Others

సగ్గుబియ్యానికి గడ్డుకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూర్పు గోదావరి జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది మెట్ట పంటైన ‘కర్ర పెండలం’ దుంప సాగు. ఏపిలో సుమారు 60వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా తూర్పు గోదావరి జిల్లాలోనే 90 శాతం సాగవుతోంది. కర్ర పెండలం దుంపను ముడి పదార్థంగా వాడుతూ సగ్గుబియ్యం తయారుచేసే మిల్లులు 30 ఉండగా అవన్నీ ఈ జిల్లాలోనే ఉన్నాయి. కర్ర పెండలం కొరత కారణంగా ప్రస్తుతం 15 మిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయి.
కర్ర పెండలం దుంపను అద్దకం పరిశ్రమలో, పశుదాణా తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తారు. ఈ దుంప ఆధారిత పరిశ్రమలైన 20 పిండి మిల్లులకు ఒకప్పుడు పని ఉండేది. ఈ ఏడాది జిల్లాలో 30 వేల ఎకరాలలోపు మాత్రమే దుంప పంట సాగైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దుంప దిగుబడులు ఎకరాకు 25 పుట్టుల నుంచి (పుట్టి 225 కిలోలు) 15 పుట్టులకు తగ్గిపోయాయి. మిల్లర్లు చెల్లించే ధర పుట్టీకి రూ.1,500 గిట్టుబాటు కాకపోవడం వంటి అంశాలతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పంట సాగుచేసే అధికమంది రైతులు కౌలుదారులే. తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతం నుంచి ఇక్కడి దుంపలను రూ.1,800 వరకు (పుట్టికి) చెల్లించి కొనుగోలు చేయడం వల్ల రైతుకు అదనంగా రూ.300 మేర లబ్ది చేకూరుతోంది. ఈ దుంపపై ఆశలు పెట్టుకున్న స్థానిక మిల్లర్లు కొంతమేర పోటీ వాతావరణంలో నష్టపోవాల్సి వచ్చింది. గతేడాది పుట్టి దుంప రూ.800 నుంచి రూ.900 మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది దుంప డిమాండ్ దృష్ట్యా ధర పెంచాల్సి వచ్చిందని మిల్లర్లు చెప్తున్నారు. సగ్గు బియ్యానికి సేలం మార్కెట్‌లో 90 కిలోల బస్తా రూ.3,700 నుంచి రూ.3,800 వరకు ఉండగా పెద్ద రకం సగ్గు బియ్యానికి రూ.4,800 నుంచి రూ.5వేల వరకు ధర పలుకుతోంది. దుంపలో పిండి శాతం తగ్గడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల సగ్గుబియ్యం తయారీకి అవరోధం మాత్రమేకాక ఒప్పందం చేసుకున్న పొలాల్లో దుంప రవాణాను పూర్తిస్థాయిలో చేపట్టలేక నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని సామర్లకోట, పెద్దాపురం మిల్లర్లు వాపోతున్నారు.
గతంలో దుంప క్రషింగ్ సీజన్‌ను 60 నుంచి 90 రోజులపాటు నిర్వహించేవారు. ఈ ఏడాది 30 నుంచి 35 రోజులు మాత్రమే క్రషింగ్ జరిగిందని మిల్లర్లు పేర్కొంటున్నారు. గతంలో నాలుగు లక్షల పుట్టుల దుంపను సగ్గుబియ్యం మిల్లుల్లో కొనుగోలు చేసేవారు. నేడు 2.1 లక్షల పుట్టులు మాత్రమే లభ్యం అవుతోంది. సాగు విస్తీర్ణం తగ్గడం, దుంప దిగుబడులు క్షీణించడం, పోటీ మార్కెట్ కారణంగా దుంప తమిళనాడు ప్రాంతానికి తరలివెళ్లడం వంటి పరిణామాలతో ఈ ప్రాంత కూలీల ఉపాధికి గండి పడింది. సీజన్‌లో ప్రతి సగ్గు బియ్యం మిల్లులో 50 మంది కూలీలకు ప్రత్యక్షంగాను, మరో 100 మందికి పరోక్షంగాను ఉపాధి లభించేది. ఈ ఏడాది కూలీల ఉపాధికి అవరోధం ఏర్పడింది.
దుంప నుంచి పిండిని తయారుచేసే ఫ్లోర్ మిల్లులు తగినంత ముడి సరుకు లేక మూతపడే పరిస్థితికి వెళ్లాల్సి వచ్చిందని ఫ్లోర్ మిల్లుల యజమానులు అంటున్నారు. దుంప క్రషింగ్ అనంతరం పిప్పిని, ఎండు దుంప ముక్కలను ఈ ఫ్లోర్‌మిల్లులో పిండిగా తయారుచేసి మొదటి రకాన్ని అద్దకం పరిశ్రమకు, రెండో రకాన్ని పశువుల దాణా తయారీకి వినియోగిస్తారు. ఒక్కో ఫ్లోర్ మిల్లుల్లో ప్రత్యక్షంగా 50మందికి, పరోక్షంగా 50 మందికి ఉపాధి లభించేది. సగ్గుబియ్యం మిల్లులు అధికంగా మూతపడడంతో ఫ్లోర్ మిల్లులకు ముడి సరుకు లభించని దుస్థితి ఏర్పడింది. కర్రపెండలం దుంపకు బదులుగా మొక్కజొన్న వాడి సగ్గుబియ్యం తయారుచేయటం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో తమిళనాడులో 10 సగ్గుబియ్యం మిల్లులు మూతపడ్డాయి. సగ్గుబియ్యం పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని, అధిక దిగుబడులునిచ్చే, అధిక పిండి పదార్థం గల విత్తనాన్ని ఉచితంగా అందచేయాలని తూర్పుగోదావరి జిల్లా దుంప రైతుల సంఘం కోరుతోంది.

- పుట్టా సోమన్నచౌదరి