Others

ఎన్నికల ఖర్చు తగ్గేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణం. కాగా, కాలం గడిచిన కొద్దీ ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయకపోగా మరింత దిగజార్చడం చూస్తున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ ధనప్రభావం విపరీతంగా పెరిగింది. ఎన్ని చట్టాలను తెచ్చినా ఫలితం ఉండడం లేదు. ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీలో 19వ వార్డు కౌన్సిలర్ పదవికి జరిగిన ఉపఎన్నికకు అక్షరాలా నాలుగున్నర కోట్ల రూపాయలను ఓటర్లకు పంపిణీ చేసినట్టు ఓ అంచనా. ఈ ఉపఎన్నికను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఒక్కో ఓటుకి ముట్టచెప్పింది 5 నుండి 7 వేల రూపాయలు అని ప్రచారం జరిగింది. కొన్ని పార్టీలు వెండి కుంకుమ భరిణలను, చీరలను మహిళా ఓటర్లకు అందజేశాయట!
2014 సార్వత్రిక ఎన్నికలకు జాతీయ పార్టీలు 1,159 కోట్ల రూపాయలు సేకరించినట్టు అంచనా. ఎన్నికలపై ఇంత మొత్తాన్ని ఖర్చు చేయడానికి కనిపిస్తున్న కారణాలలో కొన్ని.. ఎన్నికల ఫలితాలపై డబ్బు ప్రభావం ఉండడం, ఖర్చు చేసేది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, పూర్తిగా నల్లధనం, మనదేశంలో రాజకీయమంటే లాభదాయకమైన వ్యాపారం. ఓట్ల కోసం ఎంత ఖర్చు చేసినా, గెలిచాక అంతకు కొన్ని రెట్లు సంపాదించుకోవచ్చునని అభ్యర్థుల ధీమా, ధన ప్రభావం తగ్గించడానికి చట్టాలు ఉన్నా అవి పనిచేయక పోవడం. అభ్యర్థులు ఎన్నికల ఖర్చును చాలా తక్కువగా చూపిస్తున్నారు. పదివేల కరపత్రాలు ప్రింటు చేయిస్తే వెయ్యి ప్రింటు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో 129 మంది తమ సగటు ఎన్నికల వ్యయాన్ని కేవలం 14.62 లక్షలుగా చూపించారు. ప్రస్తుత చట్టాలు అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించినా, రాజకీయ పార్టీల వ్యయంపై ఏ నిబంధనలూ లేవు.
కాగా, ప్రభుత్వ సహాయంతో ఎన్నికలను నిర్వహించడాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు. ప్రభుత్వ సహాయం అంటే ప్రజల డబ్బునే ఖర్చు చేయడం. తాను మద్దతు ఇవ్వని పార్టీకి ఒక వ్యక్తి ఎందుకు సహాయపడాలి? రాజకీయ రంగాన్ని ఎన్నుకున్న వారే ప్రభుత్వ సహాయానికి అర్హులా? ఇతరుల సంగతేమిటి? అసలే ప్రభుత్వాలు లోటు బడ్జెట్‌లతో సతమతమవుతుంటే వాటిపై ఈ భారం కూడానా? శక్తిమంతులు ప్రభుత్వ సహాయం పొందకపోయినా ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకోగలరు. అభ్యర్థుల ఖర్చుకు ప్రభుత్వ సహాయం చేస్తే పరిస్థితి ఇంకా విషమించే ప్రమాదం ఉంది.
అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వ సహాయంతో ఎన్నికలు నిర్వహించడం సమంజసమన్న వాదనలు లేకపోలేదు. రాజకీయ పార్టీలకు నేరుగా ప్రభుత్వమే నిధులు ఇవ్వవచ్చు లేదా ప్రచార ఖర్చును ప్రభుత్వమే భరించవచ్చు. ఈ పద్ధతిని అధికారంలో ఉన్న పార్టీ దుర్వినియోగం చేసే అవకాశం వుంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వాలు సహాయం చేయడం గత ఐదు దశాబ్దాలుగా కొన్ని దేశాలలో ఉంది. ప్రభుత్వ సహాయం చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి. గుర్తింపు పొందిన పార్టీలకే సహాయం అందించాలి, కొన్ని పరిమిత ఖర్చులు కోసమే ధన సహాయం ఇవ్వాలి. అభ్యర్థులకు కొన్ని వసతులు (ఉదాహరణకు టెలిఫోన్ సౌకర్యం) ఉచితంగా సమకూర్చవచ్చు. సహాయం ధన రూపంలో కాకుండా వస్తు రూపంలో వుంటే మంచిది. ప్రభుత్వ సహాయం చేస్తున్నప్పుడు పార్టీలు ఇతరత్రా నిధులు సమకూర్చుకోకుండా చూడాలి. ఈ బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు 70 శాతం మేరకు నిధులు గుర్తుతెలియని మార్గాల ద్వారానే వస్తున్నాయి. ప్రభుత్వ సహాయంతో ఎన్నికలు జరపడంలో ఇబ్బందులున్నా పకడ్బందీగా అమలుచేస్తే ప్రయోజనాలు ఎన్నో. వ్యాపారవేత్తలపై విరాళాల కోసం ఆధారపడడం వల్లనే నల్లధనం, అవినీతి ప్రమాద స్థాయిని దాటాయి.

-ఇమ్మానేని సత్యసుందరం