ఈ వారం కథ

ఒక స్నేహం కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అసలు నువ్వు ట్రైన్ టికెట్‌లెందుకు క్యాన్సిల్ చేసినట్లు?’’ దీవాన్‌మీద పడుకుని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న కొడుకుని ఉద్దేశించి ప్రశ్నించింది సాధన.
‘‘సన్నీకి ఏదో పనిపడిందట.. అందుకే క్యాన్సిల్ చేశాను’’ నింపాదిగా చెప్పాడు ఇరవై యేళ్ళ మనోజ్.
‘‘సన్నీకి పనిపడితే నీకేమిటి మధ్యలో’’ స్వరం పెంచి అడిగింది సాధన కోపంగా.
‘‘అదేమిటమ్మా... అలా మాట్లాడతావు? ఇద్దరం కలిసి వెళ్లాలనుకున్నపుడు ఒకరికి వీలవకపోతే ఇంకొకరం ఆగిపోమా ఏం!’’ విసుగ్గా అన్నాడు మనోజ్.
‘‘అదే ఎందుకు అని అడుగుతున్నాను. సెలవులలో ఎంజాయ్ చేయడం కోసం మీ అన్నయ్య దగ్గరికి వెళ్తున్నావు నువ్వు.. నీతోపాటు వస్తున్నాడు వాడు.. ఇక్కడ నువ్వు వెళ్ళడం ముఖ్యం.. అలాంటప్పుడు వాడికోసం నువ్వు ప్రయాణం వాయిదా వేసుకోవడం ఏమిటి? టికెట్ క్యాన్సిలయినందుకు డబ్బులు పోయాయి అనవసరంగా’’ దెబ్బలాడింది సాధన.
‘‘అబ్బ.. అమ్మా.. అసలేమిటి నీ బాధ.. సన్నీ నా బెస్ట్ ఫ్రెండ్.. వాడు, నేను ఎంత క్లోజ్‌గా ఉంటామో నీకు తెలుసు కదా! అయినా వాడేమీ ఊసుపోక నాతో రావడంలేదు. వాడికి అక్కడ ఏదో పని ఉంది. ఇంతలో అనుకోకుండా వాళ్ళక్క కొడుక్కి పుట్టు జుత్తులు తీయిస్తున్నారట. దానికోసం మేనమామ ఉండాలని వాళ్ళక్క పట్టుబడుతోందట.. అందుకోసమే వాడు ఇప్పుడాగిపోతున్నది... దానికి తోడు వాడి పని కూడా పోస్ట్‌పోన్ అయ్యింది. అందుకే ఇద్దరం కలిసి వెళ్దామని ఆగాను. ఇప్పుడేమంత కొంప మునిగిపోయిందని అలా అరుస్తున్నావు?’’ తల్లికన్నా పెద్ద గొంతు పెట్టి మరీ బదులిచ్చాడు మనోజ్.
తనకన్నా తారాస్థాయిలో కేకలేస్తున్న కొడుకుతో తలపడలేక నిస్సహాయంగా చూసి లోపలికి వెళ్లిపోయింది సాధన.
డబ్బు విలువ తెలుసుకోకుండా నిష్ఫూచీగా వ్యవహరిస్తున్న మనోజ్‌ని ఏమనాలో ఆమెకి తెలియడంలేదు. చదువుతున్న చదువును కూడా పట్టించుకోక, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న అతడిని చూసి బాధపడటం తప్ప మరేమీ చేయలేని అసమర్థురాలు తాను.
వీడి వయసులో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలు చక్కగా చదువుకుని అమ్మా నాన్నల కష్టం అర్థం చేసుకుని ఎంతో బాధ్యతగా మసలుకుంటూంటే వీడు మాత్రం... అంతా తన ఖర్మ.. వీడిలా తయారవడం వెనక తన వైఫల్యమేమన్నా ఉందా! మనసులోనే సమీక్షించుకుంది సాధన.
