నిజామాబాద్

సభాపతికి ప్రశంసల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 18: తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ స్పీకర్‌గా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఈ మేరకు శుక్రవారం ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా సహచర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులంతా సభాపతికి అభినందనలు తెలుపుతూ ప్రశంసల జల్లులు కురిపించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సమావేశంలోనే కాకుండా వ్యక్తిగతంగా సైతం పోచారంను కలిసి అభినందనలు తెలియజేశారు. తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మరికొందరు తెరాస నాయకులు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వెళ్లి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన పోచారంను కలిసి అభినందించారు. మరోవైపు పోచారం ప్రతిష్టాత్మక స్పీకర్ పదవిని చేపట్టడంతో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అనుచరులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పోచారం కుటుంబ సభ్యులంతా ఆయన బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో స్వయంగా పాలుపంచుకోగా, ముఖ్య అనుచరులంతా బాన్సువాడలోనే సంబరాలు చేసుకున్నారు. దాదాపు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పటికే అనేక పదవులను
నిర్వర్తించిన అనుభవం కలిగి ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పీకర్ పదవిలోనూ సమర్ధవంతంగా రాణిస్తారని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నమ్మకంతో సీఎం కేసీఆర్ సైతం పెద్దఎత్తున కసరత్తులు జరుపుతూ పలువురి పేర్లను పరిశీలించినప్పటికీ, పోచారంకు ఉన్న సుదీర్ఘ అనుభవం, వాగ్ధాటి, శాసనసభా వ్యవహారాల పట్ల పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండడాన్ని గమనించి ఆయనకు సభాపతిగా ఎన్నికయ్యే అవకాశం కల్పించారు.
ఓ వైపు అరుదైన గౌరవం...
మరోవైపు పరిమితులు...
కాగా, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్ పదవి వరించడాన్ని ఆయన అనుచరులు పలువురు అరుదైన గౌరవం లభించిందని పేర్కొంటూనే, ఈ పదవిలో కొనసాగే వారు పలు పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి రావడం ఒకింత ఇబ్బందికర పరిణామమే అని కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా శాసన సభాపతి హోదాలో ఉన్న వారు సాధారణంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావడం, నియోజకవర్గ అభివృద్ధిపై అధికారికంగా నిర్వహించే సాధారణ సమీక్షా సమావేశాలు వంటి వాటిని చేపట్టే అవకాశాలు లేకపోవడం, అన్నింటికి మించి అధికార, ప్రతిపక్షాలను సమానంగా పరిగణిస్తూ అందరివాడిలా చెలామణి కావాల్సి ఉంటుంది. ఇది పోచారం వ్యవహారశైలికి పూర్తి భిన్నమైనదిగా ఉంటుందని, ఈ తరహా పరిమితులతో కూడిన పదవిలో ఆయన ఏమేరకు రాణిస్తారన్నది వేచిచూడాల్సిందేనని పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే అత్యున్నత స్పీకర్ పదవిలో కొనసాగుతున్న దరిమిలా పోచారం ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గానికి ఎనలేని ప్రాధాన్యత దక్కనుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం పెద్దఎత్తున నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని, తద్వారా నియోజకవర్గం మరింతగా ప్రగతిని సాధించడం ఖాయమని పోచారం అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ పోచారం రూపంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రతిష్మాత్మక స్పీకర్ పదవి రెండవ పర్యాయం వరించిందని చెప్పవచ్చు.

