Others

జగతికి ఉపదేశం..మారుతి సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం......... మారుతిం నమత రాక్షసాంతకం- ఎక్కడ రామ భజన జరుగుతుంటుందో అక్కడ కన్నుల నీరు నింపుకుని మారుతి సాక్షాత్కరిస్తుంటాడు. రామకింకరుడుగా ఆంజనేయుడు సర్వులకు తెలిసినవాడు. వ్యాసులవారు చెప్పిన నవ విధ భక్తుల్లో దాస్య భక్తికి ప్రత్యక్ష సాక్ష్యం వాయుపుత్రుడు.
తన చేతులతో ఎందరి రాక్షసులనో మట్టుపెట్టినవాడుగా ప్రసిద్ధుడు. రాక్షసులకే కాదు భూతప్రేత పిశాచాదులకు కూడా ఆంజనేయుని నామం వింటే అవి పరుగెత్తి పారిపోవలసిందే. అటువంటి అంజనీసుతుడు సూర్యుని విద్యార్థి. ఇతడు సూర్యునితోపాటు నడుస్తూ సర్వ విద్యలనూ నేర్చుకున్నాడు. సుగ్రీవునికోసం వెళ్లి రామాదుల దర్శనం చేసుకొన్నాడీ వాయునందనుడు. ఆ కేసరి తనయుని వాగ్ధాటిని చూచి రాముడు అపశబ్దమే పలుకని ఇతడు నవవ్యాకరణ పండితుడని మెచ్చుకున్నాడు. ఎక్కడ ఏపని ఎంత వరకు చేయాలో అంత పనిచేయగల సమర్థుడు ఆంజనేయుడు. ఆంజనేయుని చూసి మానవులు ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. పట్టుదలతో అనుకొన్న కార్యక్రమాన్ని పూర్తిచేయడంలో, కార్యాన్ని సక్రమమైన రీతిలో పూర్తి చేయడంలో కూడా ఆంజనేయుడు స్ఫూర్తి దాత. తాను కూడా సీతమ్మను అనే్వషించేటపుడు వేదనకు గురి అయనాడు. ఇక ఆత్మహత్య తప్ప అన్యమేమీ లేదనుకొన్నాడు. తను కనుక పని కాలేదని వెనక్కు వెళితే అటు వానరలోకమూ, ఇటు రామాదుల వంశమూ ఆందోళనకు గురి అవుతాయని జరగకూడని అనర్థాలు జరిగిపోతాయ కనుక తాను వెనక్కు వెళ్లే ప్రసక్తి ఉండకూడదు అనుకొన్నాడు. భగవంతునికి నమస్కరించాడు. తనకు సాయం చేయమని అర్థించాడు. తిరిగి తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు. తాను మరింత ప్రయత్నం చేస్తాను. ప్రయత్నంతో సాధించలేనిది ఏదీ లేదు కదా అనుకొని తిరిగి సీతానే్వషణ చేసాడు. ఇపుడు సీతమ్మను కనుకొన్నాడు. ఎక్కడలేని ఆనందాన్ని సొంతం చేసుకొన్నాడు. అట్లా మనం కూడా ఏదైనా కష్టం వచ్చినపుడు ఆంజనేయుని స్మరించి కష్టాన్ని యత్నంతో దూరం చేసుకోవాలి కాని చేయరాని పనులు చేయ కూడదు అని కేసరితనయుని వల్ల తెలుస్తుంది.
