AADIVAVRAM - Others

రామాయణం.. మీరే డిటెక్టివ్ 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రామా!
విశ్వామిత్రుడు అలా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకుని భూ మండలం అంతా సంచరించాడు. తపస్సు, ధర్మం, పరాక్రమం మూర్త్భీవించిన విశ్వామిత్రుడు మునుల్లో శ్రేష్ఠుడు’ శతానందుడు తను చెప్పేది పూర్తి చేశాడు.
ఆ మాటలు విన్న జనక మహారాజు విశ్వామిత్రుడికి నమస్కరించి చెప్పాడు.
‘రామలక్ష్మణులతో నేను చేసే యజ్ఞానికి వచ్చావు. నీ దర్శనంతో నేను ధన్యుడ్ని, పవిత్రుడ్ని అయి అనేక లాభాలు పొందాను. నీ తపస్సు, బలం, గుణాలు కొలతకి అందనివి. సూర్యాస్తమయ సమయం అయింది. రేపు ఉదయం నా దగ్గరికి రమ్మని కోరుతున్నాను’
జనకుడు, ఆయన గురువులు, బంధువులు విశ్వామిత్రుడికి ప్రదక్షిణ చేశాక ఆయన అనుమతితో జనకుడు వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో బసగా ఏర్పాటు చేసిన జనకుడి రాజమందిరానికి వెళ్ళాడు.
మర్నాడు ఉదయం జనక మహారాజు రామలక్ష్మణులని, విశ్వామిత్రుడ్ని పిలిపించి వారిని పూజించి కోరాడు.
‘విశ్వామిత్రా! నేను ఏం చేయాలో ఆజ్ఞాపించు’
‘క్షత్రియులైన రామలక్ష్మణులు నీ దగ్గర ఉన్న ధనస్సుని చూడాలని అనుకుంటున్నారు. దాన్ని చూశాక వెళ్తారు’
విశ్వామిత్రుడి ఆ మాటలు విన్న శతానందుడు వెంటనే ఆ ధనస్సు చరిత్రని వారికి ఇలా వివరించాడు.
‘పూర్వం దక్ష యజ్ఞ ధ్వంస సమయంలో రుద్రుడు ఈ ధనస్సుని వంచి, దేవతలతో ఉగ్రంగా ఇలా చెప్పాడు.
‘దేవతలారా! యజ్ఞ భాగాలని కోరే నాకు మీరు వాటిని ఇవ్వలేదు కాబట్టి ఈ ధనస్సుతో మీ తలలని నరుకుతాను’
దేవతలు భయపడి శివుడ్ని శాంతింపజేశారు. ఆయన వారిని అనుగ్రహించి ఆ ధనస్సుని వారికి ఇచ్చాడు. దాన్ని దేవతలు మా వంశంలోని ఒకరికి దాచడానికి ఇచ్చాడు. ఇది ఇలా ఉండగా నేను ఒకప్పుడు యజ్ఞ్భూమిని దున్నుతూండగా నాగలి నించి సీత అనే కన్య నాకు లభించింది. ఆమెని కూతురిగా పెంచుతున్నాను. సీతని పెళ్లి చేసుకోడానికి అర్హతగా పరాక్రమాన్ని శుల్కంగా నిర్ణయించాను. చాలా మంది రాజులు సీతని పెళ్లి చేసుకోడానికి, తమ బలాన్ని ప్రదర్శించడానికి మిథిలకి వచ్చారు. వారిలో ఎవరూ ధనస్సుని కదల్చలేక పోవడంతో ఆ బలహీనులకి నేను సీతని ఇవ్వడానికి నిరాకరించాను. వారంతా దీన్ని అవమానంగా భావించి మిథిలా నగరాన్ని సంవత్సరంపాటు ముట్టడించారు. నగరంలో జీవించడానికి అవసరమైన వస్తువులన్నీ తరిగిపోవడంతో నాకు చాలా విచారం కలిగింది. అప్పుడు నేను తపస్సు చేస్తే దేవతలు నాకు చతురంగ బలాలని ఇచ్చారు. ఆ రాజులంతా ఆ యుద్ధంలో ఓడిపోయి తమ పరివారంతో పారిపోయారు. రాముడు ఈ ధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సీతని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాను’
గంధం, పూలమాలలతో అలంకరించబడ్డ ఆ దివ్య ధనస్సు దగ్గరకి జనకుడు వాళ్లని తీసుకెళ్లాడు. దాని వెంట మంత్రులు కూడా వచ్చారు. జనకుడు రామలక్ష్మణులతో, విశ్వామిత్రుడితో ఇలా చెప్పాడు.
