AADIVAVRAM - Others

ఎలర్జీ వ్యాధుల్లో దుంపకూరలు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: దుంపకూరలు తినకూడనివా? వాటివల్ల మేలు గురించి వివరాలు చెప్పండి.
జ: దుంపకూరలు తినకూడనివనటం ఒక అపోహ. మనలో ఇలాంటి అపోహలు ఇంకా కొన్ని ఉన్నాయి. గోంగూర తింటే దురదలు వస్తాయి. వంకాయ తింటే లివరు చెడుతుంది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ లాంటి నీరెక్కువగా ఉండే కూరలు నిమ్ము చేస్తాయి. వేసవిలో ఆవకాయ చలవ చేస్తుంది. దుంపకూరలు తింటే షుగరు పెరుగును.. లాంటి కొన్ని మండ నిర్ణయాలు మన బుర్రలో బలంగా నాటుకుపోయాయి. ఇప్పటికిప్పుడు వాటిని మార్చటం అంత తేలికైన విషయం కాదు.
వంకాయ, గోంగూర తింటే ఉబ్బసం రావట్లేదు గానీ, బెండకాయ తగిలిందంటే వచ్చేస్తోంది అనేవారున్నారు. మన శరీర తత్వాన్నిబట్టి సరిపడే వస్తువులనూ, సరిపడని వాటిని ఎంచుకో గలగాలే గానీ, కొన్ని ఆహార ద్రవ్యాలను పాపిష్టివనే ముద్ర వేసి వాటిని మాత్రమే తినటం తగ్గించి దేశం కోసం చాలా త్యాగం చేస్తున్నట్టూ భావించుకొనే వారు త్యాగం చేస్తున్నమనుకోవటం సరికాదు!
దుంపకూరలు అంటే పిండి పదార్థాలతో నిండినవనే సంగతి పచ్చి నిజమే! అవి షుగరుని పెంచేవే గానీ, తగ్గించేవి కావు కూడా! షుగరు, బీపీ, స్థూలకాయం, కీళ్లవాతం, ఎలర్జీ వ్యాధులున్న వారికి ఇవి అపకారం చేసే మాట వాస్తవం.
ప్రతీ ద్రవ్యానికీ కొన్ని గుణాలుంటాయి. కొన్ని ప్రభావాలుంటాయి. కొన్ని అనుకూల లక్షణాలు, కొన్ని ప్రతికూల లక్షణాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకొని, మంచిని ఎక్కువగా ఉపయోగించుకో గలగటం, చెడును తగ్గించుకో గలగటంలో మనం యుక్తిని ఉపయోగించవలసి ఉంటుంది.
ప్రతీ దానికీ మందులు ఉండవు. శరీరానికి సరిపడని గోంగూరని సరిపడేలా చేసేందుకు మందు ఉండదు. అలాగే, షుగరుని పెంచే ఆహార ద్రవ్యాలు తిన్నప్పటికీ షుగరు పెరక్కుండా చేసే మందు కూడా ఉండదు. నొప్పి తగ్గే బిళ్ల వేసుకుని గోడ దూకితే కాలు నొప్పి పట్టకుండా ఆగదు. కాబట్టి, ఎలర్జీలకు గానీ, షుగరు వ్యాధికి గానీ, కీళ్ల నొప్పులకు గానీ వాడే మందులు ఏ రోజు పెరుగుదలను ఆ రోజుకు ఆపటానికి మాత్రమే కానీ, రేపు అవి తిరిగి రాకుండానో, తిరిగి పెరక్కుండానో చేయటానికి ఉద్దేశించినవి కావు. కాబట్టి ఈ వ్యాధుల విషయంలో ఎవరికి వారు తమకు సరిపడేవీ సరిపడనివీ ఏవో చూసుకుని జాగ్రత్త పడాలి. మన యుక్తిని ఉపయోగించి, పడనిదాన్ని కూడా పడేలా చేసుకోగలగాలి!
ఆయుర్వేద శాస్త్రం ఒక ద్రవ్యాన్ని దాని రసం, గుణం, వీర్యం, విపాకం, ప్రభావం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ ద్రవ్యం శరీరంపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో విశే్లషిస్తుంది. ఉదాహరణకు చిలగడ దుంపలు తీపి రసం, శీతగుణం, శీతవీర్యం, మధురవిపాకం కలిగి ఉంటాయి. కాబట్టి షుగరు వ్యాధిలో అపకారం చేసేవిగా ఉంటాయి. ప్రభావరీత్యా చూసినపుడు ఇవి కఠినంగా అరుగుతాయి. కాబట్టి వాతదోషాన్ని పెంచుతాయి. జీర్ణశక్తిని తగ్గిస్తాయి. జీర్ణశక్తి మందగించటం వలన కలిగే వ్యాధులన్నీ వీటివలన కలిగే అవకాశం ఉంది.
