Others

వర్సిటీల్లో విద్వేషాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు ప్రముఖ పాత్ర వహిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యువశక్తి బలంగా ఉన్న మన దేశానికి ఆదర్శనీయమైన విశ్వవిద్యాలయాలు ఉండడం ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అధ్యయనంతో పాటు సమాజం పురోగమించడానికి ఎలాంటి విధానాలు అనుసరణీయమో లోతైన చర్చలు జరిపి, మార్గ నిర్దేశనం చేయడం అధ్యాపకుల, విద్యార్థుల బాధ్యత. ఇటీవలి కాలంలో మన దేశంలోని విశ్వవిద్యాలయాల్లో ఆ ధోరణి తగ్గుముఖం పట్టడం ఆందోళనకరం. రాజకీయ పార్టీలతో అనుబంధం ఉన్న విద్యార్థి సంఘాలు వర్సీటీల్లో తిష్టవేశాక అక్కడ ప్రశాంతత కరవవుతోంది. రాజకీయ నేతలు స్వప్రయోజనాల కోసం విద్యార్థి సంఘాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)తో పాటు వివిధ ప్రాంతాల్లోని వర్సిటీలు ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కొన్ని నెలల తరబడి ఆందోళనలు కొనసాగాయి. ఈ పరిణామాలతో చదువుకు ఆటంకంతో ఏర్పడడమే కాదు, విద్యార్థుల మధ్య విద్వేషాలు, కక్షలు రాజుకుంటున్నాయి.
తాజాగా దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజాస్ కళాశాలలో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరం. మేధో సంఘర్షణలు జరగాల్సిన చోట భౌతిక ఘర్షణలు చోటు చేసుకోవడం విపరీత పోకడకు నిదర్శనం. అగ్నికి ఆజ్యం పోసినట్లు రాజకీయ పార్టీలు రంగప్రవేశం చేయడంతో వాటి అనుబంధ విద్యార్థి సంఘాలు వర్సిటీల్లో హింసకు పాల్పడుతున్నాయి. ఉన్నత చదువులు చదివే విద్యార్థులు, మేధావులు ఉన్న చోట విభిన్న భావజాలం ఉండడం సర్వ సాధారణం. ఆరోగ్యకర సమాజానికి ఇలాంటి వాతావరణం అవసరం కూడా. విభిన్న భావజాలం ఉన్నపుడు చర్చల ద్వారా ఎవరి వాదనలు వారు వినిపించుకోవాలి. వాదనా పటిమతో తాము నమ్మిన సిద్ధాంతాలను బలంగా ప్రతిష్ఠించ గలగాలి. ఆ సందర్భంలో ఎదురయ్యే భావోద్వేగాలను నియంత్రించుకుంటూనే ఎదుటివారి వాదనను వినగలిగే పరిపక్వత చూపడం అవసరం. వేయి భావాలు వికసించాల్సిన చోట- చేతులు చేసుకొనే యుద్ధ వాతావరణం అభిలషణీయం కాదు. ఇందుకు భిన్నంగా విద్యార్థి సంఘాల నేతలు వ్యవహరించడంతో విశ్వవిద్యాలయాల్లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. చదువుకోవాల్సిన చోట విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకోవడం, పోలీసులు రంగప్రవేశం చేయడం, కేసులు నమోదు కావడం... ఇవన్నీ వర్సిటీల్లో ప్రశాంత వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి. విద్యార్థుల వెనుక రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలు, మతపెద్దలు మోహరించకుండా ఉంటే చాలు. వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. మన దేశంలో చట్టసభలు ఎలాగూ అర్థవంతమైన చర్చలకు దూరంగా ఉంటున్నాయి. పార్లమెంటు ఉభయ సభలు, శాసనసభలు రణరంగాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలనైనా రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఉంచాలి. భావి భారత పౌరులను తీర్చిదిద్దే వర్సిటీలు స్వచ్ఛంగా ఉండాలి. వాటి పనిని వాటిని చేసుకోనిస్తే దేశానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది.

- డా. జివిజి శంకరరావు