మాజీ మంత్రి మహిపాల్‌రెడ్డికి ఘన నివాళి
ఆర్మూర్, జనవరి 18: ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద గల మాజీ మంత్రి ఏలేటి మహిపాల్‌రెడ్డి విగ్రహానికి శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 28వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ తన భర్త ఏలేటి మహిపాల్‌రెడ్డిని 28 సంవత్సరాలుగా నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకొని వర్ధంతికి రావడం గొప్ప విషయమని అన్నారు. తాము ఎప్పుడూ కార్యకర్తలకు రుణపడి ఉంటామన్నారు. మహిపాల్‌రెడ్డి తన పదవీ కాలంలో నీతి, నిజాయితికి కట్టుబడి పని చేశారని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. తాము పదవీ ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన ఉంటామని, మహిపాల్‌రెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవీ నర్సింహారెడ్డి, భజరంగ్, మోహన్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్, భూమారెడ్డి, ముజీబ్హ్రమాన్, ఇద్రీస్, పడగల్ రమేష్, బోజన్న, మహిపాల్, అఖీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
- ఎంపీడీఓ లింగయ్యనాయక్
భీమ్‌గల్, జనవరి 18: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 21వ తేదీన జరుగనున్న పోలింగ్‌కు సంబంధించి సామాగ్రిని మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం ఆవరణలో సంబంధిత అధికారులు సిద్ధం చేస్తున్నారు. సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఓటర్ లిస్టులు వివిధ సామాగ్రిని పోలింగ్ బూత్‌ల వారిగా పంపిణీకి సిద్ధం చేస్తున్నారని భీమ్‌గల్ ఎంపీడీవో లింగయ్యనాయక్ తెలిపారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు ఈ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని, ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అధికారులను సైతం 20వ తేదీ సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. భీమ్‌గల్ మండలంలో 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 20గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగునున్నాయని ఎంపీడీవో తెలిపారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. భీమ్‌గల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసే పనిలో స్థానిక సిబ్బంది నిమగ్నమై ఉన్నారని, శనివారం వరకు ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నికల నిర్వాహణ కోసం సిద్ధం చేస్తున్న సామాగ్రిని పరిశీలించి పలు సూచనలు చేయడం జరిగిందని ఎంపీడీఓ తెలిపారు.
ఉపాధి హామీ కూలీ మృతి
లింగంపేట్, జనవరి 18: మండలంలోని మాలపాటి నర్సరీలో శుక్రవారం ఉపాధిహామీ కూలి అయిన ఉప్పరి నర్సింలు(52) అనే కూలీ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శెట్‌పల్లి గ్రామానికి చెందిన నర్సింలు మాలపాటి గ్రామంలోని నర్సరీలో నూతనంగా నిర్మిస్తున్న నీటి ట్యాంక్ గద్దె నిర్మిస్తుండగా ఒక్కసారి గుండెపోటుకు గురి అయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతునికి భార్య పోచవ్వ, కుమారులు సందీప్, అభి, ఉన్నారు.

నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన ఎస్‌ఈ
నిజాంసాగర్, జనవరి 18: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాషయం 12,16,20 వరద గేట్లను, శుక్రవారం ఉమ్మడి జిల్లాల నీటిపారుదల శాఖ ఎస్‌ఈ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ప్రాజెక్ట్ నీటిమట్టంతోపాటు, పలు సమస్యలను గురించి స్థానిక ప్రాజెక్ట్ డీఈఈ దత్తాత్రి, ఏఈ శివప్రసాద్‌లను అడిగి తెలుసుకున్నారు. అలాగే హెడ్‌స్లూస్ జలవిద్యుత్ కేంద్రానికి అనుసందానంగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రథాన కాలువ గేట్లను పరిశీలించారు. అక్కడి నుంచి హెడ్ రెగ్యులేటర్, కళ్యాణి ప్రాజెక్ట్‌ను ఎస్‌ఈ పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్లు మరమ్మత్తు పనులు వేగవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలుతీసుకుంటున్నామన్నారు. రాబోయే వర్షాకాలం వరకు మరమ్మత్తు పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. వర్షాలు కురవడం ప్రారంభం అయ్యేలోగా ఏలాంటి పనులు పెండింగ్‌లోఉండ కుండా చూడాలని అధికారులను సూచించారు. ఆయన వెంట బోధన్ నీటిపారుదల శాఖ ఈఈ మధుకర్‌రెడ్డి, వర్క్ ఇన్స్‌పెక్టర్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.

