నిజామాబాద్

ఎన్నికల నియమావళిని పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 2: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైన దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తు.చ తప్పకుండా పాటించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తన చాంబర్‌లో ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాల గురించి అవగాహన కల్పించారు. ఈ నెల 9వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, ప్రతిరోజు ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చని సూచించారు.నామినేషన్ వేసే అభ్యర్థులు తప్పనిసరిగా జిల్లాలో ఓటరు అయి ఉండాలని, అతని నామినేషన్‌ను బలపరుస్తూ పది మంది ఈ ఎన్నికకు ఓటు వేసే ఓటర్లు సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికకు బ్యాలెట్ పేపరు ముద్రిస్తామని, బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థి పేరు, ఫొటో ముద్రిస్తామని తెలిపారు. 10వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 12వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారని, అనంతరం 27న నిజామాబాద్, బోధన్, కామారెడ్డిలలో పోలింగ్ జరుగుతుందని, 30న ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాన్ని వెల్లడిస్తామని అన్నారు. నిజామాబాద్‌లోని జడ్పీలో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ కేంద్రం పరిధిలో 340మంది ఓటర్లు ఉండగా, బోధన్ మున్సిపల్ కౌన్సిల్ పోలింగ్ కేంద్రంలో 233మంది, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ పోలింగ్ సెంటర్‌లో 192మంది ఓటర్లు ఉన్నారని, మొత్తం 765మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన నవంబర్ 24వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని, ప్రతి ఒక్కరూ ఈ నియమావళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో తెరాస ప్రతినిధిగా రవిచందర్, కాంగ్రెస్ తరఫున జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ సుమీర్‌అహ్మద్, టిడిపి తరఫున రాజమల్లు, ఎన్నికల విభాగం సిబ్బంది కాళిదాస్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని వివిధ విభాగాలకు ఆరుగురు అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్ యోగితారాణా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నియమావళి అమలు పర్యవేక్షణ కోసం నోడల్ అధికారిగా అదనపు జె.సి డాక్టర్ పి.రాజారాంకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతుల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారిగా డ్వామా పి.డి కె.వెంటేశ్వర్లును నియమించారు. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు గాను నోడల్ అధికారిగా జిల్లా సహకార శాఖ అధికారి శ్రీహరికి బాధ్యతలు కట్టబెట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ప్రసాద్‌కు అప్పగిస్తూ నోడల్ అధికారిగా నియమించారు. ఎన్నికల సమాచారం అందించడం కోసం సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకుడువెంకటేశ్వర్లును, కంప్యూటరైజేషన్, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల స్వీకరణకు గాను ఎన్‌ఐసి జిల్లా ఇన్‌చార్జ్ కృష్ణ కార్తిక్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నోడల్ అధికారులుగా నియమించారు.

ఇక తేలాల్సింది అభ్యర్థులే
ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 2: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో అందరి దృష్టి అభ్యర్థులు ఎవరనే దానిపైనే కేంద్రీకృతమైంది. ప్రధాన రాజకీయ పక్షాలేవీ ఇంతవరకు ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ నెల 9వ తేదీ వరకే నామినేషన్లను సమర్పించాల్సిన గడువు ముగియనుండడంతో ఆలోపే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండడంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సన్నద్ధమైన జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారిగా డిఆర్‌ఓ మోహన్‌లాల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జె.సి చాంబర్‌లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న నామినేషన్ల పరిశీలన జరిపిన మీదట 12వ తేదీన ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. 