలచే ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 21న జిల్లాస్థాయిలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించి, నివేదికలను పంపించాలన్నారు. వాటిని ఈ నెల 24న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించడం జరుగుతుందన్నారు. బాల భవన్ ఆధ్వర్యంలో రంగోళి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్కువసార్లు ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లను, బీఎల్‌ఓలను సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి అంజయ్యతో పాటు ఆయా శాఖలకు సంబంధించిన పలువురు అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించని బీజేపీ

కంఠేశ్వర్, జనవరి 11: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓటమిపాలైన భారతీయ జనతా పార్టీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీరియస్‌గా తీసుకోకపోవడం శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో అడుగులేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రంలో తిరిగి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నదే ప్రస్తుతం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో పంచాయతీ ఎన్నికలను పట్టించుకోవడం లేదని వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఇప్పటికే బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ పార్టీ ఉద్దండులు సైతం ఓడిపోవడంతో క్రిందిస్థాయి క్యాడర్‌లో తీవ్ర నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా 118 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం హైదరాబాద్‌లోని గోషామహల్ స్థానాన్ని కైవసం చేసుకోవడం తెలిసిందే. మిగిలిన 117 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. పరిమిత స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినప్పటికీ, పూర్తిగా పట్టుకోల్పోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటడం ఆ పార్టీకి కత్తి మీద సాములా తయారైంది. పార్టీ మద్దతుతో అభ్యర్థులను సర్పంచ్‌లుగా బరిలో దింపినా, గెలిచిన తర్వాత వారు అధికార పార్టీలో చేరుతారని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో అంటిముట్టనట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది. అంతేగాకుండా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పార్టీకి అంతగా పట్టులేకపోవడంతో ఆ పార్టీ మద్దతుపై సర్పంచ్ అభ్యర్థులు ఆసక్తి కనబర్చడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలు తమకు అంత ప్రాధాన్యత కాదని, మా దృష్టంతా పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంటుందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. గ్రామ ఎన్నికల్లో పాల్గొని పరువుతీసుకునే బదులు, ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బలమైన క్యాడర్‌ను సిద్ధం చేసుకోవడంపై పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి హడావుడి చేయడం లేదన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు బీజేపీ నాయకులు మాత్రం తమ పట్టు నిలుపుకోవాలంటే పంచాయతీ పోరులో నిలవాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని బీజేపీ పార్టీ అధిష్టానానికి విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.

అటవీ శాఖ అధికారులతో
సీపీ కార్తికేయ సమీక్ష
ఇందూర్, జనవరి 11: రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్‌రేట్ పరిధిలోని అటవీ శాఖ అధికారులతో సీపీ కార్తికేయ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్ పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో అటవీ రక్షణ, కలప స్మగ్లింగ్, అటవీ భూముల దురాక్రమణ, వన్యప్రాణుల వేటను అరికట్టడం వంటి విషయాలపై క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. అదే విధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులకు, పోలీసు శాఖ సహకారం గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ వీఎస్‌ఎన్‌వీ.ప్రసాద్, అదనపు డీసీపీ ఎం.శ్రీ్ధర్‌రెడ్డి, ట్రైయినింగ్ ఐపీఎస్ అధికారి గౌస్ ఆలం, నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు శ్రీనివాస్‌కుమార్, డీ.రాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ టీ.వేణుబాబు, నిజామాబాద్, వర్ని, ఇందల్‌వాయి, భీమ్‌గల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, సీఐలు పాల్గొన్నారు.

ఓటు నమోదు చేసుకోవాలి
- కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ
లింగంపేట్, జనవరి 11: ఓటర్ నమోదు హెల్ఫ్ సెంటర్ ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి హెల్ప్ సెంటర్‌ల ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం లింగంపేట్ మండల కేంద్రంలో ఓటర్ నమోదు హెల్ప్ సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమైందని, జనవరి 1,2019నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్క విద్యార్థి ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు. తహశీల్ కార్యాలయం, కళాశాలలు, గ్రామ సమాఖ్యల వద్ద హెల్ప్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఫామ్ 6అందుబాటులో ఉంచడం జరుగుతోందని, ఓటు నమోదు చేసుకోని వారు అందరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు. కొంతమంది విద్యార్థులకు కలెక్టర్ డిక్షనరీలు, నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