ఓటు విషయంలో జాగ్రత్త

కామారెడ్డి, జనవరి 18: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి పేరు చూసి అండర్‌లైన్ చేసిన తరువాత, ఓటర్ లిస్టులో పేర్లను అందరికీ విన్పించేటట్టు చదివి ఇది అతని ఓటే అని నిర్ణయించుకున్న తర్వాత అతనికి ఓటు వేసే పత్రాన్ని అందించాల్సిందిగా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ సూచించారు. శుక్రవారం జిల్లాలోని సదాశివనగర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, స్టేజ్-2 అధికారులకు నిర్వహించిన శిక్షణ శిబిరానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, అభ్యర్థి యొక్క పేరును ఓటర్ స్లిప్‌లో ఎన్నో వార్డులో ఉన్నది, వార్డు పేరు రాసి ఇంటి నంబర్‌ను అదే బూత్‌కు పంపించాలని అన్నారు. ప్రతి పోలింగ్ అధికారి ఉదయం 6గంటల నుండి ఓటింగ్ మొదలుపెట్టి ఏజెంట్ సమక్షంలో నిర్వహించాలన్నారు. అభ్యర్థి ఎన్నికైన తరువాత (సర్పంచ్), ఉపసర్పంచ్) (వార్డు) ఎన్నికలు జరుగుతాయని, అందరినీ సమావేశపర్చి నోటీసు ఇచ్చిన తరువాత 30 నిమిషాల సమయం ఇచ్చి సర్పంచ్, వార్డు సభ్యుల ద్వారా ఓటింగ్ జరిపి సగం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చిన వారిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకోవాల్సిందిగా సూచించారు. ఈ శిక్షణ శిబిరంలో పిడి డిఆర్‌డిఎ చంద్రమోహన్‌రెడ్డి, పిఓ, ఎపిఓలు, స్టేజ్ -2అధికారులు, ఎంపిడివో పాల్గొన్నారు.

ముగిసిన నామినేషన్ల ఘట్టం

నవీపేట, జనవరి 18: గ్రామ పంచాయతీ సంగ్రామంలో ముఖ్యమైన నామినేషన్ల ఘట్టంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులు పోటెత్తారు. మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు, తమ అనుచరులతో కలిసి ర్యాలీగా తరలి వచ్చి ఉత్సాహంగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్యంగా మండల కేంద్రమైన నవీపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడుతున్న ఏటీఎస్ శ్రీనివాస్‌తో పాటు ఎంపీపీ రాజేంద్రకుమార్‌గౌడ్, సూరిబాబు తమతమ అనుచరులు, బంధువులతో కలిసి ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. గురువారం రోజున శివకుమార్, మరికొంతమంది వార్డు సభ్యులుగా నామినేషన్ వేయగా, శుక్రవారం నవీపేట మండల కేంద్రంలో గల 16వార్డులకు 100కు పైగా అభ్యర్థులను తమ నామినేషన్లను దాఖలు చేశారు.
తెరాసలో చేరిన సర్పంచ్ అభ్యర్థి
ఇదిలాఉండగా, గత కొన్ని రోజులుగా నవీపేట గ్రామ సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రచారం చేసిన ఏటీఎస్ శ్రీనివాస్ శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య తెరాస రాష్ట్ర నాయకుడు పోతంగల్ రాంకిషన్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీనివాస్‌తో పాటు అతని అనుచరులు, కుల సంఘ నాయకులు, కాంగ్రెస్ నేతలు మోస్రా సాయారెడ్డి, గోపాల్ తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు.

జనరల్ ఆసుపత్రిలో
ఐసీయూను ప్రారంభించిన కలెక్టర్
ఇందూర్, జనవరి 18: అత్యావసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను జిల్లా జనరల్ ఆసుపత్రిలో 8లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐసీయు యూనిట్‌ను కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనరల్ ఆసుపత్రిలో ఇప్పటికే ఐసీయు విభాగం ఉన్నప్పటికీ, మరింత అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయును రోగులకు అందుబాటులోకి తీసుకరావడం జరిగిందన్నారు. ఇందులో వైద్య పరికరాలు, సౌకర్యాలు గతంలో కంటే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. ఈ యూనిట్‌లో 5పడకలు, వెంటిలేషన్ సౌకర్యం, అత్యాధునీక పారా మానిటర్స్‌ను ఏర్పాటు చేయడంతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అనంతరం 12కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ట్రామా సూపర్ స్పెషాలిటీ కోనం నిర్మించే భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలతో భవన నిర్మాణ పనులు చేపట్టాలని, టెండర్‌లో పేర్కొన్న విధంగా పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాతో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