ఆమెకు సమాధానం దొరకలేదు. మనోజ్ ఇలా మారడం వెనుక తన చేతగానితనం ఉందీ అంటే సమీర్‌ని పెంచినది కూడా తానే.. మరి వాడెలా బాగుపడినట్టు! ఇదే ప్రశ్న ఎన్నిసార్లు వేసుకున్నా బదులు దొరకలేదు ఆమెకి.
అంతలోనే మనసు నోరు తెరిచింది.. ‘‘పిచ్చిదానా! మనోజ్ అల్లరివాడిలా తయారవడం వెనుక నీ పాత్ర ఏదన్నా ఉందీ అంటే అది ఖచ్చితంగా కొంత శాతమే. పిల్లలు వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటానికి తల్లిదండ్రులు కొంతవరకే కారణం అవుతారు. కొంత వయసువచ్చిన తరువాత పిల్లల్ని సమాజం, సినిమాలు, స్నేహితులు పెంచుతాయి’’. మనసు చెప్పిన దానితో ఏకీభవించింది సాధన. నిజమే... పిల్లలు ఎదగడం వెనుక తల్లిదండ్రుల పాత్రతోపాటు, వారు పెరిగిన పరిసరాల పాత్ర కూడా అధికమే.
ముఖ్యంగా వాళ్లెంచుకున్న స్నేహాలే వారి మనసులమీద అత్యధిక ప్రభావం చూపుతాయి. ఆ వయసులో తమకి తగిన స్నేహాలను ఎంచుకునే మానసిక పరిపక్వత వారికుండకపోవచ్చు. కాని, ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునేంత జ్ఞానం మాత్రం కాస్తో కూస్తో అలవడుతుందని సాధన నమ్మకం.
కాని, మనోజ్ విషయంలో అది కూడా జరగలేదు. తాటిచెట్టంత ఎదిగాడు కాని, లోకజ్ఞానం మాత్రం అబ్బలేదు అతడికి. స్నేహాలన్నా, స్నేహితులన్నా ప్రాణం అతడికి. ఎప్పుడూ వారితోడిదే లోకం.. ఎప్పుడో పల్లెటూళ్ళో తనతోపాటు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న స్నేహితుల దగ్గరనుంచీ ఇపుడు బి.టెక్ చదువుతున్నపుడు కొత్తగా ఏర్పడిన మిత్రులవరకు అతడికి లెఖ్ఖలేనంతమంది స్నేహితులున్నారు.
తన చదువును కూడా పక్కకునెట్టి అవతలవారికోసం తన సమయాన్ని, డబ్బును వెచ్చించేంతటి పిచ్చి అతడి సొంతం. అతడిలో వున్న ఈ ‘అతి’ సాధనకి నచ్చదు. అలాగని ఆమెకి స్నేహమన్నా, స్నేహితులన్నా కిట్టదు అని అనుకుంటే అది పొరబాటే.
సాధనకి మైత్రి అంటే ప్రాణం. ఎపుడో చిన్నతనంలో తనతో కలిసి చదువుకున్న మిత్రురాళ్ళతో ఆమెకి ఇప్పటికీ కూడా సత్సంబంధాలున్నాయి. అలాంటప్పుడు ఆమె చిన్న కొడుకు స్నేహాలను ఎలా కాదనగలదు!
కాని, నల్లనివన్నీ నీళ్ళు.. తెల్లనివన్నీ పాలు అని భ్రమించే కొడుకు అమాయకతను ఎలా పోగొట్టాలో, మిత్రలాభం మిత్రభేదం అంటే ఏమిటో కొడుక్కెలా వివరించి చెప్పాలో ఆమెకి తెలియడంలేదు. అసలేదన్నా విడమరచి చెప్పే అవకాశం ఆమెకు మనోజ్ ఇస్తే కదా!
చాలాసార్లు భర్త సంతోష్‌తోనూ, పెద్దకొడుకు సమీర్‌తోనూ ఈ విషయం మొరపెట్టుకుంది.