27వ తేదీన పోలింగ్‌ను నిర్వహించి, 30వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కు కలిగి ఉన్న మొత్తం 766మందికి గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఇదివరకు కేవలం జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్ హాల్‌లోనే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ల వారీగా నిజామాబాద్‌తో పాటు కామారెడ్డి, బోధన్‌లలో కూడా అదనంగా మరో రెండు పోలింగ్ కేంద్రాలను నెలకొల్పారు. నిజామాబాద్‌లో యథాతథంగా జడ్పీ మీటింగ్ హాల్‌లోనే పోలింగ్ కేంద్రం కొనసాగనుండగా, కామారెడ్డి, బోధన్‌లలో మున్సిపాలిటీలలో పోలింగ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ అధికార యంత్రాంగం ఏర్పాట్లను చేపట్టి ముందుకు సాగుతుండగా, ఆయా పార్టీల తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు ఎవరన్నది ఖరారైన మీదట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకోనుంది. ప్రధానంగా అధికార తెరాస పార్టీ తరఫున బరిలోకి దిగేందుకు అనేక మంది ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి అభ్యర్థిత్వం అవకాశం దక్కని డాక్టర్ భూపతిరెడ్డితో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్, మైనార్టీ నేత ఎస్‌ఎ.అలీం తదితరులు అభ్యర్థిత్వం వేటలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. అయితే అధిష్ఠానం మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మరికొందరు కొత్త నేతల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుడు డి.శ్రీనివాస్ తనయుడు, నగర మాజీ మేయర్ డి.సంజయ్ కూడా ఎమ్మెల్సీ టిక్కెట్ రేసులో కొనసాగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలా అధికార పార్టీలో అభ్యర్థిత్వాల కోసం పోటాపోటీ కొనసాగుతుండగా, ప్రతిపక్షాల్లో మాత్రం ఇంకనూ స్తబ్ధత దూరం కాలేకపోతోంది. వలసల కారణంగా స్థానిక సంస్థల్లో తెరాస తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న వారి సంఖ్య గణనీయంగా ఉండడంతో విపక్షాలు పోటీకి తటపటాయిస్తున్నాయి. బొటాబొటీ స్థానాలున్న టిడిపి, బిజెపిలను మినహాయిస్తే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అభ్యర్థిని పోటీకి నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ తరఫున డిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీనియర్ నేత తాహెర్‌బిన్ హందాన్‌ను కానీ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నగేష్‌రెడ్డిని కానీ బరిలోకి నిలుపాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, ఇక అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది.

అధికారులు జవాబుదారీతనం వహించాలి
కలెక్టర్ యోగితా రాణా
కంఠేశ్వర్, డిసెంబర్ 2: రెవెన్యూ అధికారులు పని వేళలు పాటిస్తూ ప్రజలకు జవాబుదారీతనం వహించాలని, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహించాలని కలెక్టర్ యోగితారాణా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని మండలాలు, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని జెసితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది ఉదయం 10.30గంటలకు కార్యాలయానికి హాజరు కావాల్సి ఉండగా 15నిమిషాల గ్రేస్ టైమ్‌కు మించి ఆలస్యంగా వచ్చేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఉదయం, మధ్యాహ్నం బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని, వీరి హాజరును తహశీల్దార్లు, ఆర్డీఓలు పర్యవేక్షించి, జెసి, డిఆర్‌ఓలకు ప్రతిరోజు నివేదించాలన్నారు. రెవెన్యూ అధికారులపై ప్రజల నుండి తరుచూ ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటికి అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. ఇకనైనా అధికారులు పనితీరును మార్చుకుని, ప్రజలకు బాధ్యతతో పని చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కూడా వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, అందువల్ల రెవెన్యూ అధికారులు జాగ్రత్తతతో విధులు నిర్వహించాలని, లేదంటే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జెసి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, అధికారులు నిబద్ధతతో పని చేయాలని, సిబ్బంది కదలికలను రాష్ట్ర స్థాయిలో నిశితంగా పరిశీలించడం జరుగుతుందని, నిబంధనలు అనుసరించి నడుచుకోవాలన్నారు. లబ్ధిదారులు అనర్హులుగా ఉంటే రాతపూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేయాలని, దరఖాస్తులు తమవద్ద పెట్టుకుని ఫిర్యాదులకు ఆస్కారం ఇవ్వద్దని అన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