జోరుగా
పంచాయతీ పోరు
నందిపేట్, జనవరి 18: నందిపేట మండలంలో తొలి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నందిపేట మండల కేంద్రం సర్పంచ్ పదవి స్థానం బీసీ మహిళకు రిజర్వు కావడంతో మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా, చివరకు బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచారు. మండల కేంద్రానికి చెందిన నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిలెండర్ లింగం తల్లి ఎర్రం లక్ష్మీబాయి, సామాజిక కార్యకర్త ఎస్‌జీ తిరుపతి భార్య సాంబారు వాణి, కొత్తూరు అర్చన, మాజీ ఎంపీటీసీ సతీమణి గాండ్ల లక్ష్మీ, కానూరి శోభలు పోటీ పడుతున్నారు. దీంతో గత రెండు రోజుల నుండి సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. మహిళలు అభ్యర్థులుగా ఉండటంతో వారి భర్తలు, అత్తామామలు గడపగడపకు వెళ్లి తమ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని స్థానిక ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీ మద్దతుతో ప్రచారం అంతగా కనిపించకపోగా, కులాల వారి ఓటు బ్యాంకు మద్దతును నమ్ముకొని ప్రచారం సాగిస్తున్నారు. ఓటు బ్యాంకు అధికంగా ఉన్న అభ్యర్థులు ఇతర కుల సంఘాల ఓట్లను కొంత మేరకైన సాధించుకుంటే గెలుపు తధ్యం అన్న మనోధైర్యంతో ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

ఏదేమైనా మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీల ఓట్లు సర్పంచ్ అభ్యర్థి విజయానికి కీలకం కానున్నాయి. దీంతో రంగంలో ఉన్న అభ్యర్థులు మైనార్టీ నాయకులను మచ్చిక చేసుకొని ఓట్లు సాధించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాగా, మండల కేంద్రంలో ఎర్రం లక్ష్మీబాయి, సాంబారు వాణి అభ్యర్థుల మధ్యనే హోరాహోరి పోరు నెలకొందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఓటరు ఫిర్యాదు కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి

ఇందూర్, జనవరి 18: ఓటర్లు పలు విషయాలపై చేసే ఫిర్యాదులను నమోదు చేయడానికి ఏర్పాటు చేసిన ఫిర్యాదుల కేంద్రంలో అన్ని సదుపాయాలు సమకూర్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీ నుండి భారత ఎన్నికల కమిషన్ కార్యదర్శి కుషాల్ జిల్లాల కలెక్టర్లతో 1950 టోల్‌ఫ్రీ ఫిర్యాదులకు ఏర్పాటు చేసిన జిల్లా కాంటాక్ట్ కేంద్రంలో సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో 1950నెంబర్‌కు ఫోన్ చేసే ఎన్నికల కమిషన్‌కు వఎళ్లి, అక్కడి నుండి సంబంధిత జిల్లాలకు వెళ్లేదన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్ల వల్ల నేరుగా జిల్లా కేంద్రంలోని కాంటాక్ట్ కేంద్రానికి వెళ్తుందని, తద్వారా ఓటర్లు చేసే ఫిర్యాదు వెంటనే రిజిష్టర్ చేయబడి సంబంధిత అధికారికి పంపడం జరుగుతుందన్నారు. ఇందుకు కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు సమాధానం ఇస్తూ ఓటర్లు చేసే ప్రతి ఫిర్యాదును నమోదు చేయడానికి నలుగురు సిబ్బందిని నియమిస్తున్నామని, వీరు 12గంటల పాటు విధుల్లో ఉంటారని అన్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లా ఫిర్యాదు ఫిర్యాదు కేంద్రంలో కంప్యూటర్, స్కానర్, ఫ్రింటర్, ఇతరాత్ర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అలాగే ఒక ల్యాండ్‌ఫోన్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఓటర్ల ఫిర్యాదులను వెంటనే నమోదు చేయడానికి వీలవుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌ఓ అంజయ్య, హైదరాబాద్ నుండి సీఈఓ డాక్టర్ రజత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.