నేనే ఈ పనిని సాధించే నిపుణుడినని విర్రవీగకూడదు. అహంకారం అనర్థానికి హేతువు అవుతుంది. ఈ విషయాన్ని కూడా ఆంజనేయుని ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. సముద్ర లంఘనం చేసేటపుడు అందరూ వానర వీరులు తాము ఇంత ఎత్తుకు ఎగురుతామని చెబుతున్నారు. కాని ఆంజనేయుడు మాత్రం తాను వంద యోజనాల దూరం ఉన్నసముద్రాన్ని లంఘించడమే కాదు తిరిగి రాగల శక్తి సంపన్నుడైనా వూరికొండి పోయాడు. అందరూ కలసి తన్ను వెళ్లమనే దాక ఆగాడు. ఇక వెళ్లాలనుకొన్నప్పుడు తన సర్వశక్తులను ఒడ్డి సముద్ర లంఘనం చేశాడు. మరలా సీతమ్మ లఘు రూపంలో ఉన్న మారుతిని చూచి నీవు నన్ను నీవీపు మీదఎక్కించుకు వెళ్తానంటే ఎలా ? నేను సముద్రంలో పడిపోతానేమో అన్న భయాన్ని వ్యక్తం చేస్తే నాది లఘు రూపమే కాదు మిమ్మల్ను కూర్చోబెట్టుకోగలను అని తన విశ్వరూపాన్ని చూపాడు. సముద్ర లంఘనం చేయడానికి వానరులు కదా సాధ్యం కాదేమో నన్న సీతమ్మ అనుమానాన్ని నిర్వృతి చేయడానికి అక్కడ ఉన్నవారంతా తన కన్నా గొప్ప వీరులే నని, తానే అందరికన్నా తక్కువ వీరుడినని సీతమ్మతో అనడం ఆంజనేయునిలో ఉన్న వినమ్రతేకదా. అట్లా తానే చేయగలనన్న అహంకారం కాని , నేను చేయలేనేమోనన్న నిరాశ కాని మనుష్యుల్లో ఉండకూడదన్న విషయాన్ని ఆంజనేయుని ద్వారా నే మనం తెలుసుకోగలం.
ఫాల్గుణ శుద్ధ పంచమి మొదలు చైత్ర శుద్ధ పూర్ణిమ వరకు నలభై రోజులు ఈ స్వామిని స్మరించి ఆంజనేయ భక్తులు దీక్షలు స్వీకరిస్తారు. ఆంజనేయుని వల్ల సిథరమైన బుథ్ధి, అచంచలమైన నమ్మకం, సేవాతత్వం ఇలాంటి సద్గుణాలు కలుగాలని భక్తులు కోరుకుంటారు.
బుద్ధిర్బలం మనోధైర్యం.....హనుమాత్ స్మరణాన్ భవేత్
అన్నట్లు అంజనీ సూనుని భజన, స్మరణతో బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, ఆరోగ్యము, మానసిక దృఢత్వం, వాక్పటుత్వం వంటి ఫలితాలనిస్తాయి. అంతేగాకుండా అణిమాది అష్టసిద్ధులు పొందిన ఆంజనేయుడు శక్తిమంతుడు. ఈయన సత్తు అమేయం, అపూర్వం. తులసీదాసు హనుమాన్ చాలీసాలోఈ వీరుని గురించి ‘అష్టసిద్ధి నవ నిధికే దాతా, అసవర దీన జానకీ మాత’ అని స్తుతి చేశారు. అంతేకాదు మరో ఐతిహ్యం వల్ల ఆంజనేయుడు ఎంత రామభక్తుడో తెలుస్తుంది. ఒకానొక సమయంలో సీతమ్మ తిలకం దిద్దుకునే వేళ ఆంజనేయుడు అమ్మా నీవు పాపిట సింధూరం ఎందుకు పెట్టుకున్నావు అంటే రామునికిష్టం అన్నదట ఆ యమ్మ. అంతే వెంటనే వెళ్లి తన శరీరమంతా సింధూరం పూసుకుని వచ్చాడట. సీతమ్మ ఈ సంగతి చూచి ఆంజనేయా ఇలా ఎందుకు చేశావంటే మరి నేను రామునికిష్టం అని చేశాను అన్నాడట. అంతటి రామభక్తుడు ఆంజనేయుడు.
శ్రీరామ జయరామ జయజయ రామ, ఓ రామ శ్రీరామ ఓంకార రామ అని భజన చేస్తే ఆంజనేయుని అంగాంగం పులకిస్తుంది. రోమ రోమమున రాముని నామాన్ని నింపుకున్న హనుమంతుడు హృదయంలో సీతారాములను స్థిరపరుచుకున్నాడు. అట్లాంటి ఆంజనేయుని మనం మన మార్గదర్శిని చేసుకొందాం. సుమార్గంలో పయనించుదాం.

- నాగలక్ష్మి