‘‘చూడు సాధనా.. అనుభవంమీద అన్ని విషయాలూ వాడే తెలుసుకుంటాడు. బుర్ర బొప్పి కడితే గాని ఎవరికీ ఏ విషయమూ బోధపడదు. కాబట్టి నువ్వూరికే కంగారుపడి నన్ను కంగారుపెట్టకు’’ ఆమె బాధను తేలిగ్గా తీసుకుని తాపీగా తన అభిప్రాయం వెల్లడించాడు సంతోష్.
‘‘అమ్మా.. నువ్వూరికే టెన్షన్ పడి ఆరోగ్యం పాడుచేసుకోకు. వాడికి జాబ్ వచ్చేస్తే ఈ స్నేహాలమీదున్న శ్రద్ధ తగ్గి వాడే తోవలో పడతాడు. ఎంత తిరిగినా ఈ నాలుగు రోజులేగా! ఆ తరువాత ఎవరకి ఎవరో!’’ తండ్రి మాటల్లోని సారాంశానే్న కాస్త మృదువుగా చెప్పాడు సమీర్.
‘‘నిజమే... వాళ్ళు మాత్రం అంతకన్నా ఏం చెప్పగలరు!’’ అనుకుని నిర్లిప్తంగా నిట్టూర్చింది సాధన.
అసలు.. అసలు.. వీడిలా తయారవడానికి కారణం ఆ సన్నీగాడే.. వాడి సాహచర్యంలోనే వీడికి అవలక్షణాలన్నీ వంటబట్టాయి. అర్థరాత్రి అపరాత్రి లేకుండా ఊరుమీద బలాదూర్ తిరగడం, జంకుగొండు లేకుండా నోటికొచ్చిన అబద్ధాలాడటం - ఇవన్నీ ఆ సన్నీ మూలంగానే అలవడ్డాయి. వాడితో స్నేహమే వీడికి చేటు తెచ్చిపెట్టింది. ఈ సత్యాన్ని ఈ వెర్రి నాగన్న ఎప్పటికీ తెలుసుకుంటాడో! వాపోయింది కన్న తల్లి మనసు.
అంతలోనే అనిపించింది.. ఆ సన్నీ వాళ్ళమ్మ కూడా తనలాగానే ఆలోచించి సన్నీ చెడిపోవడానికి కారణం తన కొడుకేనని తలపోస్తే! నిజానికి వెనకనైనా అనుకోవలసిన మాట ఏమిటంటే, సన్నీ వాళ్ళమ్మ అతడిని బాగా గారాబం చేస్తుంది. తండ్రి లేని పిల్లాడన్న జాలితో అడిగివన్నీ కాదనకుండా చేస్తుంది.
దానితో సన్నీకి ఎదురులేకుండా పోయింది. చిక్కంతా ఎక్కడొచ్చిందంటే... సన్నీలా తానుండాలని మనోజ్ తలపోయడం సాధనకు తలనొప్పిగా మారింది. తమకి, వాళ్లకి ఉన్న ఆర్థిక స్థితిగతులు వేరని, వాళ్లలా తాముండలేమని ఎంతగా నచ్చచెప్పినా మనోజ్ అర్థం చేసుకోలేదు సరికదా తల్లిని అపార్థం చేసుకుని దూషించనారంభించాడు.
కొడుకు మొండితనానికి హతాశురాలయ్యింది సాధన. ఎప్పుడైతే సన్నీతో స్నేహానికి ఉద్వాసన పలుకుతాడో ఆనాడే కొడుకులో మంచి మార్పు కలుగుతుందని భావించి మిన్నకుండిపోయింది.
ఒకరు చెడిపోవడానికి కారణం ఏ ఒక్కరూ పూర్తిగా కారణం కాదని, వాళ్ళలో చెడు పట్ల ఆకర్షితమయ్యే స్వభావమే వాళ్లని చెడిపోయేందుకు ప్రేరేపిస్తుందని ఎరుగని కుసంస్కారి కాదు సాధన. కాని, ఇంచుమించు ఇరవై నాలుగు గంటలూ ఆ సన్నీని అంటిపెట్టుకుని తిరుగుతూ తన చదువు సంధ్యలు పట్టించుకోని కొడుకును చూస్తే అలా అనుకోబుద్ధవుతోందామెకి.
మనోజ్ క్లాస్‌మేట్‌లు, సన్నిహితులు అయిన మరికొందరు అబ్బాయిలు ఓసారి సాధనను కలిసి వాపోయారు.
‘‘మనోజ్‌ని ఆ సన్నీతో కలిసి తిరగనివ్వకండి ఆంటీ.. వాడు అంత మంచివాడు కాదు. మేమామాట అన్నామని మనోజ్‌కి మా మీద కోపం వచ్చింది. అంతేకాదు, సన్నీ చెడ్డవాడని మేమన్నామని ఆ సన్నీతో చెప్పేశాడు కూడా. దానితో వాడు మా మీద ఫైర్ అయిపోయి, తగువుకొచ్చాడు.. ’’ మనోజ్ పాడైపోతున్నాడన్న బాధతో కదిలిపోయారు అతడి స్నేహితులు.
‘‘నేను ఏమీ చేయలేకే చూస్తూ ఉండిపోయాను నాన్నా.. మనోజ్‌కి సన్నీ అంటే పిచ్చి. ఈ పరిస్థితుల్లో మనమేం చెప్పినా వినడుగాక వినడు.. కాలమే దీనికి సొల్యూషన్ వెదకాలి’’ నిర్వికారంగా చెప్పింది సాధన.
అనుకున్న ప్రకారమే సన్నితో కలిసి చెన్నై విహారానికి బయలుదేరాడు మనోజ్. తమ్ముడొక్కడూ రాకుండా తోకలా సన్నీని వెంట పెట్టుకుని వచ్చినందుకు కాస్త చిరాకుపడ్డాడు సమీర్. అయినా అదేమీ కనబడనివ్వకుండా మనోజ్‌తో సమానంగా సన్నీని కూడా ఆదిరించాడు.
రెండు రోజులపాటు సెలవుపెట్టి చెన్నైలోని పార్థసారధి ఆలయం, మహాబలిపురం ఇత్యాది దర్శనీయ స్థలాలన్నీ చూపించాడు. అతడు ఆఫీసుకెళ్ళాక మిత్రులిద్దరూ సెల్‌ఫోన్‌లోని జి.పి.ఎస్. ఆధారంగా చెన్నై అంతా చుట్టపెట్టారు. సన్నీ వచ్చిన పని పూర్తయ్యాక వాళ్ళిద్దరినీ ట్రైన్ ఎక్కించి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు సమీర్.
***
‘‘నువ్వు గురువారంనాడు ఫ్రీగానే ఉంటావా?’’ సాధన ప్రాణస్నేహితురాలు క్రాంతి ఫోన్ చేసింది ఆ రోజు పొద్దునే్న.
‘‘ఆ.. ఇవాళ వర్కింగ్ డేనే కాబట్టి అన్నయ్య స్కూల్‌కి వెళ్లిపోతారు. మనోజ్ ప్రస్తుతం నంద్యాలలో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాబట్టి నేను ఖాళీనే.. ఇంతకీ సంగతేంటీ..’’ అడిగింది సాధన.
‘‘నీకు తెలుసు కదా వైభవ్ జ్యూయెలర్స్‌లో నేను చిట్ కడుతున్నానని. అవి ఇపుడు మెచ్యూర్ అయ్యాయట. వచ్చి ఏదన్నా నగ తీసుకోమని ఏజెంట్ ఫోన్ చేశాడు. నువ్వు ఫ్రీగా వుంటే సాయం
వస్తావేమోనని ఫోన్ చేశాను’’ చెప్పింది క్రాంతి.
‘‘దానికేం భాగ్యం! తప్పకుండా వస్తాను. ఎలాగూ ఇంట్లో ఒక్కతినీ ఉండడంవల్ల తెగ బోర్ కొడుతోంది. సరే ఎన్నింటికి బయలుదేరదాం?’’ ప్రశ్నించింది సాధన.