ఆధునిక వైద్యం అయితే, ఒక ఆహార ద్రవ్యంలో కేలరీలు ఇతర పోషక విలువలు ఎన్ని ఉన్నాయో లెక్కించి దాని ప్రభావాన్ని విశే్లషిస్తుంది. ఆ విధంగా చూస్తే వంద గ్రాముల చిలకడ దుంపల్లో 28 గ్రాముల పిండి పదార్థాలుంటే, వంద గ్రాముల బియ్యంతో వండిన అన్నంలో 87 గ్రాముల పిండి పదార్థాలుంటాయి. చిలకడ దుంపల్లోకన్నా ఆలూ దుంపల్లో కేలరీలు మరింత తక్కువ ఉంటాయి. ఇప్పుడీ వంద గ్రాముల దుంప కూరనీ, వంద గ్రాముల బియ్యాన్నీ కలిపి తిన్నప్పుడు 15 గ్రాముల పిండి పదార్థం తిన్నట్టవుతుంది. అదే బంగాళా దుంప కూరని అన్నంతో సంబంధం లేకుండా విడిగా తినేందుకు వీలుగా వండుకొని, అన్నం లేకుండా తింటే 28 గ్రాములకే పరిమితం అవుతుంది. అప్పుడు షుగరు అంతగా పెరగదు కదా! అన్నం కలపక పోవడం వలన కష్టంగా అరగటం అనేది తగ్గుతుంది! అందువలన వాతం పెరగకుండా ఉంటుంది...
ఆలు దుంపల పుట్టిల్లయిన అమెరికాలోగానీ, యూరప్‌లోగానీ బంగాళా దుంపల్ని మనం తింటున్నట్టు సలసలా కాగే నూనెలో వేసి, నరక లోకంలో పాపుల్ని వేయించినట్టు వేయించి, నల్లగా బొగ్గు ముక్కల్లా మాడ్చి, బంగాళా దుంపల బొగ్గుల్ని ఉప్పూ కారం చల్లుకొని అన్నంలో కలుపుకొని తినరు.
ఇలా తింటే షుగరు మాత్రమే కాదు, ఇంకా ఇతర వ్యాధులు కూడా వెంటబడతాయి. వాతపు నొప్పులు మరింత పెరుగుతాయి.
యూరప్‌లో ఆలుగడ్డల్ని ఉడికించుకొని నేరుగానే తింటారు. కానీ పరిమితంగా తింటారు. మనం కూడా అదే విధానాన్ని అనుసరించటం మంచిది. పడనివి అంటూ ఒక ముద్ర వేసి వదిలేసుకుంటూ పోతే చివరికి తినేందుకు ఏదీ ఉండని పరిస్థితి. దుంపకూరల్లో అతి తియ్యగా ఉండే చిలకడ దుంపలు, బంగాళా దుంపలూ షుగరు పెంచేవిగా ఉంటాయి. కష్టంగా అరుగుతాయి. స్వభావరీత్యా ఇవి వాతదోషాన్ని పెంచుతాయి. కాబట్టి, వీటిని పరిమితంగా తినాలని సూచించటం మా బాధ్యత.
జీర్ణశక్తి బలంగా లేనివారు అందుకు తమ ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా గుర్తించి తగిన మార్పులు చేసుకోగలగాలి. ఏది తిన్నా సరిపడక నానా హైరానా పడుతున్న వారే ఎక్కువమంది కనిపిస్తారు. అందుకు కారణం అవుతున్న మనం ఆహారాన్ని వండుకునే పద్ధతుల్ని బాగా మార్చుకోవలసిన అవసరం ఉంది. తద్వారా వ్యాధుల తీవ్రతను తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది.
దుంపకూరల్లో కేరెట్, ముల్లంగి, బీట్‌రూట్ లాంటి దుంపలు షుగరును పెంచేవే అయినప్పటికీ, శరీరంలో విషదోషాలు పెరక్కుండా కాపాడుతాయి. కాబట్టి ఈ దుంపలను సాధ్యమైనంత తరచూ తింటూ ఉండటం మంచిది.
ఒక కేరెట్, ఒక ముల్లంగి కలిపిన జ్యూసు ఒక గ్లాసు చొప్పున రోజూ తాగుతూ ఉంటే శరీరానికి చలవ చేస్తుంది. కీళ్లవాతం, షుగరు వ్యాధుల్లో ఉపద్రవాలు తగ్గుతాయి. ముఖ్యంగా అరికాళ్ల మంటలు, మొద్దుబారినట్లుండటం లాంటి బాధలకు ఇది మంచి ఔషధం.
దుంపకూరలను ఎక్కువ అన్నంలో కలుపుకోవలసిన విధంగా వండకండి. వీలైతే అన్నం కలపకుండా కూర ఒక్కటే విడిగా తినవచ్చు కూడా! అయితే జీర్ణశక్తిని బట్టి పరిమితంగా తినటం మంచిది.
*

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

- డా. జి.వి.పూర్ణచందు