జాతీయ వార్తలు

ఆర్డినెన్స్ బిల్లుల ఆమోదమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వ వ్యూహం
జిఎస్‌టి బిల్లుకు ఆమోదం పొందడంపైనా దృష్టి
న్యూఢిల్లీ, నవంబర్ 22: భూసేకరణ ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోయినందున ఈ నెల 26నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో ముడిపడి ఉన్న మిగతా మూడు బిల్లులకు వీలయినంత త్వరగా చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండబోతోంది. ఈ బిల్లుల్లో ఒకటి చెక్ బౌన్స్ కేసులకు సంబంధించిన నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ (సవరణ) బిల్లు కాగా, రెండవది హైకోర్టుల్లో వాణిజ్య విభాగాలను ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్లు. అలాగే మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఉద్దేశించిన ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చడానికి ఉద్దేశించిన మరో బిల్లు కూడా వీటిలో ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకోవడంతో పాటుగా శీతాకాల సమావేశాల్లో కూడా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఉభయ సభల్లో ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు తమ మధ్య వివాదాలను పక్కన పెట్టి ఒక్కటవుతున్న నేపథ్యంలో తక్కువ వివాదం ఉన్న బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన వ్యూహాన్ని ప్రభుత్వ వ్యూహకర్తలు రూపొందించుకుంటున్నారు. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును తాము అడ్డుకోబోమంటూ ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీనుంచి సంకేతాలు అందడంతో ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడానికి కూడా వ్యూహాలు రచిస్తున్నారు. కీలక బిల్లులను ఆమోదించడంలో ప్రభుత్వానికి సాయపడడానికి ప్రతిపక్షాలను ఒప్పించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయడు ఈ నెల 25న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక రోజు ముందు ఉభయ సభల్లోని ఎన్డీఏ పార్టీల నేతలను కలుసుకోనున్నారు. లోక్‌సభలో ఎనిమిది, రాజ్యసభలో 11 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ పరాజయం తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంటు సమావేశాలు ఇవి. బిజెపియేతర పార్టీలు రాజకీయ రంగంలో తమ విభేదాలు పక్కన పెట్టి ఒక్కటి కావడానికి బిహార్ ఎన్నికలు తోడ్పడిన విషయం తెలిసిందే. కాగా, అసహనంసహా వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న తమ ఉద్దేశాన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదిలా ఉండగా 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొన్నదానికి గుర్తుగా, రాజ్యాంగ నిర్మాత, దళిత నేత బాబా సాహెబ్ అంబేద్కర్‌ను గౌరవించడానికిగాను సమావేశాల తొలి రెండు రోజుల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. అంబేద్కర్ అంశం సున్నితమైనది అయినందున, ఈ అంశం ప్రాధాన్యత దృష్ట్యా ఈ రెండు రోజులు పార్లమెంటు కార్యకలాపాలకు విఘాతం కలిగించడానికి ప్రతిపక్షాలు సిద్ధపడవనే భావన అందరిలో ఉంది. అయితే ఈ నెల 30నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో అసహనం, అవార్డు వాపసీ, దాద్రి ఘటన, ధరల పెరుగుదల, కేంద్ర-రాష్ట్రాల సంబంధాలులాంటి అంశాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేసే అవకాశం ఉంది.