నిజామాబాద్

మలివిడతలో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం రోజునే జరిగిన గ్రామ పంచాయతీ మలివిడత ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొని తమ చైతన్యాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో తొలివిడతతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెరగడం విశేషం. తొలిదఫాగా ఆర్మూర్ డివిజన్‌లో ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ 78.56శాతం నమోదవగా, శుక్రవారం బోధన్ డివిజన్‌లో నిర్వహించిన పంచాయతీలో పోరులో 84.93శాతం సగటు పోలింగ్ జరగడం విశేషం. ఈ డివిజన్‌లోని ఆరు మండలాల పరిధిలో గల గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 142 గ్రామ పంచాయతీలకు గాను, ఏకగ్రీవాలను కలుపుకుని 141 గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. గుర్తుల కేటాయింపుల్లో పొరపాటు జరిగిన కారణంగా కోటగిరి మండలంలోని జల్లాపల్లిలో ఎన్నికను వాయిదా వేశారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం నాటికే 33 సర్పంచ్ స్థానాలు, 452 వార్డు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా చోట్ల పోలింగ్ జరిపి, ఓట్ల లెక్కింపు అనంతరం విజేతలను ప్రకటించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం తొమ్మిది గంటల సమయం వరకు ఒకింత మందకొడిగానే 28శాతం వరకు పోలింగ్ నమోదవగా, అనంతరం ఒక్కసారిగా పుంజుకుని 11గంటలకు 68శాతానికి చేరుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి సగటున 84.93శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ డివిజన్‌లో మొత్తం 1,66,558 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,41,456మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా బోధన్ మండలంలో 89.38శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా కోటగిరి మండలంలో 76.28శాతం ఓటింగ్ జరిగింది. ఈసారి కూడా పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుని చైతన్యాన్ని ప్రదర్శించారు. పురుషుల పోలింగ్ శాతం 83.55శాతంగా నమోదవగా, 86.22శాతం మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా నమోదైన పోలింగ్ తీరును పరిశీలిస్తే, బోధన్‌లో 89.38శాతం, కోటగిరిలో 76.28శాతం, రెంజల్‌లో87.13, రుద్రూర్‌లో 86.13, వర్నిలో 84.83, ఎడపల్లిలో 84.82శాతం మంది ఓటర్లు తమ (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)
ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించి, మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి ముందుగా వార్డు మెంబర్లను, అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తూ ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు, వారి అనుయాయులు కౌంటింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉత్కంఠతో కాలం గడిపారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి పొద్దుపోయేంత వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్తతలకు తావులేకుండా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను విధిస్తూ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ స్వయంగా ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్, వర్ని మండలంలోని మోస్రా, వర్ని, చందూర్‌లలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా చర్యలను పర్యవేక్షించారు. మరోవైపు కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు కూడా నెహ్రూనగర్, జానకంపేట్, ఏరాజ్‌పల్లి పోలింగ్ బూత్‌లను సందర్శించి ఓటింగ్ తీరును పరిశీలిస్తూ అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టిన ఫలితంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి ఒడిదుడుకులకు ఆస్కారం లేకుండా మలివిడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
‘కారు’ జోరు.. విపక్షాలు బేజారు
* మలివిడత పంచాయతీ పోరులోనూ గులాబీ రెపరెపలే
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 25: వరుస ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సాధిస్తున్న అద్వితీయ ఫలితాలతో ప్రతిపక్ష పార్టీలు బేజారెత్తిపోతున్నాయి. విడతల వారీగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంటుండగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు స్థానాలకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పటికే ముగిసిన మొదటి విడత పల్లె పోరులో దాదాపు 90శాతానికి పైగా స్థానాల్లో తెరాస మద్దతుదారులు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా ఎన్నికైన విషయం విదితమే. జిల్లాలోని ఆర్మూర్ డివిజన్‌లో మొదటి విడతలో ఏకగ్రీవాలను కలుపుకుని మొత్తం 177 గ్రామ పంచాయతీలకు గాను టీఆర్‌ఎస్ పార్టీ 103 స్థానాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. 