లోకాభిరామం

ఓటి బుర్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్ను చాలా అభిమానించిన మిత్రురాలు నన్ను ‘ఓటి బుర్ర’ అంటూ ఉండేది. చదువు తప్ప మరేదీ నా తలకు ఎక్కదని ఆవిడ భావం అనుకుంటాను. ఓటు అనే మాట మనకు తెలుగులో మొదటి నుంచీ ఉందని అర్థం. ఓటు కుండ, ఓటికుండ అంటే కుండలో, నా బుర్రలోలాగే ఏమీ లేదని అర్థం. ఓటమి అన్న మాట కూడా ఈ రకంగానే పుట్టి ఉంటుంది. అయితే మనం, ఎన్నికలలో ఓటు వేసేస్తున్నాము. అంటే మన ఖాళీ భావాన్ని వెలిబుచ్చుతున్నాము అనుకోవాలా? తెలుగులో వొ, వు అనే అక్షరాలతో మొదలయ్యే మాటలు లేవు. చాలామంది వున్నది అని రాయడం, అలవాటు చేసుకున్నారు. వొచ్చాడు అని కూడా రాస్తున్నట్టు నా అనుమానం. అవి పద్ధతిని పట్టించుకోని మాటలు. లాటిన్ భాషలో వోటమ్ అనే మాటకు శపథం, కోరిక, మొక్కుబడి, అంకితం లాంటి అర్థాలున్నాయి. ఈ అర్థాలు పదిహేనవ శతాబ్ది నాటివి. 1550, 1560 దశకాలలో వోటు వేయడం వోటు యివ్వడం అనే భావాల అవసరం ఏర్పడింది. ఒక విషయంగా రెండు, అంతకన్నా ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటే, వాటిలో ఒక దానిపట్ల మనిషికి గల సమ్మతిని తెలియజేయడం అన్నమాట. ఓటు కాదు, వోటు యివ్వాలి అంటే పోటీగా ఉన్న ఒక విషయానికి మన మద్దతు, అంగీకారం తెలియజేయాలి. అది తెలుగులో ఓటు అయింది.
హిందీలో వోటును మత్ అంటారు. మతం అంటే అభిమతం. మన యిష్టం. మత్‌దాన్ అంటే వోటు యివ్వడం. బహుమత్ అంటే మెజారిటీ. చాలామంది మతి గెలిచిన, బహుమత్ గల వ్యక్తి, విషయానికి అనుకూలంగా ఉందని భావం. ఈ మెజారిటీ, బహుమత్‌లకు తెలుగులో మాట ఏమిటి? ఎప్పుడయినా ఆలోచించారా? మనకు బహుమతి అంటే మరో అర్థం ఉంది. ఏదయినా చాలా నచ్చితే తమిళులు ‘రొంబ ప్రమాదమా ఇరిక్కి (చాలా బాగుంది)’ అంటారు. మనకు ప్రమాదం అంటే విపత్తు. మనకు రాష్ట్రం, దేశం ఉన్నాయి. హిందీలో రాష్ట్ర అంటే దేశం. రాష్టప్రతి మన దేశానికి అంతటికీ పెద్దతల. అలాగే దేశ, ప్రదేశ్ అంటే మనకు తెలిసిన రాష్ట్రం. ఏమిటో ఈ గోల అందరికీ, ఒక మాట ఒకే రకంగ అర్థమయితే ఎంత బాగుండును?
ఇంతకూ నేను ఇవాళ చెప్పదలుచుకున్నది మతం గురించి. మతం అంటే నా యిష్టంకొద్దీ నేను అవలంబించే మార్గం. కనీసం అట్లాగ ఉండాలి. అంటే మతం వ్యక్తిగతమయిన అభిమతంగా, అంశంగా ఉండి, మనకు స్వతంత్ర మార్గాన్ని చూపించగలగాలి. కానీ, నేను పుట్టకముందే హిందువు అనే సింధువులో బిందువును. అందులో నా వోటు లేదు. మతం లేదు. దేవుడా, నీకు ఏదో యిస్తాను, అనుకోవడం ఒక లౌ. అట్లా యిచ్చిన వస్తువు, సామగ్రి వోటివ్. ఇక్కడ నాకు దేవుడు కావాలా, వద్దా అని ఎంచుకునే స్వతంత్రమే లేదు. ఇక ఆ దేవునికి ఇచ్చే సామగ్రి విషయంలో ఎంపిక (వోట్)కు చోటుందా? ఇందలరాయనికి తలనీలాలు ఇవ్వాలి. తిరుమలలోని ఉత్సవమూర్తులను, మలయప్ప అంటారు. వైష్ణవం, తమిళుల మార్గంలో నడుస్తున్నది. గనుక ఆ పేరు నేను కొండయ్య అంటాను. అంటే ఎవరికీ అర్థం గాదు, సమ్మతం కాదు. వోటు వేయరు. యంగటేప్పం అనవచ్చు. ఎంకన్నా అనవచ్చు. అసలు పేరు వేంకటేశ్వరుడు. అందులో వేలో దీర్ఘం కూడా ఉండాలె అని ఎవరూ పట్టించుకోరు. ఏమన్నా అంటే, మేరీ మర్‌జీ! అంటారు. అంటే నా మతం, అభిమతం, నా యిష్టం అని అర్థం. అర్థాలు అన్నమాట.