పెర్కిట్‌లో పార్కు స్థలాన్ని పరిశీలించిన కమిషనర్
ఆర్మూర్, జనవరి 11: అర్మూర్ మండలం పెర్కిట్‌లోని వినాయక్‌నగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పార్క్ స్థలాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శైలజాపరిశీలించారు. వినాయక్‌నగర్‌కాలనీలో గల ప్రభుత్వ భూమిలో పిల్లలు ఆడుకునేందుకు ఉయ్యాల, జారుడుబండా, షటిల్ కోర్టు ఇతర వసతులను కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. లక్ష రూపాయల వ్యయంతో మోడల్ పార్క్‌గా ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ నెల ఆఖరు వరకు పనులను పూర్తిచేసి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేతుల మీదుగా పార్కును ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బట్టు నరేందర్, ఉపాధ్యక్షులు జుబ్బె గంగమోహన్, కార్యదర్శి చెలిమెల రాజేందర్, కోశాధికారి ఘటాడి శ్రీనివాస్, సుదర్శన్, బట్టు శ్రీనివాస్, శివ, రఫీ తదితరులు పాల్గొన్నారు.

బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్లకు రివార్డు

నందిపేట్, జనవరి 11: జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ఫాస్‌ల పరిధిలోని గ్రామాలలో పది సంవత్సరాలలోపు ఆడపిల్లల పేరున సుకన్య సమృద్ధి ఖాతాలు అత్యధికంగా తెరిచిన బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌కు రివార్డు అందించడమే కాకుండా ఆ గ్రామాన్ని సంపూర్ణ సుకన్య గ్రామంగా ప్రకటిస్తామని పోస్టల్ డిపార్ట్‌మెంట్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ జె.పండరి తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని సబ్‌పోస్ట్ఫాస్ కార్యాలయంలో శుక్రవారం సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన మూడేళ్ల బాలిక తల్లిదండ్రులకు పథకం ఖాతాను జిల్లా పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ జె.పండరి అందజేశారు. ఈ సందర్భంగా పోస్టల్‌శాఖ జిల్లా అధికారి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఆడపిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి ఖాతా పథకంను పోస్టల్ శాఖ ద్వారా అమలు చేస్తోందన్నారు. పుట్టిన బిడ్డ మొదలుకుని 10ఏళ్ల లోపు ఆడపిల్లలకు ఈ ఖాతా తెరవచ్చన్నారు. ఈ ఖాతాలో వేయి రూపాయలు మొదలుకుని లక్ష యాభైవేల వరకు ఏడాదిలోపు జమ చేయాలని, బాలికకు 21సంవత్సరాల తర్వాత ఖాతా మొత్తం చక్రవడ్డీతో చెల్లించడం జరుగుతుందని అన్నారు. అమ్మాయి వయస్సు 18సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె వివాహం లేదా విద్యాభ్యాసం కొరకు జమ చేసిన మొత్తంలో 50శాతం తీసుకునే సౌకర్యం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డ కలిగిన తల్లిదండ్రులు చాలా వరకు సుకన్య సమృద్ధి ఖాతా పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. గ్రామంలో పోస్టల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అర్హత గల బాలికలను గుర్తించాలని, వారి తల్లిదండ్రులకు ఖాతా పట్ల అవగాహన కల్పించి సుకన్య ఖాతాలు తెరిచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఉమ్మడి జిల్లాలో ఖాతాలు తెరువడంలో లక్ష్యం సాధించిన బ్రాంచ్ పోస్టుమాస్టర్‌లకు రివార్డు అందజేస్తామని వెల్లడించారు. అలాగే పోస్టల్ శాఖలో చాలా సేవింగ్స్ ఇన్సురెన్స్ స్కీం, ఖాతాలు అమలులో ఉన్నాయన్నారు. పోస్టల్ రిక్వైరింగ్ డిపాజిట్, టైం డిపాజిట్, నెలవారి ఆదాయ పథకం, కిసాన్ వికాస్ పత్రం, జాతీయ పొదుపు పత్రము, సీనియర్ సీటిజన్ ఖాతా, పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్, ఇవి రాష్ట్ర, కేంద్ర ఉద్యోగులకు మాత్రమేనని, దీనికి తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ చెల్లింపు ఉంటుంది. ఎండోమెంట్ పాలసీ, హోల్‌లైఫ్ పాలసీ, అంటిసీపేటెడ్ పాలసీ, మనీబ్యాక్ పాలసీ, గ్రామీణ తపాలా బీమా పథకాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య బ్యాంకుల కంటే పోస్టల్ శాఖలో అధిక వడ్డీ చెల్లింపు ఉంటుందని తెలిపారు. బ్రాంచ్ ఆఫీస్‌లలో ఏటా 100 కొత్త ఖాతాలు తెరువడం, 2.5లక్షల ఆర్‌పీఎల్ చేయిచడం లక్ష్యంగా ఉందని పండరి తెలిపారు.