‘‘ఇప్పుడు పదైంది కదా! పదకొండుకల్లా వెళ్దాం’’ చెప్పేసి ఫోన్ కట్ చేసింది క్రాంతి.
గబగబా తయారవడం ప్రారంభించింది సాధన. మనోజ్ నంద్యాలలో కోచింగ్ కోసమని చేరి నెలవుతోంది. గతంలో అల్లరిచిల్లరిగా తిరగడంనుంచి బి.టెక్‌లో ఒకటి రెండు సబ్జెక్టులలో తప్పాడు. ఈ నవంబర్ లోపల ప్యాసైపోతే కంపార్ట్‌మెంట్ అవదని, సర్ట్ఫికెట్ మామూలుగానే వచ్చేస్తుందనీ చెప్పాడతడు కలవరపడుతున్న తల్లితో.
ఈ విషయంలో మనోజ్ మిత్రబృందానికి ఎంతైనా ఋణపడి ఉంది సాధన. ఎందుకంటే క్లాస్‌లో పాఠాలు వినక వెనకబడిన మనోజ్‌కి పాఠాలన్నీ అర్థమయ్యేలా చేసి అతడు మిగతా సబ్జెక్టులు పాసయ్యేలా చేసిన ఘనత వారిదే. ఆమెకి అర్థంకాని విషయమేమిటంటే ఆమధ్యవరకు మనోజ్‌ని జీడిమరకలా అంటుకుని తిరిగే సన్నీ గత నాలుగు నెలలుగా ఫికర్లేకపోవడం ఆమెకు అంతు చిక్కలేదు.
మనోజ్ సన్నీతో స్నేహం చేయడం అంత నచ్చకపోయినా ఏనాడూ సన్నీని ద్వేషించలేదు సాధన. తన స్వంత పిల్లాడిలా ఇంట్లో మసలే సన్నీ రాకపోవడంతో ఆమెకదోలా ఉంది. మనోజ్‌ని సంగతేమిటని అడిగినా ఏదో చెప్పి దాటవేసేశాడే తప్ప క్లారిటీ ఇవ్వలేదు.
చదువులైపోయాయి కదా ఇక వాళ్ళు కలుసుకునే సందర్భాలు కూడా అరుదైపోతాయని తనకి తానే సర్ది చెప్పకుంది సాధన. మనోజ్ ఇంటి దగ్గర లేకపోవడంతో వాడికి వండిపెట్టే పని తప్పడంతో చకచకా తయారైపోయి ఇంత మజ్జిగన్నం తినేసి ఇంటికి తాళం పెట్టి క్రాంతి దగ్గరకు బయలుదేరింది సాధన.
మిత్రురాళ్ళిద్దరూ వైజాగ్ చేరేసరికి మధ్యాహ్నం ఒంటింటయ్యింది. కాంప్లెక్స్‌కి చేరువలోనే ఉన్న వైభవ్ షాప్‌కి కాలినడకనే చేరుకున్నారిద్దరూ. తన చిట్ విలువకు సమానమైన నగ తీసుకోవడంకోసం అక్కడున్న సిబ్బందితో చర్చలలో మునిపోయింది క్రాంతి.
చుట్టూ వున్న షోకేసుల్లోనుంచి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ధగధగ వెలుగులు విరజిమ్ముతున్న బంగారు, వజ్రాభరణాలను చూస్తే మైకం కమ్ముతోంది సాధనకి.
ఆమె ఇలా నగల షాపులంట తిరగడం అరుదు. సంతోష్‌కి బంగారమంటే నచ్చదు. దానికితోడు ఇద్దరూ మగ పిల్లలే కావడం మూలాన బంగారం కొని దాచి పెట్టే ప్రసక్తే లేదు. క్రాంతి అలా కాదు. ఎదుగుతున్న కూతురికోసమని తనకి వీలున్నపుడల్లా బంగారం కొని దాస్తూ ఉంటుంది.
