Others

భాగ్యరేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: పాలగుమ్మి పద్మరాజు
స్క్రీన్‌ప్లే, మాటలు:
బిఎన్ రెడ్డి, పాలగుమ్మి పద్మరాజు
కెమెరా: బిఎన్, కొండారెడ్డి
కళ: టివిఎస్ శర్మ
ఎడిటింగ్: వాసు
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాతలు: పొన్నలూరి బ్రదర్స్
దర్శకత్వం: బిఎన్ రెడ్డి
--

కళాత్మక చిత్రాల దర్శకులు, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత బిఎన్ రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి). రాశికంటే వాసి ముఖ్యమని నమ్మిన బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు డజను మాత్రమే (11 తెలుగు చిత్రాలు+ ఒక తమిళ చిత్రం -రాజమకుటం). వాటిలో వాహిని సంస్థకు 10 చిత్రాలు చేయగా, ఇతర నిర్మాతలకు పనిచేసినవి 2 చిత్రాలే. అవి భాగ్యరేఖ, పూజాఫలం. పొన్నలూరి బ్రదర్స్ రూపొందించిన భాగ్యరేఖ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్టప్రతి ప్రశంసాపత్రం లభించింది. వాహిని వారి ‘పెద్దమనుషులు’ పూర్తవుతున్న తరుణంలో పాలగుమ్మి పద్మరాజు ‘్భగ్యరేఖ’ కథను వ్రాసారు. బిఎన్ రెడ్డి ఎందుకనో దాన్ని పక్కకుపెట్టి ‘బంగారుపాప’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తరువాత పొన్నలూరి బ్రదర్స్ తమకొక చిత్రం రూపొందించమని బిఎన్‌ను కోరగా, వారికి ‘్భగ్యరేఖ’ కథను సూచించటం, అది నచ్చిన పొన్నలూరి బ్రదర్స్ 1957లో రూపొందించటం జరిగింది. ఆ చిత్రమే భాగ్యరేఖ. ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. బిఎన్ రెడ్డి వద్ద పెండ్యాల పనిచేయటం అదే తొలిసారి. 1957 ఫిబ్రవరి 20న భాగ్యరేఖ విడుదలైంది.
--

తల్లితండ్రులు లేని లక్ష్మి పిన తండ్రి నారాయణరావు (సిఎస్‌ఆర్) వద్ద పెరుగుతుంటుంది. తాత ముసలయ్య (గోవిందరాజుల సుబ్బారావు) ఆమెకోసం నెలనెలా డబ్బులు పంపుతుంటాడు. నారాయణరావు భార్య జగదాంబ (సూర్యాకాంతం) పరమ గయ్యాళి. లక్ష్మిని కష్టాలు పెడుతుంటుంది. ఆమె కొడుకు కోటయ్య, కూతురు కాత్యాయని. కోటయ్య చెల్లెలు లక్ష్మి పట్ల అభిమానంతో ఉంటాడు. నారాయణరావు లక్ష్మి చేయి చూసి ఆమె భాగ్యవంతురాలు అవుతుందని చెబుతాడు. తల్లి పెట్టే ఆంక్షలు భరించలేక కోటయ్య ఇల్లువదిలి మిలటరీకి వెళ్ళిపోతాడు. లక్ష్మిని, జగదంబ పెట్టే కష్టాలు చూడలేక ముసలయ్య తనతో తీసుకెళ్తాడు. లక్ష్మి యుక్తవయస్కురాలు అయ్యేటప్పటికి