మతం అన్నది వ్యక్తిగతం అని నేను మొత్తుకుంటున్నాను. కానీ మనకు ఆ పేరున ఉన్నది ఒక సామూహిక భావన. తెలిసిన మతాలకు నిర్దేశక సూత్రాలను అందించే గ్రంథాలున్నాయి. మనకు అట్ల ఒక గ్రంథం లేదు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నింటినీ మనం ప్రమాణాలుగా భావిస్తున్నాము. బాధ ఏమంటే, వాటిలో ఏమున్నదీ, పండితులకు తప్ప మనకు తెలియదు. తెలుసుకుందాము అన్న యావగూడ మనలో సున్న! భగవద్గీత గురించి చెపుతారు. అందులో ఏం చెప్పింది, తొంభయి తొమ్మిది శాతం మందికి తెలియదు. తెలుసుకోవాలని అనుకోరు కూడా. ఘంటసాలగారు ఎందుకోగాని దాన్ని చాలా విషాదం పద్ధతిలో పాడి పెట్టేసి వెళ్లిపోయారు. ఎవరయినా గుటుక్కుమంటే ఘంటసాల భగవద్గీత వినిపించడం అలవాటయింది. అందులోనేమో బతుకు గురించి చెప్పారు. చావు సంగతి లేదు! అభిప్రాయం, అభిమతం అన్న వోటును ఓటి (ఖాళీదిగా)గా మార్చిన పద్ధతిలోనే ఉంది గదూ ఇది కూడా!
మనది మహత్తరమయిన పద్ధతి అని చెప్పగలిగిన అంశాలు ఉండగా, పిచ్చి మాటలు చెప్పుకోవడం తప్పు! ఉర్వి జనులకెల్ల నుండు తప్పు. మనకు అంటే మన పూర్వీకులకు గల హృదయ వైశాల్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదయాస్తమానాలకు కారణమయిన సూర్యుడు, (అమూన్ రా) దేవుడు. బ్రాకెట్‌లో మాట, అతనికి మిస్ అంటే ఈజిప్ట్ వారు పెట్టిన పేరు. ప్రాణానికి ఆధారమయిన నీరు ఒక దేవుడు. సంరాడాపో, పారాడపః, అన్నయును జలము ఆధారముగ వచ్చినవే! అంటుంది మంత్రం. నిప్పు దేవుడు, గాలి దేవుడు, చెట్టు దేవుడు, గుట్ట దేవుడు (ఉదా.మలయప్ప, కొండలరాయడు). జంతువులు అన్నీ ఏదో ఒక రకంగా దైవికమయినవే. కుక్క, పంది కూడ దైవికమయినవే. బతుకుకు ప్రతీకగా బతుకమ్మ. తిండికి ప్రతీకగా అన్నమయ్య! మంచితనానికి గుర్తుగా నన్నయ్య. తమిళంలో నల్ల, నన్న అంటే ‘బాగు’ అని అర్థం. కమలహాసన్ పాత సినిమాలో ఒక దాంట్లో ఈ సంగతి అందరికీ తెలిసింది. తప్పు పట్టకండి గానీ, తిక్కన, ఎర్రన అంటే (వెర్రి అన్న) కూడా మనకు గౌరవమే. ప్రకృతి ఆరాధనలో మనలను మించిన వారు మరొకరు లేరు. ఇంత మంచి సహజ ధోరణి ఉండగా ఎందుకో ఈ సంప్రదాయానికి మతం అని పేరు పెట్టి రంగుచొక్కాలు వేసే ప్రయత్నాలు జరిగాయి. ఏ రంగు, ఏ చొక్కా దీనికి నప్పవని తెలుస్తూనే ఉన్నా, ఆ ప్రయత్నాలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.
