Others

తెలుగోడా.. మేలుకో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

’‘’పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెత మన తెలుగోడికి సరిగ్గా సరిపోతుంది. మరి ఇది అదేగా..!
‘గత రెండు దశాబ్దాలుగా అమెరికా చదువులు, అమెరికా ఉద్యోగం మోజులో పడిపోయావు. అమెరికా కుదరకపోతే- ఆస్ట్రేలియా లేదా లండన్ కాకుంటే యూరప్ అనే ధోరణిలో కొట్టుకుపోయాం కదరా’ అనిపిస్తోంది.
కానీ- ఒక్కసారి ఈరోజు ‘ట్రంప్ కార్డు’ నెత్తిన పడడంతో పేకమేడలా కూలిపోవడం మనవంతు అయ్యింది. ఇప్పుడు దినపత్రికల్లో ‘ఇక అమెరికాలో మనం మనం కలిస్తే తెలుగులో గప్‌చుప్‌గా మాట్లాడుకొందాం’ అనీ, ‘అమెరికా చాన్సు లేకుంటే- ఇక చైనాకైనా వెళ్ళచ్చు’ అనే హెడ్డింగులు చూసి ఆశ్చర్యం, దుఃఖం రెండూ కలిగాయి.
‘ఏ దేశమేగినా యందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమిభారతిని..’ అని రాయప్రోలు వారు రాశారంటే ఆయనకు ముందుముందు తరాల్లో మనోళ్లు దూరతీరాలకు వెళ్ళాలనే తహతహలాడుతూ.. మన మూలాలు మరచిపోతారనే అనుమానం కలిగిందేమో? అని నాకు అనుమానం. ‘మన తెలుగోళ్ళు.. ఊళ్లకు ఊళ్లు అమెరికాలో వున్నాం’ అని గర్వంగా నిన్నటివరకూ డప్పుకొట్టుకున్నాం కానీ- నేడు కూచిభొట్ల శ్రీనివాస్ హత్యని నిరసిస్తూ.. బిక్కుబిక్కుమంటున్నదీ మనమే.
అసలేంటి? మనమేంటి? మన పయనం ఎటు..? అని నిన్ను నీవు నిదానంగా తరచి తరచి ఆలోచించాల్సిన తరుణం ఇది కాదా తెలుగోడా? నేటి యువత నిజంగా సుఖపడుతోందా? కాసేపు ఆలోచిద్దాం.
అమెరికాకో మరే దేశానికో వెళ్లి, చదువు‘కొనేది’ సంపాదించడానికేనా? మన పిల్లల జీవిత పరమార్థం అదేనా? చదువు, సంపాదన- వ్యక్తి అభ్యున్నతికే కదా! అభ్యున్నతి అంటే సకల సౌకర్యాలతో అక్కడ హాయిగా ఉండడమేనా మన తెలుగోడి పని. విదేశీ కంపెనీలకు పనిచేసే ‘సేవా’ ఇంజినీర్లను సృష్టించి ఇవ్వడమేనా? జీవితంలో బాల్యాన్ని పణంగా పెట్టి- ఆటపాటలు లేక- నేటి యువత దుర్భరమైన పని ఒత్తిడితో సతమతవౌతుంటే, పెద్దలం చూస్తూ వూరుకొందామా? పనివత్తిడికి గురై, సరైన తిండి, వ్యాయామం, నిద్ర లేక నేటి యువత ఎవరి బాగుకోసం అక్కడ పనిచేస్తున్నట్టు. మన పిల్లల దగ్గర డబ్బుంటే చాలా?
వాళ్ళు వాళ్ళ పిల్లలకి ‘తెలుగు సంస్కృతి’ నేర్పవద్దా? మన సంస్కృతి, మన మాతృభాష పట్ల ప్రేమ వారికి ఉండొద్దా? ‘అమెరికాలో ఉండేవాళ్ళే నయం- ఇక్కడి మనకంటే’ అనే మాటతో తృప్తిపడి పోదామా? నేడు మనలో ‘తెలుగుదనం’ శాతం ఎంతో వెతుక్కోవలసి వస్తోంది. మనం మాట్లాడే భాషలో పరాయి ఇంగ్లీషు ముక్కలే ఎక్కువ. తెలుగు మాటలు ఏరుకోవలసిన గతి! నేడు అమ్మ ‘మమీ’ అయిపోయింది. పిల్లాడిని ఒళ్లో కూర్చొనపెట్టుకొని తెలుగు నీతి కథలూ, పురాణాలూ, పాటలూ, పద్యాలూ, పొడుపుకథలూ నేటి తల్లి చెప్పలేకపోతోంది. ఇంగ్లీషు రైమ్స్ మాత్రం అనర్ఘళంగా చెప్పగలదు. ‘తెలుగు రైమ్స్’ కోసం ‘సీడీ’ల వంక చూస్తోంది. ‘ఏ యాప్‌లో తెలుగు కథలూ, పద్యాలూ బావుంటాయ్!’అని అడుగుతోంది. చదువు తక్కువైనా మన బామ్మలు భారతం, భాగవతంలో పద్యాలు ఎంచక్కగా చెప్పేవారు? ఆ వారసత్వం మనం మన పిల్లలకి ఇవ్వడంలో మనం విఫలం కాలేదా?