కంఠేశ్వర్, డిసెంబర్ 2: ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రైవేటు సంస్థల చేతికి అప్పగించాలని చూస్తోందని, ఇది ప్రభుత్వ దివాళకోరుతనానికి నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ప్రస్తుత సిఎం కెసిఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కి సర్కార్ వైద్యాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికే మున్సిపల్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనులు చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటుపరం చేస్తే కార్పొరేట్‌శక్తులు విజృంభించి, పేదల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోవెంకట్, గోవర్ధన్, వెంకట్‌గౌడ్, మధు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యగౌడ్
బోధన్ రూరల్, డిసెంబర్ 2:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారని, వీరి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ సత్యగౌడ్ అన్నారు. బుధవారం బోధన్‌లో తాలూకా ఉద్యోగుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. నూతన కార్యవర్గాన్ని ఉద్యోగులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎన్నికలకే పరిమితం కాకుండా ఎళ్లవేళలా సమిష్టిగా ఉండాలని సూచించారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఇందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే కొన్ని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని, మరిన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర కార్యవర్గానికి హామీలిచ్చిందన్నారు. ఉద్యోగులు చిత్తశుద్దిగా విధులు నిర్వహించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగ సంఘానికి కూడా చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉంటాయని ఈ విషయాన్ని ప్రతీ ఉద్యోగి గుర్తుంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ, కార్యదర్శి శ్రీనివాస్‌చారి, బోధన్ అధ్యక్షుడు విద్యాసాగర్, అసోసియేట్ అధ్యక్షుడు రాజా, ఉపాధ్యక్షులు శంకర్, రాజు, రంగారావ్, విజయ్, వెంకటి, వామన్‌రావ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సహాయ కార్యదర్శులు శంకర్, చంద్రశేఖర్, సుమతి, సాగర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నవీన్, అహ్మద్ పాషా, కోశాధికారి లక్ష్మినారాయణ, మహిళా ప్రతినిధులు శ్రీలత, ఆనందిని పాల్గొన్నారు.

ఫ్యాక్టరీ కోసం కార్మికుల
రిలే నిరాహార

నీతివంత సమాజాన్ని నెలకొల్పాలి
బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : కలెక్టర్
కలెక్టరేట్(నల్లగొండ), డిసెంబర్ 2: అవినీతిని అరికట్టి నైతిక విలువలతో కూడిన నీతివంతమైన సమాజాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో ఈనెల 3నుంచి 9వరకు నిర్వహించబోయే అవినీతి వ్యతిరేక వారోత్సవాలలో భాగంగా అవినీతి వ్యతిరేక నిరోధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య లంచం ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదని, దేశ సమగ్రతకు, శాంతి భద్రతలకు ముప్పుగా పరిణమించడం చిన్న విషయం కాదన్నారు. అర్హత ఉన్న వారు కూడా ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను కోల్పోవలసి వస్తుందని, అవినీతి అన్ని రంగాలపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రజల సామూహిక భాగస్వామ్యంతో అవినీతిని నిర్మూలించగలమన్నారు. అవినీతిని నిర్మూలించాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ అవగాహన రాహిత్యంలో అవినీతిని నిర్మూలించకపోతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రోత్సహించకుండా చట్టబద్దంగా, న్యాయబద్దంగా కావాల్సిన పనిని హక్కుగా పొందాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా అవినీతి నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. లంచం ఇవ్వడం, లంచం ఆశించిన వారి విషయంలో తక్షణ చర్యలు చేపట్టేందుకు ఏజెన్సీలను ప్రత్యేక విభాగాలను సంప్రదించాలని అవినీతిరహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరు సహకరించాలని కలెక్టర్ కోరారు. అవినీతిని నిర్మూలించి దేశప్రగతికి యువత పాటు పడాలన్నారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 3 నుండి చేపట్టే అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జెసి వెంకటరావు, డిఆర్‌వో రవి పాల్గొన్నారు.
