AADIVAVRAM - Others

అక్షర జలపాతాలు... పుస్తకాల సోయగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండకోనల్లో దర్శనమిచ్చే జలపాతం నాలుగ్గోడల మధ్య కనిపిస్తే ఎలా వుంటుంది? నీటికి బదులు అక్షరాలు, పుస్తకాలు అలలు అలలుగా కిందివరకూ కనిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణించడం ఎవరి తరం? పైకప్పునుంచి చేతికందే ఎత్తు వరకూ పుస్తకాలు పొందికగా అమర్చివుంటే ఎవరికి మాత్రం చదవాలనిపించదు? ఆశ్చర్యపోవాల్సిందే కదూ. అక్షరాలా అలాంటి అనుభూతి పొందాలంటే చెన్నైలోని ‘మద్రాస్ లిటరరీ సొసైటీ’ని సందర్శించాల్సిందే. లోపలికి అడుగుపెట్టగానే పుస్తకాల సంగతి ఎలా వున్నా ముందు ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. వాటి అమరిక చూస్తే - అక్షరాల జలపాతమా అనిపించక మానదు. ఆ పుస్తకాల సోయగాన్ని చూసి మైమరచిపోవాల్సిందే.
దేశంలోని పురాతన గ్రంథాలయాల్లో చెప్పుకోదగ్గ వాటిల్లో మద్రాస్ లిటరరీ సొసైటీ (ఎంఎల్‌ఎస్) లైబ్రరీ ఒకటి. దీని చరిత్ర ఘనమైనా కాలక్రమంలో సంరక్షణ కరువై కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే దాని ప్రాధాన్యత, విశిష్టత తెలిసిన కొందరు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో రెండు శతాబ్దాల నాటి ఎంఎల్‌ఎస్ లైబ్రరీకి పూర్వవైభవం సమకూర్చే కృషి మొదలైంది.
ఎలా ప్రారంభమైందంటే...
అది 1812 సంవత్సరం. తన సిబ్బందికి పాలనపైనా, భాషలపైనా, చట్టాలు, మతాలు, స్థానిక సంస్కృతులపైనా అవగాహన కల్పించేందుకు ఈస్టిండియా కంపెనీ ఈ లైబ్రరీకి అంకురార్పణ చేసింది. 1812నుంచి 1854 వరకు సెయింట్ జార్జి ఫోర్ట్‌లోనే కొనసాగిన ఈ లైబ్రరీని 1905లో నుంగంబాకమ్‌లోని కాలేజీ రోడ్‌లోకి తరలించారు. ఎర్రటి రంగులో, ప్రత్యేక శైలితో నిర్మితమైన ఈ భవనం నాటి నిర్మాణ కౌశలానికి అద్దం పడుతుంది. ఈ లైబ్రరీలోకి అడుగిడగానే పుస్తకాల అమరికనూ, అరల ఏర్పాటును చూసి అచ్చెరువొందాల్సిందే. పైకప్పు నుంచి కిందికి జాలువారుతున్న ఓ జలపాతంలా పుస్తకాల వరుసలు దర్శనమిస్తాయి.
అతి పురాతన, అతి విలువైన పుస్తకాలకు ఇక్కడ కొదవే లేదు. విశ్వవిఖ్యాత శాస్తవ్రేత్త సర్ ఇసాక్ న్యూటన్ 1729లో రాసిన రాసిన ‘ద మాథమాటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ ఫిలాసఫీ’ కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. 1898లో బ్రిటిష్ అధికారులు ప్రచురించిన ‘ద హిస్టరీ ఆఫ్ బకింగ్‌హామ్ కెనాల్’ కూడా ఆ పక్కనే కనిపిస్తుంది. ప్రతిష్ఠాత్మక బకింగ్‌హామ్ కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించిన అసలు పత్రాలతో పాటు గ్రీక్, ఫ్రెంచ్ భాషలో లిఖించిన రాతప్రతులు కూడా ఎంఎల్‌ఎస్‌లో నేటికీ భద్రంగా ఉన్నాయి. 1798 - 1810 మధ్యకాలంలో ప్రచురితమైన ప్రముఖ పొలిటికల్ కార్టూనిస్టు జేమ్స్ గిల్రే గీసిన కార్టూన్ల కలెక్షన్ పుస్తకం కూడా మద్రాస్ లైబ్రరీ సొంతమే. అయితే నిధుల లేమి, సంరక్షణ కొరవడి విలువైన పుస్తక సంపద ఆకృతులు మారే స్థితికి చేరుతున్నాయి. ఎంఎల్‌ఎస్ దురవస్థ చూసిన కొందరు యువకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం, సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో ఎంఎల్‌ఎస్ ఘన చరిత్ర మరికొన్ని దశాబ్దాల పాటు పాఠకులకు చేరువ కానుంది.
ఈ లైబ్రరీని సందర్శించిన వారిలో సుభాష్‌చంద్ర బోస్, అనీబీసెంట్, టి.టి.కృష్ణమాచారి, సి.పి.రామస్వామి అయ్యర్ వంటి మహామహులు ఉన్నారంటే దీని ఘనత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎంఎల్‌ఎస్‌కు సంబంధించి 1902లో రూపొందించిన నివేదిక ప్రకారం అప్పటి సభ్యత్వం 112 కాగా, నగదు నిల్వ రూ.5,900 ఉన్నట్లు ప్రకటించారు.
చారిత్రక నేపథ్యంతో పాటు మరెంతో ప్రాముఖ్యత కలిగిన ఈ లైబ్రరీ గత కొంతకాలంగా నిరాదరణకు గురవుతూ వచ్చింది. నిధులు లేమితో పాటు చెదలు పట్టి విలువైన పుస్తక సంపద కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది. దీంతో ఈ లైబ్రరీకి పూర్వవైభవం తెచ్చేందుకు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రావడంతో కదలిక మొదలైంది. పుస్తకాల సంరక్షణతో పాటు సభ్యత్వాన్ని పెంచేందుకు వీరు కృషి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంఎల్‌ఎస్ ప్రాముఖ్యతను చాటుతూ సభ్యతాన్ని పెంచే పనిలో పడ్డారు. దక్షిణ భారతంలోనే పేరెన్నికగన్న ఈ లైబ్రరీకి ప్రస్తుతం 200మంది సభ్యత్వం ఉంది. వీరిలో ఎక్కువ శాతం సీనియర్ సిటిజనే్ల. సభ్యత్వం పెంచడంతో పాటు విద్యార్థులను, యువతను ఈ లైబ్రరీ బాట పట్టేలా యత్నాలు ప్రారంభమయ్యాయి. తగినంత నిధులు కేటాయించడంతోపాటు పుస్తక సంరక్షణలో ఆసక్తి కలిగిన సిబ్బంది కష్టపడితే అతి తక్కువ కాలంలోనే ఈ లైబ్రరీకి పూర్వవైభవం వస్తుందని ఇరవయ్యేళ్లుగా ఇక్కడ లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరి అంటున్నారు. ఇప్పుడు పడుతున్న శ్రమ మరెన్నో తరాలకు ఎనలేని సంపదను చేకూరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఈ లైబ్రరీ ఈ దశకు చేరడానికి సంరక్షణ లోపమే అతి పెద్ద కారణమని మూడేళ్ల క్రితం సభ్యత్వం తీసుకున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జె.వి.చంద్రశేఖర్ వాపోతున్నారు. పాఠకుల ఆదరణ కోల్పోడానికి అదొక కారణమని, ఈ లైబ్రరీ గురించి నేటి తరంలో చైతన్యం తీసుకురావడానికి ప్రచారం కల్పించాల్సిన అవసరముందని అంటున్నారు.
పుస్తకం ఎక్కడ కనపడినా పలకరిస్తుంది. అందులోని అక్షరాలు ఆలింగనం చేసుకుంటాయ. వాక్యాలు మనసును పెనవేసుకుంటాయ. అది గ్రంథాలయమైనా, ఇంట్లో అలమరలో ఉన్నా, ఫుట్‌పాత్‌మీద పేర్చినా, చిత్తుకాగితాల షాపులో కంటపడినా - దాని విలువ దానిదే. కాంతులీనే పసిడి కూడా వాటి ముందు దిగదుడుపే. అవి ఎక్కడున్నా, ఏ భాషలో వున్నా, ఏ స్థితిలో వున్నా చేయచేయ కలిపి సంరక్షణకు పూనుకుంటే మరెన్నో తరాలకు తరగని సంపదగా ఎప్పటికీ నిలిచిపోతుంది.

చిత్రం..పురాతన పుస్తక భాండాగారం... మద్రాస్ లిటరరీ సొసైటీ లైబ్రరీ

- ఎస్.మోహన్‌రావు