కౌంటర్లో కూర్చుని క్రాంతి తదేక దీక్షతో నగలు పరిశీలిస్తూ ఉండగా సాధన మాత్రం షాపు నిలుదిక్కులా చూస్తూ కూర్చుంది. ఇంతలో వాళ్ళకి కాస్త దూరంగా కనిపించాడు సన్నీ. వాడితోపాటు వాళ్ళ అక్క, చిన్నబాబు, దాదాపు తన వయసే ఉన్న ఇంకో ఆవిడ ఉన్నారు. ఆవిడ బహుశా సన్నీ తల్లి కావచ్చునని ఊహించింది సాధన. సన్నీ అక్కనిదివరలో సాధన చూసి ఉంది కాబట్టి వెంటనే గుర్తుపట్టింది. కాకపోతే వాళ్ళమ్మతో మాత్రం ఆమెకి పరిచయం లేదు.
సన్నీని చూస్తూనే ‘సన్నీ’ అంటూ పిలిచింది సాధన. అక్కడ అంత చనువుగా తనని పిలిచేదెవరా! అని ఆలోచిస్తూన్న సన్నీ సాధనను చూశాడు. కాసేపు ఏదో సంకోచంలో కొట్టుమిట్టాడి ఆ తరువాత నెమ్మదిగా నడుచుకుని సాధన దగ్గరకొచ్చాడు.
‘‘ఏరా సన్నీ.. బాగున్నావా? ఏంటీ ఎక్కడా కనబడడమే మానేశావు? మీ ఫ్రెండ్ లేడని రావడం మానేశావా? ఆప్యాయంగా పలకరించింది.
‘‘అబ్బే అదేంలేదాంటీ.. ఇంట్లో కాస్త బిజీగా వుండి...’’ నసిగాడు సన్నీ.
ఎందుకో వాడు మునపటిలా లేడనిపించింది. తనతో మాట్లాడుతూంటే ఏదో ఇబ్బందిగా కదులుతున్నట్లుగా పసిగట్టింది సాధన. ఆ తరువాత ఏవేవో మాట్లాడినా అంత ఉత్సాహంగా కనపడలేదు. అంతేకాదు తనతోపాటు ఉన్న తన తల్లిని కూడా పరిచయం చేయలేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతోందనిపించింది సాధనకి. ఆమె ముఖంలోకి చూడకుండా ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయాడు సన్నీ.
ఇంతలో క్రాంతి తన చిట్ విలువకి తగిన నగ ఎంపిక చేసుకోవడం, షాపువాళ్ళు దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడం జరిగిపోయాయి. ఇద్దరూ బయలుదేరి కాంప్లెక్స్‌కి వచ్చి విజయనగరం వెళ్ళే నాన్‌స్టాప్ బస్ ఎక్కేశారు. బస్‌లో కూర్చుందన్న మాటేగాని సన్నీ ప్రవర్తనలోని మార్పుని విశే్లషిస్తూనే ఉంది సాధన మనసు.
ఏమైంది సన్నీకి. తమ ఇంటికి వచ్చినపుడల్లా ‘ఆంటీ’ అంటూ ఏవేవో కబుర్లు చెప్పి ఊదరగొట్టే సన్నీ అలా ఆచి తూచి మాట్లాడ్డం ఆమెకు వింత గొలుపుతోంది.
ఆ రాత్రి మనోజ్ ఫోన్లో మాట్లాడినపుడు ఈ విషయం గురించి అడగాలనుకుని ఫోన్లో ఎందుకులే అని మానేసింది. ఆ తరువాత రెండు రోజుల సెలవు దొరికిందని ఇంటికి వచ్చిన మనోజ్‌ని సంగతేమిటని ప్రశ్నించింది.
‘‘ఏమీ లేదమ్మా.. వాడికి నాకు మాటలు లేవు’’ చెప్పాడు మనోజ్ చిన్నబుచ్చుకున్న ముఖంతో.
నివ్వెరపోయింది సాధన. వింత విషయమేదో వింటున్నట్లుగా అబ్బురపడింది.
‘‘ఏమైంది నాన్నా.. నువ్వు వాడు జాన్ జిగిరీలు కదా! మీ ఇద్దరికీ మాటలు లేకపోవడమేంటి? ఇద్దరూ ఏమైనా అనుకున్నారా?’’
కారణం చెప్పడానికి మనోజ్ ఇష్టపడలేదు మొదట. కాని సాధన బతిమిలాడి అడిగినమీదట నోరు విప్పాడు. సన్నీ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడట. ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌లో మనోజ్‌కి ఫ్రెండ్. ఓసారి ఛాటింగ్ చేస్తున్నపుడు సన్నీ ఎలాంటివాడని ఆమె మనోజ్‌ని అడిగిందట. ప్రాణస్నేహితుడి గుణగణాలను వర్ణిస్తూ అతడి గురించి మంచిగా చెప్పాడు మనోజ్.
ఆ అమ్మాయి సన్నీని ఏమడిగిందో కాని, సన్నీ మనోజ్‌ని అపార్థం చేసుకుని మాట్లాడ్డం మానేశాడట.
‘‘నేనా అమ్మాయికి నీ గురించి చెడ్డగా ఏమీ చెప్పలేదురా.. తనేదో గేమ్ ఆడుతోంది’’ తన తప్పేదీ లేదని మొర పెట్టుకున్నాడు మనోజ్.
కాని సన్నీ వినలేదు. తాను తన ప్రేయసి మాటే నమ్ముతాననీ, తన గురించి చెడ్డగా చెప్పిన మనోజ్‌తో ఇక మాట్లాడబోననీ తెగేసి చెప్పాడు సన్నీ.
‘‘ఏడేళ్లుగా స్నేహితుడినైన నామాటకన్నా నిన్నగాక మొన్న పరిచయమైన ఆ అమ్మాయి మాటే నీకెక్కువా! నువ్వు ఆ అమ్మాయినే నమ్ముతావేంటీ?’’ నిలదీశాడు మనోజ్.
తనకి ఆ అమ్మాయే ఎక్కువనీ, తానా అమ్మాయి మాటే వింటాననీ ఖచ్చితంగా చెప్పేసి మనోజ్‌తో తెగతెంపులు చేసుకున్నాడు సన్నీ.
మనోజ్ చెప్పినదంతా విన్నాక సాధనకి మనోజ్‌మీద జాలేసింది. అతడి తల మీద చెయ్యేసి నిమురుతూ ‘‘ఇదంతా ఎపుడు జరిగింది నాన్నా...’’
‘‘మేము చెన్నై వెళ్ళక మునుపే సన్నీ లవర్ వాడితో ఈ విషయం చెప్పిందట..’’
‘‘మరి ఇద్దరూ మామూలుగానే వెళ్ళారు కదా! చెన్నై వెళ్ళకముందు వాడు నీకీ విషయం చెప్పలేదా?’’ ఆశ్చర్యపోయింది సాధన.
‘‘అదే నేనూ అడిగానమ్మా.. దానికి వాడేమన్నాడో తెలుసా? ముందు ప్రయాణం పెట్టుకుని నీతో దోస్తీ కట్ చేస్తే అంతా అప్సెట్ అవుతుంది.. అందుకే వెళ్ళొచ్చాక చెబుదాం అని అడిగాడట...’’ బాధగా చెప్పాడు మనోజ్.
నిర్ఘాంతపోయింది సాధన. పడగ విప్పిన అవకాశవాదం అంటే ఎలా వుంటుందో ఆమె సన్నీని చూసి తెలుసుకుంది. అంటే చెన్నై వెళ్ళే ముందే మనోజ్‌మీద కోపగించుకుని స్నేహం తుంచుకుంటే తనకి చెన్నైలో పని సాఫీగా తెమలదని గ్రహించి, తాత్కాలికంగా తన నాటకాన్ని వాయిదా వేశాడన్నమాట. హాయిగా వసతికి, భోజనానికి కాణీ ఖర్చవకుండా తన పబ్బం గడుపుకుని, అవసరం తీరిపోగానే మనోజ్‌ని అవతలికి నెట్టేశాడు. మనోజ్‌తో ఇక పనిలేదనుకున్నాక అనే్నళ్ళ తమ స్నేహానికి మంగళం పాడేశాడు.