భూ సేకరణ వేగవంతం చేయాలి
జిజిల్లా ఇరిగేషన్ ప్లాన్ సత్వరమే సమర్పించాలి
జిఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.కె.జోషి అధికారులను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రాజెక్ట్‌ల భూ సేకరణ పనులు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చేపట్టిన 25 నూతన ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. జివో 123మార్గదర్శకాల మేరకు రైతులతో చర్చించి భూ సేకరణ జరిపి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ జివో ప్రకారం జిల్లా కలెక్టర్లు తమ వద్ద ఉన్న నిధులను సద్వినియోగం పర్చాలని, భూ సేకరణ విషయంలో కలెక్టర్లే తుది నిర్ణయమని, ఏలాంటి అనుమతులు అవసరం లేదన్నారు. నిధుల కొరత ఉంటే వెంటనే తెలపాలని కోరారు. భూ సేకరణకై అవసరమగు రిటైర్డ్, ప్రైవేట్ సర్వేయర్లను నియమించుకొని సత్వరమే పనులు పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల నిర్వాసితులకు కాలనీల నిర్మాణం, విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి వౌలిక సౌకర్యాలు, సహాయక పునరావాస పనులు యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ, హర్టికల్చర్, డ్వామా వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర సమాచారం సేకరించి, జిల్లా ఇరిగేషన్ ప్లాన్ సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఇరిగేషన్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని తద్వారా కేంద్రం నిధులు విడుదల చేస్తుందని, కావున అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మిషన్ కాకతీయ మొదటి విడత గ్రౌండింగ్ చేపట్టిన చెరువుల పునర్దురణ పనులు నూరు శాతం పూర్తి చేయాలని, రెండవ విడత పనుల గ్రౌండింగ్‌కై చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన డిండి ప్రాజెక్ట్ భూ సేకరణకు 11వేల 425 ఎకరాలకు గాను 9వేల ఎకరాలు సేకరించామని, గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్ పనులకు నూరు శాతం భూ సేకరణ పూర్తి అయ్యిందన్నారు. మరో రెండు రిజర్వాయర్ పనులకు త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేస్తామని జిల్లా ఇరిగేషన్ ప్లాన్ రూపొందించడంలో ఇప్పటికే సంబంధిత అధికారులతో సమావేశమై చర్యలు తీసుకున్నామని, జనవరి మొదటి వారంలో ప్లాన్ సమర్పిస్తామన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా మొదటి విడతగా జిల్లాలో 811చెరువులకు గాను 132చెరువుల పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రెండవ విడతగా 1113 చెరువులను గుర్తించామని, దీనిలో 312 చెరువుల సర్వే చేసి అంచనాలు రూపొందించినట్లుగా తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌సీఎంఆర్పీ, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, డిఆర్‌వో రవినాయక్, ఆర్డీవోలు, ఇరిగేషన్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
పెద్దవూర, డిసెంబర్ 2: అర్హులైన ఎస్‌సి, ఎస్‌టిలకు ఇళ్ల స్థలాలు, 3ఎకరాల భూమి ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కున్‌రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చాక వాగ్ధానాలు విస్మరించి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. దళిత, గిరిజన పేదలకు ఇస్తానన్న ఇండ్లు, డబుల్ బెడ్‌రూంలు, మూడు ఎకరాల భూమి ఇవ్వకుండా తన దొరతనాన్ని చూపిస్తున్నాడని, సామాన్యులకు వౌలిక వసతులు కల్పిస్తానని చెప్పి మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రామపంచాయితీలలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శి అశోక్, రమావత్ శ్రీరాములు, భిక్షమయ్య, వీరెపల్లి మల్లమ్మ, కవిత, సారమ్మ, ఆదిలక్ష్మీ, నాగలక్ష్మీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో..
తొలిరోజు నామినేషన్లు నిల్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, డిసెంబర్ 2: నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం తొలి రోజు బుధవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జెసి వెంకట్రావు, సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్‌వో రవినాయక్‌ల నుండి పలు పార్టీల నేతలు నామినేషన్ల పత్రాలు తీసుకెళ్లినప్పటికీ ఎవరూ కూడా తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడనున్న టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల నుండి అభ్యర్థుల ఖరారు జరుగకపోవడం, అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధిష్ఠానాలు కసరత్తులో ఉండటం నామినేషన్ల పర్వంపై ప్రభావం చూపుతుంది. అటు ఇతర పార్టీల నుండి, ఇండిపెండెంట్‌ల నుండి కూడా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
