ఓ చిన్నమాట!

మూడు ఎక్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైన్సు, లెక్కలు అంటే ఇష్టం వుండే విద్యార్థులు కొంతమంది వుంటే అవి ఇష్టపడని వ్యక్తులు మరెందరో వుంటారు.
ఆ రెండవ కేటగిరీకి చెందిన వ్యక్తిని నేను. అయినా లెక్కల సబ్జెక్టుని పదవ క్లాసు వరకు, సైన్సుని డిగ్రీ వరకు కష్టంగా చదివాను. సైన్సు నాకిష్టం లేదని చెప్పే స్వాతంత్య్రం లేని కాలం అది.
డిగ్రీ తరువాత స్వేచ్ఛ వచ్చింది. ‘లా’కి మారిపోయాను. ఇష్టంగా చదివాను.
లెక్కలు నాకు రావు. ఆ మాటకొస్తే ఎక్కాలు (టేబిల్స్) కూడా సరిగ్గా రావు. ఈ ఎక్కాలు అనే విషయం మీద ఓ కవిత రాశాను. ఆ కవితలో కూడా ఇదే విషయం చెప్పాను. ఎక్కాలు నాకు రావు. రెండో ఎక్కం వరకు మాత్రమే నాకు వచ్చు. సున్నా ఎక్కం ఒకటో ఎక్కం రెండో ఎక్కం మాత్రమే నాకు వచ్చు. మిగతా ఎక్కాలు రావు. ఆ కవిత ఇలా కొనసాగుతుంది.
‘నా అభిప్రాయాలని నమ్మకాలని
ఇతరులు విభేదించినప్పుడు
నావే సరైనవని అన్పించినప్పుడు
ఒకటో ఎక్కంగా మారి హెచ్చవేస్తాను’
ఇతరులతో విభేదించినప్పుడు ఒకటో ఎక్కం మంత్రంగా పని చేస్తుంది. నా అభిప్రాయంతోనే వుంటాను. ఎందుకంటే నా అభిప్రాయాలే సరైనవని నేను భావించాను.
అదేవిధంగా నా సంతోషాలని ఇతరులకి పంచాల్సి వచ్చినప్పుడు మాత్రం రెండో ఎక్కంగా మారిపోతాను.
రెండో ఎక్కం గురించి ఇలా అంటాను.
‘నా సంతోషాలని, ఆనందాలని
ఇతరులకి పంచాల్సి వచ్చినప్పుడు
రెండో ఎక్కంగా మారి హెచ్చవేస్తాను’
ఇంతవరకు బాగానే ఉంది. మరీ విషాదం కమ్ముకున్నప్పుడు ఏ ఎక్కం చదువుతాను. ఏ ఎక్కంతో హెచ్చవేస్తాను అని ప్రశ్నించుకొని సున్నా ఎక్కంతో హెచ్చవేస్తానని చెబుతాను. ఇలా -
‘కన్నీళ్లూ, విషాదం నన్ను కదిలించినప్పుడు
ఎవరినీ కదిలించక
సున్నా ఎక్కంగా మారి హెచ్చ వేస్తాను’
నా అభిప్రాయాలు సరైనవని అన్పించినప్పుడు ఒకటో ఎక్కం, సంతోషాలని పంచాల్సి వచ్చినప్పుడు రెండో ఎక్కం, విషాదం కదిలించినప్పుడు సున్నా ఎక్కం.
మనిషి జీవన గమనానికి ఈ మూడు ఎక్కాలు సరిపోవా?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001