నేటి యువత ‘అలవాట్ల’ని ప్రశ్నించకపోవడం ఇప్పటి పెద్దతరం బాధ్యతా రాహిత్యం అనే చెప్పాలి. మనకంటే బాగా చదువుకొన్నారు. బాగా కష్టపడ్డారు కదా అని చూస్తూ ఊరుకుందామా? చదువులతో పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి. కొత్తగా పెళ్లిఅయిన భార్యాభర్తల మధ్య బాంధవ్యం పెనవేసుకొనక విడాకులు ఎక్కువ కావడం మనకు కంటకంగా వుంది. మరొకరితో ‘డేటింగ్’ లేదా పరిచయం, ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’ లాంటివి మన సంస్కృతికి విఘాతాలు. మన సంస్కృతి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి మనం ఏంచేయాలి?
భాషకీ, సంస్కృతికీ దగ్గరి సంబంధం వుంది. మనం మన తెలుగుభాషను ప్రేమించడం, గౌరవించడం మరచిపోయాం. తమిళనాట తెలుగు మీడియం తీసేస్తే మనం స్పందించలేదు సరికదా. మనమూ మన తెలుగునాట తెలుగు మీడియం తీసేసే పనికి పూనుకొంటున్నాం. కాస్త ఆలస్యమైనా ఇది కూడా జరుగుతుంది. మనదంతా ఫార్సు. ‘అయ్యో! తెలుగు మీడియం ఎత్తేయకండి!’ అని ఘోషించేవారి నేతల పిల్లలు ఆ మీడియంలో చదవరు. తెలుగు మీడియం చదివే పిల్లల తల్లిదండ్రులు మాత్రం ‘ఇంగ్లీష్ మీడియం’ కావాలంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే పిల్లలు ఎందుకూ పనికిరారని వారి భయం. ఇదీ మన తెలుగువాడి దుస్థితి.
మెరుపు తునక ఏమిటంటే- 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిన అంతర్జాతీయ ఘనత సాధించిన ఇస్రో శాస్తవ్రేత్తలంతా చదువుకొన్నది గవర్నమెంటు బడుల్లో, వారి మాతృభాషలోనే నట. విన్నారా?!! ఓరోరీ తెలుగోడా! మనకు భాష వద్దు, సంస్కృతి వద్దు, సంపాదనే ముఖ్యం, సౌకర్యాలే లక్ష్యం.. అమెరికాకు కాకపోతే మరో దేశం పోదాం.. ఇదీ మన వాళ్ల ఆలోచన. ఒకరికింద నౌకరీగా బతికే దుస్థితి ఇంకానా? గత 60 ఏళ్ళలో తెలుగు రాష్ట్రాలలో వస్తు తయారీ రంగం మీద దృష్టిసారించి వుంటే నేడు మనమే పదిమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండే వారం.
వినేవారుంటే తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకొని మన సంస్కృతి పరిరక్షించుకొనేందుకు ఎన్నో మార్గాలు.. తెలుగును బతికించాలంటే అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యాలయాల్లో మొదటి మూడు ఏళ్ళూ పిల్లలకు విధిగా తెలుగులోనే బోధించాలి. ఆటపాటల్లో తెలుగు సంస్కృతి నేర్పాలి. కాళ్లాగజ్జా కంకాణమ్మ.. వానల్లు కురవాలి వాన దేవుడా, ఆదివారమునాడు అరటి మొలిచినది.. వంటి పాటలు, శ్రీరాముని దయచేతను.. తన కోపమే తన శత్రువు వంటి.. వంటి వేమన, సుమతీ పద్యాలనీ, పంచతంత్రం వంటి మంచి నీతికథలనీ, రామాయణ, భారత కథలనీ చెప్పించాలి. ఆ మూడు ఏళ్ళూ బడులలోనూ, ఇంట్లోనూ తెలుగే మాట్లాడాలనే నిబంధన తప్పనిసరి. అదేమీ కష్టం కాదు. తెలుగు మన మాతృభాష అని మరవద్దు. ‘అమ్మానాన్నా’ అంటూ తల్లిదండ్రులను పిలవాలని నేర్పాలి. ‘మమీడాడీ’ సంస్కృతిని తగ్గిస్తే మన భాషకు మనుగడ సాధ్యం. కనీసం మూడేళ్లు తెలుగుబోధన తరువాత ఇంగ్లీషు మీ ఇష్టం వచ్చినంత బాగా చెప్పించుకోండి. అందులోనే పాఠాలు చెప్పించండి.. అమెరికాలో ఉద్యోగాలు కావాలిగా మరి! అమ్మను అమ్మగానే చూద్దాం.. ‘మమీ’లా వద్దు.

- బివిఎస్ ప్రసాద్