ఓ చిన్నమాట!

ఆత్మవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా రోజుల క్రితం మాట. అప్పుడు హైదరాబాద్‌లో ఏడవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. అది ఓ ప్రత్యేక కోర్సు. ఆహార కల్తీ చేసే వ్యక్తుల నేరస్తుల కేసులని విచారించే కోర్టు. ఆహారం కల్తీ నిరోధక చట్టం అర్థం చేసుకోవడం అంత సులువైన విషయం కాదు. అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఆ కోర్టులో ఓ రెండు సంవత్సరాలు పని చేసిన తరువాత ఆ చట్టం మీద మంచి అవగాహన ఏర్పడింది. మిత్రులతో మాట్లాడినప్పుడు ఆ చట్టంలోని ప్రత్యేకమైన విషయాలని అలవోకగా చెప్పేవాణ్ని. నాకు ఆ చట్టం మీద కాస్త మంచి అవగాహన ఉందని చాలామందికి తెలిసింది. చివరికి ప్రాసిక్యూటర్లకి ఓ క్లాస్ తీసుకోమని పోలీస్ అకాడెమీ నుంచి ఫోన్ వచ్చింది. గతంలో ఎప్పుడూ క్లాస్ తీసుకున్న అనుభవం లేదు. సంశయించాను. కానీ పోలీస్ అకాడెమీ ఫాకల్టీ గౌరవంగా అడిగారు. ఒక రకంగా ఒత్తిడి చేశారు. క్లాస్ తీసుకోవడం నాకూ గౌరవంగానే అన్పించి ఒప్పుకున్నాను.
క్లాస్ కోసం ఓ వారం రోజులు తయారయ్యాను. ఇప్పటిలా అప్పుడు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు లేవు. నల్లబోర్డు, చాక్‌పీస్, ఓ మైక్ తప్ప క్లాసులో మరేమీ లేవు. అదే విషయం ఫాకల్టీ వాళ్లు చెప్పారు. మంచి నోట్స్ రాసుకొని క్లాస్‌కి వెళ్లాను. ముందు సీట్లో నాతోపాటు చదువుకున్న ఇద్దరు మిత్రులు కూర్చుని కన్పించారు. రెండవ సీట్లో మా సీనియర్లు కన్పించారు. క్లాసు బాగా చెప్పగలనా అన్న భయం నాలో ఏర్పడింది. అప్పటి దాకా వున్న ధైర్యం కాస్త సన్నగిల్లింది. రాసుకున్న నోట్స్ ఆధారంగా క్లాస్ తీసుకున్నాను. ఆ రెండు గంటలు రెండు యుగాల్లా తోచింది. గండం గట్టెక్కాను. కోర్టుకి తిరిగి వస్తున్నప్పుడు వాళ్లు నా క్లాస్ గురించి ‘్ఫడ్‌బ్యాక్’లో ఏమి రాశారో చెప్పమని ఫాకల్టీకి చెప్పాను.
వారం తరువాత ‘్ఫడ్ బ్యాక్’ కాగితాలని ఫొటో కాపీ తీసి పంపించారు. సబ్జెక్టు వుంది కానీ సరిగ్గా చెప్పలేకపోయారని చాలామంది నిర్మొహమాటంగా రాశారు. ఫర్వాలేదని ఒకరిద్దరు రాశారు. కొంత నిరుత్సాహం వచ్చింది.
కాలం గడిచింది. అప్పుడప్పుడు క్లాసులు తీసుకుంటూనే ఉన్నాను. పోలీస్ అకాడెమీలో పని చేశాను. జ్యుడీషియల్ అకాడెమీలో పని చేశాను.
ఈ మధ్యన నార్కట్‌పల్లి మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ పైన క్లాసు తీసుకొమ్మని కోరారు. ఆ తేదీ మర్చిపోయాను. క్లాస్ వున్న రోజు ఉదయం వాళ్లు ఫోన్ చేసేవరకు ఆ విషయమే మర్చిపోయాను. ఏ మాత్రం ప్రిపేర్ అవలేదు. కానీ వెళ్లక తప్పదు. హైదరాబాద్ నుంచి రెండు గంటల ప్రయాణం. ఆ సమయం సరిపోతుందని అన్పించింది. దార్లో ఓ గంటసేపు సీరియస్‌గా చెప్పాల్సిన సబ్జెక్ట్ చదివాను.
అక్కడ అన్ని సౌకర్యాలు వున్నాయి. పవర్ పాయింట్ ప్రజంటేషన్ సౌకర్యం ఉంది. కానీ నేను వాటికి సిద్ధమై లేను. అయినా క్లాస్ బాగా జరిగింది. తెల్లవారి ఫీడ్‌బ్యాక్ గురించి చెప్పారు. క్లాస్ చాలా బాగా వచ్చిందని అందరూ రాశారని చెప్పారు.
ఆ క్లాస్‌లో మాకు క్లాసులు తీసుకున్న డాక్టర్లు కూడా వున్నారు. నాతోపాటూ పని చేసిన పోలీస్ అధికారులూ వున్నారు. మా క్లాస్‌ని రికార్డు కూడా చేశారు. నేను ఎక్కువగా ప్రిపేర్ కూడా కాలేదు. అయినా క్లాస్ బాగా జరిగింది.
దానికి అనుభవం ఒక్కటే కారణం కాదు. ఆత్మవిశ్వాసం అన్నింటికన్నా ముఖ్యమైన కారణం.

మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.

-జింబో 94404 83001