ముసలయ్య మరణించటంతో తిరిగి జగదంబ ఇంటికి చేరుతుంది లక్ష్మి. కూతురు కాత్యాయని (జానకి)కి పెళ్ళి సంబంధం తెస్తుంది జగదాంబ. ఆ పెళ్ళివారు లక్ష్మిని చేసుకుంటామని అనటంతో జగదాంబ మరింతగా లక్ష్మిని బాధిస్తుంది. ఆ రాత్రి లక్ష్మి ఇల్లువదలి ఆత్మహత్య చేసుకుందామని అనుకునేసరికి, ఓ తప్పిపోయిన పాపను కాపాడాల్సి వస్తుంది. ఆ పాపతోపాటు వారింటికి వెళ్తుంది. ఆ పాప తండ్రి కెవియస్ శర్మ, తల్లి సీతమ్మ (హేమలత) ధనవంతులు. కలవారి అమ్మాయి శశి (బేబీ శశికళ)కి చదువు చెబుతూ, వారికి సాయంగా ఉంటుంది లక్ష్మి. ఊరినుండి వచ్చిన వారి కుమారుడు రవి (ఎన్టీఆర్) లక్ష్మి (జమున)ని చూచి ప్రేమిస్తాడు. తల్లిదండ్రులను ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటానని అంటాడు. ధనంకన్నా గుణంమిన్న అని భావించిన అతని తల్లిదండ్రులు ఈ పెళ్ళికి అంగీకరిస్తారు. కాని వారి బంధువు జగన్నాథం (డాక్టర్ శివరామకృష్ణయ్య) తమ కుమార్తె లక్ష్మీకాంతాన్ని రవికిచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తాడు. తమ గుమాస్తా రంగయ్య (అల్లు రామలింగయ్య) ద్వారా లక్ష్మి పినతల్లికి, ఆ ఊరివాడైన సాంబయ్య (రమణారెడ్డి)కు డబ్బు ఆశపెట్టి, లక్ష్మికి చిన్నతనంలోనే పెళ్ళి జరిగిందని అబద్ధం చెప్పించి పెళ్ళి చెడగొడతారు. రవి మనసు చెదిరి అనారోగ్యం పాలవుతాడు. లక్ష్మి ఇల్లువదిలి వెళ్ళిపోయి టీచర్‌గా పని చేస్తుంటుంది. కాత్యాయిని, తన వూరివాడైన పుల్లయ్య (రేలంగి) మాటలు నమ్మి, ఇల్లువదిలి వచ్చి నాటకాలు వేస్తూ కాలం గడుపుతుంటారు. వారు లక్ష్మిని కలుస్తారు. ఆమె గురించి అన్న కోటయ్య (నాగభూషణం)కు చెప్పగా, కోటయ్య లక్ష్మిని, రవి తల్లిదండ్రులను కలిసి ఆమె జీవితాన్ని చక్కదిద్ది, రవితో పెళ్ళి జరిగేలా చేస్తాడు. చిత్రం శుభంగా ముగుస్తుంది. ఈ చిత్రంలో రేలంగి, టూరింగ్ టాకీసు సినిమా ప్రచారంలో వేసే వీధి డాన్సులో నర్తకిగా ఇవి సరోజ నటించారు. ఆమెతో నాట్యంలో పద్మనాభం, బాలకృష్ణ కనిపిస్తారు. బస్తీలో కాత్యాయనిని ఫొటోలు తీసే ఫొటోగ్రాఫర్‌గా పేకేటి శివరాం, జమున (లక్ష్మి)ని ఆత్మహత్య నుంచి విరపింపచేసిన బైరాగిగా కస్తూరి నరసింహారావు (1937 విప్రనారాయణ హీరో) నటించారు. ఈ చిత్రంలో ముసలయ్యగా గోవిందరాజుల సుబ్బారావు ఎంతో నిండుతనంతో కూడిన నటనతో మెప్పించారు. మనుమరాలు లక్ష్మిపట్ల ఆపేక్ష, అభిమానం, పినతల్లి వద్దనుంచి తీసుకొచ్చి