Others

కలసి మాట్లాడుకుంటే కలతలకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నున్నగా వుండే తారు రోడ్డుమీద జోరుగా, హుషారుగా సాగిపోయే వాహనాకైనా అక్కడక్కడా గతుకులు, గుంటలు, స్పీడ్‌బ్రేకర్లు తగిలి ప్రయాణం ఇబ్బందికాక తప్పదు. అలాగే సజావుగా సాగే జీవన ప్రయాణంలోనూ అప్పుడప్పుడు కలతలు, కన్నీళ్ళు, సమస్యలు తప్పవు. అవి తనకు తానుగా తెచ్చిపెట్టుకున్న స్వయంకృతాలూ కావచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తనవల్ల తలెత్తే మనస్పర్థలూ కావచ్చు! సమస్య ఏదైనా.. కలతలకు కారణాలు ఏవైనా, ఎన్నయినా వాటి పరిష్కారం మాత్రం ఒక్కదానితోనే సాధ్యమవుతుంది.. అది అందరూ తీరుబడిగా కూర్చుని.. మాట్లాడుకోవటంవల్ల!
తనకు తానుగా కొనితెచ్చుకున్న సమస్యలకు మనిషి తనకు తానే స్థిమితంగా కూర్చుని తన మనసులోకి తొంగిచూస్తూ తన తప్పొప్పులను విశే్లషించుకోవాలి. దీనే్న ‘అంతర్ముఖుడు’ కావటం అంటారు. ప్రతిరోజూ ఓ పది నిమిషాలయినా వౌనంగా కూర్చుని ‘తనతో తను.. తనలో తను’ మాట్లాడుకోవటంవల్ల మనసు నిర్మలమవుతుంది.
చిత్తశుద్ధి కలుగుతుంది. తనలోని లోపాలను సరిదిద్దుకుని, బలహీనతలను జయించగల మానసిక శక్తి అలవడుతుంది. ‘నాకు కోపం ఎక్కువ’, ‘నేను చాలా తొందరగా ఆవేశానికి గురవుతాను’.. నోరు జారడం కూడా చేస్తుంటాను. అందుకే ఈ కలతలు చోటుచేసుకుంటున్నాయి. ‘ఎవరైనా నేను అంటే ఎందుకు పడాలి.. అసలు నాకు అలా అనే హక్కు ఎక్కడిది?’ అని స్వగతంలో తను అనుకోగలిగితే.. సాధన ద్వారా తనను తాను జయించగలుగుతాడు. సంస్కరణ అనేది ముందు తనతోనే ప్రారంభం కావాలని ఎవరికివారు అనుకోగలిగితే ఇక అలాంటివాళ్ళు ఎవరికీ సమస్యాత్మకంగా తయారవరు.
పేమ ఉన్నచోట స్వార్థం
మన దేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత పటిష్టమైనదో ఎంతో కొంత బలహీనమైనది కూడా. ఈ రెండిటికీ కారణం ప్రేమానురాగాలు, అనుబంధాలు అంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. దీన్ని లోతుగా ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ‘నాది నావాళ్ళు’ అన్న స్వార్థం ఉంటుం ది. తనది అనుకున్నదానిమీద మరెవరో ప్రేమ చూపించినా, పోటీకి వచ్చినా ఆ మనిషిలో ఈర్ష్యాసూయలు తలెత్తుతాయి. అతి తక్కువగా డబ్బుల పంపకం, ఆస్తి పంచాయితీలు వీటివల్ల వచ్చే తగాదాలుంటాయి. ఈ అభద్రతాభావం, ఈ హక్కుల పోరాటం ఆగాలంటే ఎవరికివారు మనసులో కక్షలు, కోపతాపాలు, రోషావేశాలు నూరుకోవడం కన్నా కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని మాట్లాడుకోవడం ఉత్తమం. టీవీ సీరియళ్ళకు పగలూ, రాత్రీ అంకితం చేయడం కన్నా కనీసం శెలవు రోజునైనా సమస్యలు చర్చించుకోవడం, విశే్లషించుకోవడం.. ఆ సమస్య సృష్టిలో ఎవరి పాలు ఎంతో చిత్తశుద్ధితో అంగీకరించటం వల్ల సమస్య తీవ్రత తగ్గటం పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.
కలిసి కూర్చుని ఏం మాట్లాడుకోవాలి
మనిషికి దేవుడిచ్చిన మహావరం మాట! అందుకే ఆ మాటకున్న శక్తి అంతా ఇంతా కాదు. గాయపడ్డ మనసుకు పైపూతగా పనిచేస్తుంది. బాధల్లో వున్న మనిషిని ఓదార్చి ఊరడిస్తుంది. ప్రేమను, ఆప్యాయతను అందిం చి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. వయసొచ్చిన పిల్లలు ప్రేమలో పడడం ఈ రోజుల్లో సర్వసాధారణ విషయం. ఈ విషయంలో పిల్లల్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని పెద్దలు వాళ్ళకు భవిష్యత్తు గురించి, పెళ్లి ప్రాముఖ్యం గురించీ వివరించవచ్చు. పిల్లలు తల్లిదండ్రులతో తాము ప్రేమించిన వ్యక్తి వివరాలను నమ్మకం కలిగేలా చెప్పగలగాలి. అలా రెండుమూడుసార్లు ఆ విషయమై మాట్లాడుకోగలిగితే సమస్యకు చక్కటి ఉభయతారకమైన పరిష్కారం దొరకవచ్చు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పిల్లల నిరాదరణకి గురికావడం.. వృద్ధాశ్రమాలను ఆశ్రయించటం ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటి సమస్య అయికూర్చుంది. జీవితంలో ఎన్నో ప్రేమలు, అనుబంధాలు ఉంటాయి. అన్నీ ముఖ్యమే.. గుండె గదుల్లో ఎవరి స్థానం వాళ్ళకే.. ఎక్కువ తక్కువల ప్రసక్తే లేదు అని ఇద్దరికీ అతను చెప్పగలిగితే ఆ ఇల్లు మమతల హరివిల్లు కాదూ!ఏదైనా కలిసి కూర్చుని.. కుటుంబ సభ్యులంతా ఓపెన్‌గా, మనస్ఫూర్తిగా ప్రతిరోజూ ఓ గంటయినా మాట్లాడుకోగలిగితే.. ఎలాంటి సమస్యలైనా ఇట్టే పరిష్కారం అవుతాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. మూతిముడుపులు, మూతివిరుపులు, వౌన పోరాటాలకన్నా ఇదే నయం. అవునని మీరూ అంగీకరిస్తారు కదూ!

***

భూమికకు రచనలు పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు
మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- వాణీచలపతి రావు