ఓ చిన్నమాట!
భర్తీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈమధ్య ఓ కథ చదివాను. ఉపయోగం గురించిన కథ అది.
కేసీ అనేది ఓ పక్షి. అడవిలో వుంటుంది. దాని రెక్కలు చిన్నవి. శరీరం పెద్దది. పేరుకి అది పక్షే కానీ అది ఎగరలేదు. అడవిలో చెట్టు నుంచి రాలిపడిన పండ్లని తింటుంది. అడవి చుట్టూ తిరుగుతుంది.
మిగతా పక్షులు కేసీని చూసి నవ్వుకునేవి. మరికొన్ని జాలి పడేవి. కానీ ఈ విషయాలు కేసీకి తెలిసేవి కాదు.
కానీ ఒకసారి ఓ పక్షి కేసీని చూసి హేళనగా మాట్లాడింది.
‘మా అందరిలా ఎగరలేవు.. ఎందుకని?’ అడిగింది.
‘నా శరీరం పెద్దది. రెక్కలు చిన్నవి. మీలా ఎగరలేను’ జవాబు చెప్పింది.
‘నువ్వు పక్షి జాతికే అవమానం కలిగిస్తున్నావు’ అని హేళనగా మాట్లాడి ఎగిరిపోయింది.
కేసీ పక్షి తన మీద తనకే జాలి వేసింది. చనిపోదామని అనుకుంది. కానీ ఆ ఆలోచనని విరమించుకొని అడవి నుంచి బయటకు వెళ్లిపోదామని నిర్ణయం తీసుకుంది.
చివరికి ఒకరోజు అడవి నుంచి బయటకు బయల్దేరింది.
ఈ పక్షుల సంభాషణని విన్న ఓ పండ్ల చెట్టు ‘ఎక్కడికి వెళ్తున్నావు?’ అని అడిగింది.
పక్షి అటూ ఇటూ చూసింది.
చెట్టు మాట్లాడుతుందని గ్రహించి, జవాబు ఇలా చెప్పింది.
‘నేను పక్షి జాతికే కళంకం తెస్తున్నాను. అన్ని పక్షుల మాదిరిగా ఎగరలేను. చెట్ల మీద వున్న పండ్లని తినలేను. క్రింద పడిన పండ్లు మాత్రమే తిని బతుకుతున్నాను. ఇతర పక్షులు నా వైపు అదోలా చూస్తున్నాయి’
‘మీ సంభాషణని నేను విన్నాను. వాళ్ల మాటలని పట్టించుకోవద్దు. నీ అవసరం ఈ అడవికి ఎంతో వుంది. నువ్వు పండ్లని తింటావు. అడవి అంతా తిరిగి ఆ పండ్ల విత్తనాలని వెదజల్లుతావు. దాని వల్ల ఈ అడవి నిండా పండ్ల చెట్లు మొలకెత్తుతున్నాయి. నీవల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇతర పక్షులు అనుకుంటున్నాయి. నిజానికి ఆ పక్షుల వల్ల ఈ అడవికి అంతగా ఉపయోగం లేదు. నీ స్థానాన్ని ఇతరులు భర్తీ చేయడం అంత సులువైన విషయం కాదు’ అంది చెట్టు.
కేసీ పక్షికి చిరునవ్వుతో కూడిన ఆత్మవిశ్వాసం వచ్చింది. తిరిగి అడవిలోకి ప్రయాణం కొనసాగించింది.
దారిలో కన్పించిన ఓ పండుని తిన్నది. ఎప్పుడూ అన్పించనంత మధురంగా ఆ పండు అన్పించింది.
ఇతరులతో పోల్చడం సులువు.
ఆ విధంగా పోల్చుకొని తమ శక్తిసామర్థ్యాలు తక్కువ అనుకోవడం ఇంకా సులువు. కానీ అది వాస్తవం కాదు.
నెగెటివ్ మాటలు చాలా సులువుగా ఆకర్షిస్తాయి.
వాటిని నమ్ముతారు.
కానీ అది సత్యం కాదు.
ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువు దేనికదే సాటి.
పోల్చడానికి వీల్లేదు.
వేరే దానితో దాన్ని భర్తీ చేయడానికి అవకాశం లేదు.