30కు పైగా స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందగా, వారిలో సగానికి పైగా సర్పంచ్‌లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా శుక్రవారం బోధన్ డివిజన్‌లో జరిగిన రెండవ విడత ఎన్నికల్లోనూ దాదాపుగా ఇదే తరహా ఫలితాలు పునరావృతం అయ్యాయి. మొత్తం 141 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, ఏకగ్రీవాల నాటికే 30జీపీలను గులాబీ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోగలిగారు. మిగతా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు 90మంది సర్పంచ్‌లుగా గెలుపొందగా, కాంగ్రెస్ మద్దతుదారులు 31చోట్ల, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థులు 19మంది గెలుపొందినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే మొదటి, రెండవ విడతలను కలుపుకుని టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే 193 స్థానాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకోగా, (మిగతా 3వ పేజీలో)
(1వ పేజీ తరువాయి)కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ అత్తెసరు స్థానాలతో ఉనికిని చాటుకునే ప్రయత్నాలకే పరిమితం అయ్యాయి. అయితే పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సర్పంచ్‌గా ఎన్నికైన వారు ఏ పార్టీకి చెందిన వారన్నది అధికారికంగా వెల్లడించనప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలతో వారికి ఉన్న సంబంధాలను బట్టి బేరీజు వేస్తూ గులాబీ పార్టీకే స్పష్టమైన ఆధిక్యాన్ని పరిశీలకులు కట్టబెడుతున్నారు. మలివిడత ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. నిజానికి సర్పంచ్ స్థానాలకు బహుముఖ పోటీ జరిగిన చోట కూడా ఇద్దరు, ముగ్గురేసి చొప్పున తెరాస పార్టీ అనుకూలురే హోరాహోరీగా తలపడ్డారు. దీంతో గెలుపొందినది ఎవరైనప్పటికీ, వారంతా తెరాస మద్దతుదారులుగానే పరిగణించబడుతున్నారు. తటస్థంగా ఉన్న వారు, వ్యాపార వర్గాలకు చెందిన పలువురు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌లుగా ఎన్నికైన మీదట తాము అధికార పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడం జరిగింది. చివరి విడతగా ఈ నెల 30వ తేదీన జరుగనున్న నిజామాబాద్ డివిజన్ ఎన్నికల్లోనూ తెరాస పార్టీయే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని పరిస్థితులు చాటుతున్నాయి. ఇప్పటికే ఈ డివిజన్‌లో 40కు పైగా స్థానాలు ఏకగ్రీవం అవగా, పోలింగ్‌కు ముందే సర్పంచ్‌లుగా ఎన్నికైన వారంతా తెరాస మద్దతుదారులు కావడం విశేషం. పంచాయతీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా గులాబీ పార్టీలోనే జోష్ కనిపించగా, ఫలితాలు కూడా అదే స్థాయిలో వెలువడుతూ అధికార పార్టీని తిరుగులేని శక్తిగా మలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో తమ పార్టీ మద్దతుదారులు ఎన్నికవుతున్నందున, సమీప భవిష్యత్తులోనే జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇది తమకు లాభించే అంశంగా నిలుస్తుందని టీఆర్‌ఎస్ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ఈ హక్కును ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం పలు కార్యక్రమాలు చేపట్టారు. మున్సిపల్, మెప్మా, రెవెన్యూ, టీఎన్జీవోస్, ఎన్‌వైకే, స్పోర్ట్స్, ఎన్‌సీసీ తదితర సంస్థలు, ప్రభుత్వ శాఖల ఉద్యోగుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగగా, తిలక్‌గార్డెన్ చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తన ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో కూడి ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంటే అందుకు ఓటరు చైతన్యమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఉన్న శక్తి ముందు అన్నీ దిగదుడుపేనని అన్నారు. ఎవరిని ఎన్నుకోవాలన్నది ఓటరు నిర్ణయంపై ఆధారపడుతూ, పాలకులను స్వేచ్ఛగా ఎన్నుకునే అధికారాన్ని పౌరులకు రాజ్యాంగం ఓటు హక్కు ద్వారా కల్పించిందని గుర్తు చేశారు. ఓటరు ఎంత చైతన్యవంతమైతే ప్రజాస్వామ్యం అదే స్థాయిలో పరిరక్షించబడుతుందని సూచించారు. భారతదేశ ప్రజాస్వామ్య విధానాలను చూసి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యం ప్రకటిస్తాయని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకుని, ఎన్నికల్లో విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవడం ద్వారా ప్రజాస్వామ్యానికి, దేశాభివృద్ధికి దోహదపడిన వారవుతారని పేర్కొన్నారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18సంవత్సరాలు నిండిన వారంతా తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని, ఈ మేరకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు అవకాశం కల్పిస్తోందని, ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని సూచించారు. ఇదివరకు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు సైతం ఆన్‌లైన్‌లో ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని, ఒకవేళ లేనట్లయితే తక్షణమే ఆన్‌లైన్ ద్వారా కూడా పేరును నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఓటరు నమోదు తదితర వివరాలు, ఫిర్యాదులు, సూచనల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 1950కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఈ కాల్‌సెంటర్ ఉదయం 9 నుండి రాత్రి 9గంటల వరకు పని చేస్తుందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని, ప్రత్యేకించి ఈ దిశగా యువత, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని కూడా చైతన్యపర్చాలన్నారు. కాగా, జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించామని, ప్రచార రథం ద్వారా జిల్లా అంతటా ప్రచారం చేయడం జరిగిందన్నారు. అందరి సహకారంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇదివరకటితో పోలిస్తే ఒకింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైందని, ముఖ్యంగా దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లలో సదుపాయాలు కల్పించడం మంచి ఫలితాలు అందించిందని కలెక్టర్ పేర్కొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలతో పాటు ఉత్తమ బీఎల్‌ఓలను సన్మానించి మెమొంటోలు బహూకరించారు. సీనియర్ ఓటర్లను సత్కరించి, మిలీనియం, యువ ఓటర్లకు కొత్త ఎపిక్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్ కమిషనర్ కార్తికేయ, జే.సీ వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ అంజయ్య, మున్సిపల్ కమిషనర్ జాన్‌సాంసన్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, జిల్లా క్రీడాధికారి కృష్ణారావు, డీఎస్‌డీఓ కృష్ణప్రసాద్, ఎన్‌వైకే కోఆర్డినేటర్ రాంచందర్‌రావు, మెప్మా పీ.డీ రాములు, డీఐఈఓ ఒడ్డెన్న, ఏపీడీ వినయ్‌కుమార్, బాల్‌భవన్ సూపరింటెండెంట్ ప్రభాకర్ పాల్గొన్నారు.

నందిపేట్‌లో జాతీయ ఓటరు దినోత్సవం
:: విద్యార్థుల ర్యాలీ, మానవహారం ::
నందిపేట్, జనవరి 25: నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని మండల అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయం నుండి తహశీల్దార్ అలివేలు, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు చేత బట్టుకుని ‘ఓటరుగా పేరు నమోదు చేసుకో, ఓటు హక్కు నిజాయితీగా వినియోగించుకో’ అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా నందిపార్క్ వరకు ర్యాలీ చేసి, నందిపార్కు చౌరస్తాలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మానవహారం నిర్వహించారు. అవినీతికి అవకాశం ఇవ్వకుండా, ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకుంటాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు మహేందర్‌రెడ్డి, డీటీ రవీందర్, ఆర్‌ఐ వినోద, పీడీ అమరవీర్‌రెడ్డి, వీఆర్వో రాజేశ్వర్, ఎంపీటీసీ అహ్మద్‌ఖాన్, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో ఓటరు దినోత్సవం
బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన బాల్కొండలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. జూనియర్ కళాశాలలో, కస్తూర్భాగాంధీ విధ్యాలయాల్లో స్థానిక రెవెన్యూ అధికారులు ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మండలంలోని శ్రీరాంపూర్ గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. కిసాన్‌నగర్ గ్రామంలోని వీరాయూత్ ఆధ్వర్యంలో ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి, ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిర, కళాశాల ప్రిన్సిపాల్ చిన్నయ్య, వీరాయూత్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, సభ్యులు వేణు, స్వామినాథ్, నర్సయ్య, ఆర్‌ఐ హరీష్, వీఆర్వో నాగరాజు, ముప్కాల్ తహశీల్దార్ బాసిద్ తదితరులు పాల్గొన్నారు.
నర్సింహునికి ప్రత్యేక పూజలు
భీమ్‌గల్, జనవరి 25: భీమ్‌గల్ పట్టణంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారికి వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం హంసవాహన సేవ, శుక్రవారం పాదపూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పట్టు వస్త్రాలతో, బంగారు ఆభరణాలతో అలంకరణ చేశారు. అనంతరం వేద బ్రాహ్మణులు ఉదయం నుండి స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ఈ సందర్భంగా ఉచిత అన్నసత్రంను కూడా ఏర్పాటు చేశారు. భీమ్‌గల్ గ్రామంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.