శ్రద్ధగా చదువునేర్పటం, తాను మరణిస్తూ ఆమెకై వేదన.. ఎంతో ఆర్ధ్రతాపూరితమైన చూపులతో ఆకట్టుకున్నారు. లక్ష్మిగా జమున ఆ పాత్రకు తగ్గ సౌమ్యం, శాంతం, గంభీరం, వివేకం, అన్న కోటయ్య పట్ల అభిమానం, ప్రేమించిన రవి తనను పెండ్లాడతానని, తల్లితండ్రులను ఎదిరిస్తానన్నపుడు వారి గురించి ఆలోచించమని చెప్పే బాధ్యత, తన స్థాయినెరిగి ఒద్దికతో ప్రవర్తన, పెళ్ళికి అంగీకారం కుదిరాక ప్రియునితో ప్రణయంలో పరవశం, పెళ్ళి ఆగిపోయినా నిబ్బరంతో స్వతంత్ర జీవనం, తిరిగి ప్రియునికి అనారోగ్యం అని తెలిసి వేదనతో అతన్ని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం.. పలు వైవిధ్యాలను ఎంతో సంయమనంతో నటనలో చూపారు. చిన్న పాత్ర అయినా లక్ష్మి అన్న కోటయ్యగా నాగభూషణం చెల్లెలిపట్ల బాధ్యత, తల్లిదండ్రుల నెదిరించి ఆమెను ఆదుకోవటం, ఎంతో భావగర్భితమైన నటనతో మెప్పించారు. నాయికా ప్రధానమైన ఈ చిత్రంలో హీరో ఎన్టీఆర్‌ది రవి పాత్ర. సినిమా మొదలైన చాలాసేపటి తరువాతగానీ ప్రవేశించదు. తమ సంస్కృతి, సంప్రదాయం పట్ల గౌరవంగల యువకునిగా, ఆదర్శభావాలతో తన మనసును ఆకర్షించిన లక్ష్మిని పరిణయం చేసుకోవాలని స్థిరనిశ్చయం, ఆమెతో పెళ్ళి జరగబోయే స్థితిలో చిన్ననాడు ఆమెకు వివాహం జరిగిందని తెలిసి కృంగిపోవటం.. లాంటి సన్నివేశాల్లో తనదైన శైలి అభినయాన్ని ఎన్.టి రామారావు ప్రదర్శించారు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రపరిధుల మేరకు నటించి న్యాయం చేశారు. రేలంగి, జానకి హాస్యాన్ని, కొంత సీరియెస్‌నెస్ కలిపి సన్నివేశాలకు అనుగుణంగా మెప్పించారు.
దర్శకులు బిఎన్ రెడ్డి లక్ష్మి, కోటయ్య, కాత్యాయని, పుల్లయ్య పాత్ర స్వభావాలను చిన్నతనం నుంచే, వైవిధ్యాన్ని చూపటం, వారి వయసుతోపాటు ఆ లక్షణాలు, మార్పులేకుండా ప్రవర్తించటం, తన స్వార్థం చూసుకునే జగదాంబ గయ్యాళితనం, ఇతరులను మోసంచేసి తన పబ్బం గడుపుకునే సాంబయ్య వంటి ఆషాడభూతిని ఎంతో సహజంగా చూపటం, సన్నివేశాలను అర్థవంతంగా తీర్చిదిద్ది, సంప్రదాయం, మంచితనం, విశ్వాసం అనే ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవటంలోగల నీతిని సందేశాత్మకంగా చిత్రీకరించారు. చక్కని నృత్యాలను, వీధి నృత్యనాటికను ప్రవేశపెట్టడం వారి అభిరుచికి నిదర్శనం.
తిరుమల తిరుపతి కొండపై ఎక్కువ భాగం చిత్రీకరించి గుడి, కోనేరు, ఉత్సవాలు, ఊరేగింపును ఓ పాటలో చూపించటం విశేషం.