‘విశ్వామిత్ర మహామునీ! మా వంశీయులు పూర్వం దీన్ని ఎక్కుపెట్టాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. అప్పట్నించి దీన్ని పూజిస్తున్నాను. సురులు కాని, అసురులు కాని, రాక్షసులు, గంధర్వ, యక్ష, కినె్నర, కిన్నర, మహోరగులు కాని దీన్ని ఎక్కుపెట్టలేక పోయారు. దీన్ని వంచి నారి కట్టి, దాన్ని లాగి బాణం ఎక్కు పెట్టడానికి మనుషులకి శక్తి ఎక్కడిది?’
బ్రహ్మర్షి ఆదేశాన్ని అనుసరించి రాముడు ఆ పెట్టెని తెరచి అందులోని విల్లుని చూసి చెప్పాడు.
‘బ్రహ్మర్షీ! ఈ విల్లుని నేను కదల్చగలిగితే దాన్ని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను’
తర్వాత వేల మంది చూస్తూండగా, రాముడు వింటిని మధ్య భాగంలో పట్టుకుని సునాయాసంగా అందుకుని ఎక్కుపెట్టాడు. దాని నారిని చెవి దాకా లాగడంతో పిడుగు చప్పుడుతో అది విరిగిపోయింది. పర్వతం బద్దలైతే అదిరినట్లుగా భూమి అదిరింది. విశ్వామిత్ర, జనక, రామలక్ష్మణులు తప్ప మిగిలిన అంతా మూర్ఛపోయారు. వారు తేరుకున్నాక జనకుడు కంగారుగా విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘మహామునీ! దశరథ కుమారుడు రాముడి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నా కూతురు సీత ఇక రాముడికి భార్యగా, మా వంశానికి కీర్తిని తీసుకువస్తుంది. సీతకి కన్యాశుల్కం పరాక్రమం అని నిర్ణయించాను. కాబట్టి నా ప్రాణం అయిన సీతని రాముడికి ఇస్తాను. నువ్వు ఆజ్ఞాపిస్తే నా మంత్రులు వెంటనే అయోధ్యకి వెళ్లి, రామలక్ష్మణులు నీ సంరక్షణలో క్షేమంగా ఉన్నారని జరిగింది దశరథుడికి వివరించి, అతన్ని ఇక్కడికి తీసుకుని వస్తారు’
విశ్వామిత్రుడు శతానందుడ్ని అయోధ్యకి పంపాడు.
ఆ హరికథ విన్న శ్రోతల్లోని ఓ వృద్ధుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘హరికథని మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, మీతో సాక్షాత్తు రాముడే తన కథని పలికిస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కాకపోతే మీరు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేవిటో చెప్తా వినండి. ఈ కథని మళ్లీ చెప్పినప్పుడు మీరీ తప్పులని చెప్పకపోతే సరి.’
ఆ ఏడు తప్పులు ఏమిటో కనుక్కోగలరా?
(65వ సర్గ, 27వ శ్లోకం నించి; 66,67 సర్గలు)
**

మీకో ప్రశ్న
*
అయోనిజ అంటే ఏమిటి?
**
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు
*
ఆ ఐదుగురు భక్తుల్లో రాముడి దాసులు వీరే...
1.రామదాసు 2. కబీర్ దాసు.
మిగిలిన ముగ్గురు వేరే దైవాల భక్తులు. (కేరళలోని కంజన్‌గడ్‌కి చెందిన ఇటీవలి కాలపు రామదాసు (పప్పా)
కూడా రామభక్తుడే).
**
కిందటి వారం రామాయణ కథలో తప్పులు
*
1.ఇంద్రుడు కోకిల రూపంలో మన్మథుడితోపాటు రంభ పక్కనే ఉంటానని చెప్పాడు. హరిదాసు దాన్ని చెప్పలేదు.
2.వేయి కాక పదివేల సంవత్సరాలు బండ రాయిగా పడి ఉండు అని విశ్వామిత్రుడు రంభని శపించాడు.
3.ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి భోజనం పెట్టమని కోరాడు. హరిదాసు అది ఇంద్రుడి పన్నాగంగా చెప్పలేదు.
4.విశ్వామిత్రుడి తపోభంగానికి మళ్లీ తిలోత్తమని ఇంద్రుడు పంపలేదు.
5.తపస్సుకి విఘ్నం కలగడంతో తూర్పు దిక్కుకి కాదు విశ్వామిత్రుడు పశ్చిమ దిశకి వెళ్లాడు.
6.బ్రహ్మదేవుడి కొడుకైన వశిష్ఠుడు కూడా నన్ను బ్రహ్మర్షిగా అంగీకరించాలి అని విశ్వామిత్రుడు కోరితేనే వశిష్ఠుడు వచ్చాడన్న సంగతి హరిదాసు చెప్పలేదు.
7.ఆ తర్వాత విశ్వామిత్రుడు అయోధ్యకి బయలుదేరాడు అని వాల్మీకి రామాయణంలో లేదు. ఇది హరిదాసు కల్పించింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి