AADIVAVRAM - Others

మనస్సాక్షి (సిసింద్రీ కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామం, సూర్యం స్నేహితులు. ఇద్దరిదీ ఒకే వీధి. ఆ ఊరి ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్తారు. పాఠశాల నుంచి కలిసి ఇళ్లకు చేరుతారు.
రామంకి వాళ్ల మావయ్య ఒక చక్కని పెన్నును బహుమతిగా ఇచ్చాడు. నాలుగు రంగుల రీఫిళ్లు అందులో ఉన్నాయి. ఇష్టం వచ్చిన రంగు రీఫిల్‌తో రాసుకోవచ్చు.
సూర్యంకి ఆ పెన్నంటే ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా మిత్రుడిని ఆ పెన్నును అడిగి తన పేరు రాసి మురిసిపోతుండేవాడు. అలాంటి పెన్ను ఊర్లో కొనాలనుకుంటే అక్కడ దొరకలేదు.
ఒకరోజు పాఠశాల వదిలాక ఇద్దరు మిత్రులు ఇంటి బాట పట్టారు. ముందుగా సూర్యం ఇల్లు వస్తుంది. రామం సూర్యానికి వీడ్కోలు చెప్పి తన ఇంటి వైపు అడుగులు వేశాడు. ఆ సమయంలో అతని పుస్తకాల సంచి నుంచి పెన్ను జారిపోయింది. అతడు చూడలేదు. సూర్యం చూశాడు. ఒక్క క్షణం తటపటాయించాడు. అతడికి పెన్నుపై ఆశ కలిగింది. గబుక్కున పెన్నందుకొని ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఇంట్లో ఎవరి కంటా ఆ పెన్నును పడనివ్వలేదు. తను బాగా ఇష్టపడే పెన్ను అది. అతడికి చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందం ముందు స్నేహాన్ని సైతం మర్చిపోయాడు.
మర్నాడు రామం పాఠశాలకు కలిసి వెళ్లడానికి సూర్యం ఇంటికి వచ్చాడు. సూర్యాన్ని చూడగానే ‘ఒరేయ్! మా మావయ్య ఇచ్చిన పెన్ను పోయిందిరా!’ దిగాలుగా అన్నాడు.
సూర్యం గతుక్కుమన్నాడు. దొరికిన పెన్ను ఇచ్చేయాలనే అనుకున్నాడు. కాని పెన్ను మీద మోజు ఆ పని చెయ్యనివ్వలేదు. పెన్ను పోగొట్టుకున్నందుకు బాధ నటిస్తూ, రామంని ఓదార్చాడు. సూర్యం తల్లీ చెల్లీ కూడా రామం పెన్ను పోయినందుకు బాధపడ్డారు.
సూర్యానికి ఆ రోజు నుంచి మనసులో అలజడి ప్రారంభమైంది. ఆ పెన్నును, ఇంట్లోనూ బయటా ఎవరికీ కనిపించకుండా దాయడానికి పడరాని పాట్లు పడ్డాడు. రామం రోజూ సూర్యం ఇంటికి రావడం ఇద్దరూ కలిసి పాఠశాలకు వెళ్లడం ఎప్పటిలా జరుగుతూనే ఉంది.
రామం మాయామర్మం లేకుండా మాట్లాడుతున్నప్పుడల్లా సూర్యం మనస్సులో ముల్లు గుచ్చుకుంటున్నట్టయ్యేది. పెన్నును వెంటనే మిత్రుడి కివ్వకపోవటం సూర్యంకి ఇబ్బందే అనిపించింది. అలాగని సూర్యం చేసిన తప్పును మిత్రుడి ముందు బయటపెట్టలేక పోతున్నాడు. స్నేహం చెడుతుందని భయం! పెన్నును అతడు స్వేచ్ఛగా వాడగలుగుతున్నాడా.. అంటే అదీ లేదు. మానసిక ఆందోళనే అతడికి దక్కింది. ఆ మానసిక ఆందోళన తట్టుకోడం అతడికి దుస్సాధ్యమయింది. బాగా ఆలోచించి సూర్యం ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఒకరోజు ఉదయమే అతడు తరగతి ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్లాడు. జరిగినదంతా ఉపాధ్యాయుడికి చెప్పేసి ‘ఈ పెన్నును రామంకి చేరవెయ్యండి. అటువంటి పాడు పనిని జన్మలో చెయ్యను. రామంతో నిజమైన స్నేహితుడిగా ఉండటమే నాకిష్టం. దయచేసి నా పేరును మాత్రం బయటపెట్టకండి!’ పెన్నును ఉపాధ్యాయుడికి అందించాడు.
సూర్యం నిజాయితీ ఉపాధ్యాయుడికి నచ్చింది. ‘మనస్సాక్షికి విలువనిచ్చావు. చాలా సంతోషం. ఏదైనా చేసిన పని తప్పు అని తెలుసుకున్నాక ఆ పని ఎన్నడూ చెయ్యకుండా ఉండటమే ఉత్తమ లక్షణం! అది గ్రహించావు. నీవు వృద్ధిలోకి వస్తావు!’ ఉపాధ్యాయుడు మెచ్చుకుంటూ సూర్యంని సాగనంపారు. సూర్యం మనస్సు తేలిక పడింది.
మర్నాడు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి ప్రవేశించగానే ‘ఇటీవల ఎవరైనా పెన్నును పోగొట్టుకున్నారా?’ అని ప్రశ్నించారు.
రామం ‘నా పెన్ను పోయింది సార్!’ అన్నాడు.
‘ఎటువంటిది?’ ఉపాధ్యాయుడు అడిగారు.
‘ఊదారంగులో ఉంటుంది. నాలుగు రంగుల రీఫిళ్లు ఉంటాయి సార్!’ సమాధానమిచ్చాడు రామం.
వెంటనే ఉపాధ్యాయుడు పెన్నును రామంకి అందించారు.
రామం పెన్నందుకొని చూసి ‘నాదే సార్’ అన్నాడు.
‘అయితే తీసుకో’ ఉపాధ్యాయుడనగానే రామం ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
మిత్రుడి ముఖంలో ఆనందం చూసి సూర్యం చాలా సంబరపడ్డాడు. ‘ఒరే రామం. ఎలాగైతేనేం నీ పెన్ను నీ దగ్గరకు వచ్చింది. నాకు కూడా ఇప్పుడు ఆనందంగానే ఉంది!’ మిత్రుడికి చెప్పి ఉపాధ్యాయుడి వైపు కృతజ్ఞతా భావంతో చూశాడు. ఆ ఇద్దరు మిత్రులను చూసి ఉపాధ్యాయుడు ముచ్చటపడ్డారు.

- బెలగాం భీమేశ్వరరావు