తల్లులకు శిశువుల అప్పగింత
జి డిఎన్‌ఎ టెస్ట్‌కు కట్టుబడి ఉంటామని హామీపత్రం
సూర్యాపేట, డిసెంబర్ 2: నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్న బిడ్డలు కళ్లేదుటే ఉన్నా.. వారిని అక్కున చేర్చుకోలేని స్థితితో మాతృత్వం ద్రవించింది. తల్లిపాల కోసం శిశువులు గుక్కపెట్టి ఏడుస్తున్న తీరు ఆ ఇద్దరు తల్లులకు కనువిప్పు కలిగించింది. శిశువులు మారారాంటూ కొనసాగుతున్న వివాదం ముగియక ముందే తాత్కాలికంగా తాము పిల్లలను సాకుతామంటూ ముందుకు వచ్చేలా చేసింది. స్థానిక ఏరియా ఆసుపత్రిలో రెండురోజుల క్రితం అప్పుకే పుట్టిన శిశువుల విషయంలో నెలకొన్న వివాదానికి బుధవారం తాత్కాలికంగా తెరపడింది. గత రెండురోజులుగా ఆసుపత్రిలోనే ఉంటున్న తమ పిల్లలు సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుండంతో ఆ తల్లుల మనస్సు కరిగింది. దీనికి తోడు బంధుమిత్రులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బిఎం.చంద్రశేఖర్ ఇద్దరు శిశువుల తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇవ్వడంతో వారు ఆసుపత్రి రికార్డు ప్రకారం శిశువులను తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో హమీపత్రాన్ని రాయించారు. ఆసుపత్రి రికార్డు ప్రకారం గుండగాని పుష్పలతకు మగ శిశువును, గంటా లావణ్యకు ఆడశిశువును అప్పగించారు. వివాదం కొనసాగుతున్న పోలీసులు డిఎన్‌ఎ పరీక్షలకు పిలిచిన సమయంలో పిల్లలతో సహా వెళ్లాలని, డిఎన్‌ఎ నివేధిక ఆధారంగా పిల్లలను తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లుగా హమీపత్రాన్ని తీసుకున్న అనంతరం శిశువులను తల్లులకు అప్పగించారు. ఈలోగా శిశువులకు ఎలాంటి అనారోగ్యం కలిగినా తక్షణమే ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యం చేయించాలని సూచించారు. మొత్తానికి పుట్టినప్పనుండి మాతృత్వనికి దూరమైన పసిపిల్లలు తల్లుల ఒడి చేరడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు.
రైలు వ్యాగన్‌లో మంటలు
ఆలేరు, డిసెంబర్ 2: ఆలేరు రైల్వే స్టేషన్‌లో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బొగ్గుతో కూడిన రైల్వే వ్యాగన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్టేషన్ మాస్టర్ ఆదేశాల మేరకు గూడ్స్ డ్రైవర్ ఆకస్మికంగా స్టేషన్‌లో రైలును ఆపేశారు. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు భువనగిరి అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి హుటాహుటిన ఆలేరు రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు. సుమారు 3 గంటల మేరకు అగ్నిమాపక సిబ్బంది బొగ్గు నుంచి వచ్చే మంటలను అదుపుచేశారు. అనంతరం బొగ్గుతో కూడిన గూడ్స్ రైలు హైదరాబాద్‌కు బయల్దేరింది. ఈలోపు హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, బెల్లంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌కు అర్ధగంట పాటు ఆలస్యమైంది.
మత్తుమందిచ్చి బాలికపై అత్యాచారం
* ముగ్గురిపై కేసు
నకిరేకల్, డిసెంబర్ 2: అత్యాచారం చేసిన సంఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నకిరేకల్ సిఐ వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేతేపల్లి మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఓవిద్యార్థిని నకిరేకల్ పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఆమెపై వరుసకు మేన బావ అయిన అదే గ్రామానికి చెందిన బట్టు నరేష్ నవంబర్ 28న అత్యాచారం చేయడంతో బాధితురాలి తండ్రి దుర్గం పీరయ్య మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని తెలిపారు. 28వ తేదీ మధ్యాహ్నం కళాశాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని బట్టు నరేష్ బావ శ్రీ్ధర్ తమ రూంలో భోజనం చేద్దామని తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న బట్టు నరేష్, శ్రీ్ధర్‌లు విద్యార్థినికి భోజనం పెట్టారు. భోజనంలో మత్తు మందు కలపడంతో స్పృహ కోల్పోయిన విద్యార్థినిపై నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యులైన నరేష్, శ్రీ్ధర్, నరేష్ చెల్లెలు సరితలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.