భాగ్యరేఖ చిత్ర గీతాలు:
లక్ష్మి (జమున)పై చిత్రీకరించిన భాగవతంలోని పద్యం -ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపలనుండు (పి.సుశీల). జమునపైనే చిత్రీకరించిన మరో పద్యం -తల్లిని తండ్రిని ఎరుగగదా నా తండ్రి ఏ సుఖమెరుగగదా (పి.సుశీల-దేవులపల్లి). జమున, భక్తుల నేపథ్యంలో తిరుమలలో చిత్రీకరించిన గీతం -తిరుమల మందిర సుందరా హరిగోవిందా గోవిందా (మల్లిక్ బృందం- దేవులపల్లి). ఈ చిత్రంలో చిరస్మరణీయ గీతం, జమున, ఎన్టీఆర్‌పై చిత్రీకరించారు. ఇంటి తోటలో పూలుకోస్తూ జమున పాడుతుంటే, మేడ గదిలో ఎన్టీఆర్ రియాక్షన్‌లతో.. -నీవుండే దాకొండపై నాస్వామి/ నేనుండేదీనేలపై/ ఏ లీలా సేవింతునో, ఏ పూల పూజింతునో (పి.సుశీల-దేవులపల్లి). ఇదే వరుసలో ఎన్టీఆర్, జమునను ఉద్దేశించి పాడే ప్రణయం తెలిపే గీతం -నీ సిగ్గే సింగారమే ఓ చెలియా/ నీ పలుకే బంగారమే (ఎఎం రాజా- దేవులపల్లి). నాగిని చిత్రంలోని -తనుడోలే మేరా మన్ డోలే’ ట్యూన్ ఆధారంగా రూపొందిన యుగళ గీతం, ఎన్టీఆర్ జమునలపై ఆహ్లాదకర చిత్రీకరణ -మనసూగే సఖ తనువూగే ప్రియా మదిలో. నదిలో పడవలో పయనిస్తూ -తరువూగే సఖి తెరువూగే ప్రియతలిరామ్ ఓలే (ఎఎం రాజా, పి.సుశీల- దేవులపల్లి). జమునపై చిత్రీకరించిన విషాద గీతం -కన్నీటి కడలిలో నా చుక్కాని లేని నావ (పి.సుశీల-దేవులపల్లి). లక్ష్మీకాంతం, ఎన్టీఆర్ ముందు పాడే నృత్య గీతం -కనె్న ఎంతో సుందరి/ సన్నజాజి పందిరి/ చినె్న చూసి వనె్నచూసి (జిక్కి- దేవులపల్లి). ఇవి సరోజపై చిత్రీకరించిన నృత్య గీతం -అందాల రాజవాడురా నా వనె్నకాడు ఎందుదాగి (జిక్కి- మోహన్‌రాజ్-కొసరాజు). జానకి, రేలంగిలపై చిత్రీకరించిన రెండు వీధి నృత్య గీతాలు -లోకం గమ్మత్తురా, ఈలోకం గమ్మత్తురా (మాధవపెద్ది, సత్యవతి- ఆదిశేషారెడ్డి). మరో గీతం -ఏక్‌బుడ్డి ఆఠాణా దోబుడ్డి బారణా పథ్యమేదిలేదండి’ (మాధవపెద్ది, స్వర్ణలత-కొసరాజు). భాగవతంలోని పద్యం -కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి (ఘంటసాల). జమున ఆత్మహత్యకు తలపడిన నేపథ్యంలో వచ్చే పద్యమిది. భాగ్యరేఖలో హీరో ఎన్టీఆర్‌కు ఎఎం రాజా పాడటం, ఒక్క నేపథ్యం, పద్యం మాత్రమే ఘంటసాల ఆలపించటం జరిగింది. ఈ చిత్రంలోని గీతాలు అలరించేలా సాగాయి. భాగ్యరేఖ విజయం సాధించిన చిత్రం. శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం తెచ్చిన లాభాలతో పొన్నలూరి బ్రదర్స్ పొన్నలూరి స్టూడియో నిర్మించి తమ తరువాతి చిత్రాలు దాంట్లో రూపొందించారు.
గాలివాన కథతో అంతర్జాతీయ అవార్డు పొందిన పాలగుమ్మి పద్మరాజును బిఎన్ రెడ్డి -బంగారుపాప చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. వారి తరువాతి చిత్రం భాగ్యరేఖ కావటం మరో విశేషాంశంగా భావించాలి.

- సివిఆర్ మాణిక్యేశ్వరి