Others

ఎవరెస్ట్‌పై విజయ పతాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాకు మెలో డ్రామాతోపాటు కొన్ని ఎలిమెంట్స్ ముఖ్యమే. కానీ, స్ఫూర్తిదాయకంగా వచ్చే కొన్ని చిత్రాలను రొటీన్ జాబితాలో చేర్చి సక్సెస్, ఫెయిల్యూర్ కోణంలో చర్చించలేం. అలాంటి చిత్రమే పూర్ణ: కరేజ్ హాజ్ నో లిమిట్. పదమూడేళ్ల ప్రాయంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఓ గిరిజన బాలిక సాహస ఘట్టం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించారు. ఆ బాలిక జీవితాన్ని ఆవిష్కరించటమే కాదు, వందమందిలో చైతన్యాన్ని రగిల్చే చిత్రంగానూ దీన్ని తీర్చిదిద్దారు. బాలీవుడ్‌లో వస్తున్న బయోపిక్‌ల పరంపరలో ఈ చిత్రాన్నీ ఒకటిగా చెబుతున్నా -పూర్తిగా బయోపిక్ అనలేం. ఎవరెస్ట్ అధిరోహించిన గిరిజన బాలిక తెగువపైనే సినిమా మొత్తం ఫోకస్ చేశారు.
2014 మే 25న ఒక్కసారిగా ప్రపంచం దృష్టికి వచ్చింది ఓ బాలిక. ఆమె తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పాకాలలో పుట్టిపెరిగిన గిరిజన బాలిక. పదమూడేళ్ల వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన పసికూనగా వార్తల్లోకెక్కింది. ‘బలమైన సంకల్పం ముందు ఎవరెస్ట్ అయినా తలొంచుతుంద’ని నిరూపించిన ఆమె కథను తీసుకుని, పూర్ణ సాహసోపేత జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు బాలీవుడ్ దర్శకుడు రాహుల్ బోస్.
తెలంగాణలోని సంక్షేమ వసతి గృహంలో చదువుతుంటుంది గిరిజన బాలిక పూర్ణ (అదితి ఇనామ్‌దార్). పర్వతారోహణపై ఆమె చూపించే ఆసక్తి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ (రాహుల్ బోస్) దృష్టికి వస్తుంది. ఆమె సంకల్పానికి ముగ్దుడైన ప్రవీణ్, పూర్ణను ప్రోత్సహిస్తాడు. అక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది. లక్ష్యం ఎంత కసిగా ఉంటుంది? దాన్ని చేరుకోవడానికి సన్నాహక కసరత్తులు ఎంత భయంకరంగా ఉంటాయి? సాహసోపేత ప్రయాణం ఎంత ఆనందాన్నిస్తుంది? చివరకు బాలిక మనోధైర్యం ముందు ఎవరెస్ట్ ఎలా తలొంచింది? లాంటి ప్రశ్నలకు సన్నివేశాల్లో చూపిన సమధానమే మిగతా చిత్రం. ఎవరెస్ట్‌పై మువ్వనె్నల పతాకాన్ని ఎగరేసిన పూర్ణ సాహస ప్రయాణాన్ని ఆసక్తిగా చూపించగలిగాడు దర్శకుడు. చిన్ననాటి పూర్ణ జీవితంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు కనుక -పూర్తిగా బయోపిక్ అనలేం. సాహసోపేత యాత్రను స్ఫూర్తిదాయకంగా తీర్చిదిద్దన కథగానే ప్రస్తావించుకోవాలి. నిజామాబాద్ జిల్లాలోని పూర్ణ పుట్టిన ఊరు పాకాల సహా, భువనగిరి, హైదరాబాద్, డార్జిలింగ్, సిమ్లా, నేపాల్ ప్రాంతాలను కథానుగుణంగా తెరకెక్కించడం బావుంది. సినిమాకు తగినట్టు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినా, ఎక్కడా అతిగా అనిపించదు. పూర్ణ పాత్రను పోషించిన ఆదితి ఇనామన్‌దార్ మెప్పించింది. ఐఏఎస్ అధికారిగా రాహుల్ బోస్, ఇతర పాత్రల్లో ధ్రుతిమాన్, హీబా, జ్ఞానేంద్ర చక్కటి నటన కనబర్చారు. సలీం సులేమాన్ ద్వయం అందించిన నేపథ్య సంగీతం చిత్రానికి అదనపు బలం. ప్రమాదం అంచున సాగే పర్వతారోహణ దృశ్యాలను కెమెరామెన్ అద్భుతంగా చూపించగలిగాడు. పదహారేళ్ల తరువాత మెగాఫోన్ పట్టిన రాహుల్ బోస్ యువతలో స్ఫూర్తిని నింపే చక్కని కథను స్క్రీన్‌కు తేవడం అభినందనీయం. అందరికీ ఎవరెస్ట్ ఎక్కాలనిపించకపోవచ్చు. కానీ, జీవితంలో ఎవరెస్ట్ స్థాయికి ఎదిగే ప్రయత్నంలో కష్టాలను అధిగమించాలంటే సంకల్పం ఎంత బలంగా ఉండాలో నేర్పిస్తుందీ చిత్రం. పిల్లలు చూడదగ్గ సినిమా.
*

-రాణీప్రసాద్