డిండి ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు
వేగవంతం చేయాలి : ఇన్‌చార్జి జెసి
రామగిరి, డిసెంబర్ 2 : డిండి ప్రాజెక్ట్ భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ వెంకట్రావ్ కోరారు. బుధవారం ఆయన తన ఛాంబర్‌లో సర్వే భూ రికార్డుల శాఖకు చెందిన సర్వేయర్, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లతో సమావేశమై భూ సేకరణ పనులు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేయర్లకు టి ఎ, డి ఎల చెల్లింపులతో పాటు సర్వే పరికరాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా మోబైల్ ఫోన్‌లో సర్వేయర్లతో గ్రూప్ కాల్స్‌కు సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని రకాల వౌలిక సౌకర్యాలను సర్వేయర్లకు సమకూర్చడం ద్వారా పనులు వేగవంతం పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో సర్వే భూమి రికార్డుల శాఖ ఎడి శ్యాంసుందర్‌రెడ్డి, శ్రీనివాస్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు
* ఆర్డీఓ కిషన్‌రావు
మిర్యాలగూడ, డిసెంబర్ 2: ఎన్నికల నియమావళిని అన్ని రాజకీయపార్టీలు ఖచ్చితంగా ఆచరించాలని, ఉల్లంఘించిన రాజకీయపార్టీలపై వివిద చట్టాల కింద తగిన విధంగా శిక్షించడం జరుగుతుందని ఆర్డీఓ కిషన్‌రావు అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో నల్లగొండ జిల్లా స్తానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలు-2015 ఎన్నికల ప్రవర్తన నియమావళిపై రాజకీయపార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాజకీయపార్టీ అభ్యర్దిగాని పరసర్ప విద్వేషం కల్పించరాదని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆయన సూచించారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం కాని ఒకరికి బదులు మరొకరు ఓటు వేయడం, పోలింగ్ కేంద్రం నుండి వంద మీటర్ల లోపల ప్రచారం చేయడం, పోలింగ్ చేసేందుకు ఓటర్లను తీసుకురావడం వంటి చర్యలకు పాల్పడవద్దని ఆయన అన్నారు. ఆయా రాజకీయపార్టీల అభ్యర్దులు ఎవరైనా వ్యక్తికి చెందిన భూమి, భవనం, ప్రహారీగోడను అనుమతి లేకుండా ఉపయోగించుకోరాదని ఆయన సూచించారు. ఆయా ఇంటి యజమానికి సంబంధించిన లిఖిత పూర్వకమైన అనుమతిని తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారంలో లౌడ్ స్పీకర్ల వినియోగం ఉదయం 6గంటల నుండి రాత్రి 10గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని, ఆ తరువాత వినియోగిస్తే చర్యలు తప్పవని, లౌడ్ స్పీకర్లు వినియోగించే వాహనాలకు అనుమతి తీసుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఉపయోగించే వాహనాలన్నింటిని జిల్లా అధికారికి తెలియచేసి అనుమతి పొందాలని ఆయన సూచించారు. సమావేశాలు నిర్వహించేందుకుగాను లౌడ్‌స్పీకర్లు ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకోని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. పోలింగ్ సమయంలో ఆయాపార్టీలు, అభ్యర్దులు పోలింగ్ కేంద్రం నుండి 200మీటర్ల లోపల ఎటువంటి బూత్‌ను ఏర్పాటుచేయరాదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం సూచించిన విధంగా ఆయా రాజకీయపార్టీల అభ్యర్దులు వ్యవహరించాలని, ఆ నియమాలను అతిక్రమిస్తే చర్యలు తప్పని ఆయన అన్నారు. సమావేశంలో తహశీల్దార్ మాలి కృష్ణారెడ్డి, డిప్యూటి తహశీల్దార్ రఘునాద్, టిఆర్‌ఎస్ రైతువిభాగం జిల్లా అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జునాచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్ధుంపాషా, సిపిఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరెపల్లి వెంకటేశ్వర్లు, ఎంపిపి ఒగ్గు జానయ్య, సిపిఐ మండల కార్యదర్శి బంటు వెంకటేశ్వర్లు, ఎంసిపిఐయు డివిజన్ కార్యదర్శి వస్కుల మట్టయ్య, వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర నాయకులు ఎండి.సలీం పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల మెరుపు సమ్మె
కోదాడ, డిసెంబర్ 2: కోదాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలల పెండింగ్ వేతనాలు, 8 నెలల ప్రావిడెంట్ ఫండ్, ఇయస్‌ఐ అలవెన్స్‌లను వెంటనే చెల్లించాలని, గతంలో సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హమీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కోదాడలో మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో మెరుపుసమ్మెకు దిగారు. ఉదయం ఐదు గంటలకు విధులకు హాజరుగాకుండా మున్సిపాలిటీ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జుట్టుకొండ బసవయ్య మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో దుర్భరజీవితాలు గడుపుతున్న మున్సిపల్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అధికారులు కార్మికుల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఖాతాలో ప్రతి నెల పదవ తేదిలోపు వేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్, ఇయస్‌ఐ డబ్బులు గత 8 నెలలనుండి వేయకుండా అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల నలుగురు పారిశుధ్య కార్మికులు అనారోగ్యానికి గురైతే ఇయస్‌ఐ డబ్బులను మున్సిపల్ అధికారులు చెల్లించని ఫలితంగా వేలాది రూపాయలను ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల వేతనాలను 15 వేలకు పెంచాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని సమ్మె చేస్తే నెలరోజుల్లో సమస్యలు పరిష్కరించేందుకు హమీ ఇచ్చిన కెసిఆర్ తరువాత పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే మరోపోరాటం చేయక తప్పదని ఆయన ప్రకటించారు. కార్మికుల సమ్మెకు స్పందించిన మున్సిపల్ కమీషనర్ బాలోజీనాయక్, ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత, కౌన్సిలర్ వాడపల్లి వెంకటేశ్వర్లు రేపటివరకు మూడు నెలల జీతాలు, పెండింగ్ పియఫ్, ఇయస్‌ఐలను పదితేదిలోగా, జీతాలను ప్రతినెల ఐదవతేదిలోగా చెల్లిస్తామని హమీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాధాకృష్ణ, ముత్యాలు, మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ అద్యక్ష, కార్యదర్శులు ఏపూరి గురుస్వామి, జియల్ నర్సింహారావు, కుడుముల గోపి, నాగేశ్వర్‌రావు, బెనర్జీ, లింగమ్మ, ధనమ్మ పాల్గొన్నారు.
ఘనంగా లక్ష్మీపూజ
దేవరకొండ, డిసెంబర్ 2: కార్తీకమాసాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక ఎస్‌బిహెచ్‌లో బ్యాంక్ సిబ్బంది ఘనంగా లక్ష్మీపూజను నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ సర్వజిత్‌సేన్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది ఎన్‌విటి, భాస్కర్, పవన్, వెంకన్న, సుబ్రహ్మణ్యం, రాజు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా కోసం వెనుకడుగు లేదు
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబర్ 2: యాదాద్రిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న తన పోరాటంలో వెనకడుగు లేదని తన కంఠంలో ప్రాణమున్నంత వరకు యాదాద్రి జిల్లా కోసం పోరాడతానని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు స్పష్టం చేశారు. బుధవారం గుట్టలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు తాను చేపట్టిన యాదాద్రి జిల్లా కేంద్రం సాధన దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుండి మద్ధతు లభించడం ఆనందంగా ఉందన్నారు. భువనగిరి, యాదాద్రి జిల్లా కేంద్రాలపై రాద్ధాంతం అవసరం లేదని వరంగల్, హన్మకొండ మాదిరిగా భువనగిరి సహిత యాదాద్రి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయవచ్చన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. సిఎం కెసిఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధికి వందల కోట్లు వెచ్చిస్తుండటం హర్షణీయమని వాటి సార్ధకతకు, యాదాద్రికి దేశవ్యాప్తంగా గుర్తింపుకు జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరముందన్నారు. సిఎం కెసిఆర్ భవిష్యత్‌లో ఎన్నికలు గెలిచినా, ఓడినా లేక ఆయన తన శేష జీవితాన్ని మెదక్ ఫాంహౌజ్‌లో గడిపినా ఇక్కడే యాదాద్రి వచ్చి వెళ్లవచ్చని అందుకు జిల్లా కేంద్రంగా యాదాద్రిని ఏర్పాటు చేసి తన పేరు చిరస్థాయిగా నిలుపుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర టిడిపి మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య, నాయకులు ఆకుల రాజేష్, చంద్రగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.