అసలు తత్వాన్ని వివరించే వారు కరువయ్యారు. ఫలానా నాడు, ఫలానా నూనెతో, ఫలానా దీపం పెడితే నీకు జలుబు తగ్గుతుంది అని చెప్పే సంకుచిత ధోరణిలోకి కూరుకుపోతున్నాము మనం. ఈ మధ్యన మూఢభక్తి పోయి మీడియా భక్తి మొదలయిన తరువాత దారులు మరీ మారిపోయినయి. నాకు తెలిసిన ఒకానొక గుడిలో ఈ కార్తీకమాసంలో వెయ్యి లీటర్ల నూనెతో దీపాలు వెలిగించారు. బాగానే ఉంది. నేను మరో సంగతి గమనించాను. గుడి మొత్తం మసిబారింది. పొగ చూరింది. రంగులు వేయించాలి అనుకుని లెక్కలు చేస్తున్నారు అక్కడి యాజమాన్యం వాళ్లు. నన్ను తిడతారని తెలుసు. అడుసు (బురద) తొక్కనేల? కాలు కడుగనేల అనిపించింది నాకు. ఆ రకం గుడిలో దీపాలు పెట్టే సంప్రదాయం ఏర్పాటులేదు. మీడియా భక్తి ప్రభావం తప్ప అది మరొకటి కాదని నేను అంటాను. అది నాకు తోచిన మాట!
ఎవరినీ తప్పు పట్టాలని మాత్రం నేను ఈ మాటలు రాయడం లేదు. అంతా నాకంటే తెలివయినవారే. ఆలోచించడం మాని, గతానుగతికో లోకః అంటూ ఎందుకు ముందుకు సాగుతున్నారని నా బాధ! పట్నవాసంలో తడి, పొడి చెత్త వేరు చేయండి, అంటే ఎవరూ వినరు. చెట్లు పెంచితే, వాతావరణానికి మంచిది, అంటే మనకు మంచిది. ఈ సంగతి ఇట్లా చెపితే ఎవరూ వినరు. హరితహారం అంటూ బోలెడు మొక్కలు నాటారు. వాటిలో ఎన్ని మిగిలి ఉన్నయి? ఎవరికీ పట్టదు. చెట్లు పెంచితే పుణ్యం వస్తుంది, అని చెపితే, బహుశః ప్రభావం ఉంటుందని నాకు తోచింది. గుడిలో మొక్కలను ప్రసాదంగా పంచాలి. ఆ మొక్క ఎంత బాగ పెరిగితే అంత మంచి జరుగుతుంది అన్న భావం కలిగించాలి. అదికాదు గానీ, మొక్కలు పెంచడం, పారిశుద్ధ్యం, మొదలయినవి మనకు సంప్రదాయంలో భాగాలుగా వచ్చే పద్ధతి, పండితులు వెతికి చెబితే అందరికీ మంచి జరుగుతుంది. మొక్కలకు, పక్షులకు, పశువులకు, తిండి-నీరు అందించడం, భక్తిలో భాగం కావాలి. ఎట్లా వీలవుతుందో చెప్పి ‘పుణ్యం’ కట్టుకుందురూ? ఈ పనిగాని చేశారంటే నేను చెట్టయి పుట్టి మీకు ఆక్సిజన్, ఆకులు, పళ్లు, పూలు, కర్ర, నీడ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను! ఈ సంగతి మీ వాళ్లతో చర్చించండి. చక్కని దారి ఒకటి వెతకండి.
ఈ దేశంలో ఇప్పుడు సైన్స్, చదువు, ప్రగతి లాంటి మాటలు చెపితే వినేవారు కరువయ్యారు. ఆవు, పేడ, దూడ, దీపం, ప్రసాదం లాంటివి ప్రస్తుత అంశాలు. కనుక నిజంగా అవసరమయిన అంశాలు అన్నింటినీ ఆ చట్రంలోకి బిగించి, రూపం మార్చి అందించే ప్రయత్నం చేయాలి!
సీతమ్మవారు, వాల్మీకి ఆశ్రమంలో ఉండగా పెంచిన చెట్ల రకాలు ఏమిటో తెలిస్తే చెప్పండి. వనవాసంలో ద్రౌపది ఏం చెట్లు పెంచిందో చెప్పండి!
నాది ముందే ఓటి బుర్ర. నావల్ల గావడం లేదు గానీ, ఆలోచన అందుకుని ముందుకు సాగించండి!

కె. బి. గోపాలం