మొదట్నుంచీ తనకి సన్నీ మీద అనుమానంగానే వుండేది. అది ఈనాటికి ఋజువైందన్నమాట. ముఖం వేలాడేసుకుని దిగాలుగా కూర్చున్న కొడుకుని చూస్తే జాలనిపించింది సాధనకి. తాను చెప్పాలనుకున్న నాలుగు మాటలు చెప్పి అతడి బుద్ధిని మరల్చేందుకు ఇదే తగిన సమయం అనుకుంది.
కొడుకు పక్కనే కూర్చుని ఓదార్పుగా అతడి భుజం తడుతూ ‘‘సమయం దొరికిందని అమ్మ నీతి వాక్యాలు చెపుతూ ఊదరగొడుతోందని నువ్వనుకోకపోతే నేనో నాలుగు మాటలు చెబుతాను’’ అంది సాధన.
ఏమిటన్నట్లుగా చూశాడు మనోజ్. అతడి కళ్ళలో ఏదో దీనత్వం.
‘‘మనకి తల్లిదండ్రులని, తోబుట్టువులని, బంధువులనీ ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆ విషయంలో మనకే ఛాయిసూ వుండదు. కాని, స్నేహితులలా కాదు. మన మనసుకి దగ్గరయ్యే స్నేహితులనెంచుకునేందుకు మనకి వీలుంటుంది. మనకి కావలసిన మంచి స్నేహితులనెంచుకునే క్రమంలోనే మన విజ్ఞత బయటపడుతుంది. ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోరుూ’ అన్నాడో కవి. మనమంటే ప్రాణమిచ్చే ‘ఒక స్నేహం కోసం’ ఎంతగానో అలమటిస్తుంది మనసు. కాని, ఆ స్నేహితుడిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మన బుద్ధిని, వివేకాన్ని తప్పక వాడాలి.
అలాంటి స్నేహాన్ని గుర్తించే విషయంలో ఏ మాత్రం పొరబడ్డా ఇదిగో... ఇలానే జరుగుతుంది. సన్నీ సంగతే తీసుకో... తిరిగినన్నాళ్ళూ నీతో తిరిగి, తన స్వలాభానికి నిన్ను యధేచ్చగా వాడుకుని, తన పని సానుకూలం కాగానే ఏదో చెత్త పారేసినట్లు నిన్ను దులపరించి పారేసిన స్వార్థపరుడతడు.
కాని, నీతోపాటు కలిసి బి.టెక్ చదువుకున్న నీ మిగతా స్నేహితులలా చేయలేదు. నువ్వు చదువుని నిర్లక్ష్యం చేసి ఆ సన్నీతో తిరిగి కొన్ని సబ్జెక్టులలో తప్పినా సరే, నీకు ధైర్యం చెప్పి నీకు తగిన గైడెన్స్ ఇచ్చి ఆ పరీక్షలలో పాసయ్యేందుకు దోహదపడ్డారు.
సన్నీ నీ ద్వారా లాభపడేందుకు నిన్ను ఉపయోగించుకుంటే, స్నేహానికి ప్రాణమిచ్చే నీ అసలైన మిత్రులు నీ జీవితం బాగుపడేందుకు తోడ్పడ్డారు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి అసలైన స్నేహమంటే ఏమిటో తెలుసుకుంటే నాకంతే చాలు’’ మృదువుగా పలికింది సాధన.
‘‘అయాం సారీ అమ్మా... మంచి మిత్రుడెలా వుండాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ అనుభవాన్ని పాఠంగా మలచుకుని ఇకముందు పొరబడకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను’’ తల్లి ఒడిలో ముఖం దాచుకున్నాడు మనోజ్.
*

-కె.కె.్భగ్యశ్రీ సెల్ నెం: 9440296076