AADIVAVRAM - Others

ఆనందానికి దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నించి తన కూతురు నీసాని గమనిస్తున్న తల్లి అడిగింది.
‘ఏమిటి? ఏమైంది నీకు ఇవాళ?’
‘ఏం కాలేదు’ నీసా విసుగ్గా చెప్పింది.
‘మరి నువ్వు పొద్దున్నించి దేనికి చిరాగ్గా కనిపిస్తున్నావు?’
‘నాకు చిరాకు కాదు. విసుగు. విసుగ్గా ఉంది’ నీసా చెప్పింది.
‘దేనికి?’
‘స్కూల్ ఇంకో రెండు వారాల దాకా తెరవరు. నా ఫ్రెండ్స్ చరిత, మానసి ఊరెళ్లారు. నువ్వు ఇచ్చిన చందమామలు అన్నీ చదివేశాను. ఇంకేం చేయాలో తోచడంలేదు’
‘ఓ! తోచకపోతే విసుగే మరి. దాని గురించి ఏం చేస్తావు?’
‘తెలిస్తే చేసేదాన్నిగా. తెలీకే విసుగుతో ఛస్తున్నాను’ నీసా చెప్పింది.
‘ఐతే చాలా పెద్ద చిక్కే వచ్చి పడింది నీకు’
‘అవును’
‘నాకు ఇలాంటి పరిస్థితి దాపురించినప్పుడు మా అమ్మమ్మ నాతో చెప్పిన చిట్కా చెప్పనా?’
‘త్వరగా చెప్పు’
‘విసుగు పోవడానికి, ఆనందం ఉత్సాహం తిరిగి రావడానికి దారి ఇతరులకి ఏదైనా మంచి చేయడమే’
‘అందువల్ల నా విసుగు పోతుందా?’ నీసా అడిగింది.
‘పోతుందన్నదే నా అనుభవం’
నీసా కొద్ది క్షణాలు తల్లి చెప్పింది ఆలోచించి లేచి సంచీ తీసుకుని బయటకి వెళ్తూ చెప్పింది.
‘నేను గంటలో వస్తాను’
‘ఎక్కడికి?’
‘సంధ్య ఆంటీ ఇంటికి. ఆవిడ ఇందాక నన్ను కందిపప్పు, ఉల్లిపాయలు తెచ్చిపెడతావా? ఇంట్లో పసిబిడ్డని వదిలి వెళ్లలేను అని ఫోన్ చేసి అడిగింది. చూస్తానన్నాను’
‘అందుకు గంటెందుకు పడుతుంది?’
‘పై అపార్ట్‌మెంట్‌కే కాదు. బి బ్లాక్‌లోని మానసి ఇంటికి కూడా వెళ్తాను. మానసి అక్క తను తెలుగు సినిమా పాటని ప్రాక్టీస్ చేసేప్పుడు లిరిక్స్ కాగితం దగ్గరుంచుకుని తను కరెక్ట్‌గా అన్ని పదాలు పాడుతోందో, లేదో చూడమంది. అక్కడికీ వెళ్లొస్తాను’
గంటంపావు తర్వాత తిరిగి వచ్చిన నీసా మొహంలో నవ్వుని చూసిన నీసా తల్లి తన అమ్మమ్మ చెప్పిన చిట్కా మరోసారి పని చేసిందని గ్రహించింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి