Others

ప్లాస్టిక్ వ్యర్థాలతో బరువెక్కిన భూగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూగోళంపై ఇప్పటిదాకా ఉత్పత్తి చేయబడిన ప్లాస్టిక్ ఎంతుంటుందో తెలుసా? వందకోట్ల ఏనుగుల బరువంత! లేదా న్యూయార్క్ నగరంలోని 25 వేల ఎంపైర్ స్టేట్ భవనాల బరువంత! 2015 సంవత్సరం నాటికి 8.3 బిలియన్ మెట్రక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయ్యిందనీ, ఇందులో 6.3 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాల కోవలోకి వెళ్లిపోయిందనీ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ గోర్జియా పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనం వెల్లడి చేస్తోంది. ‘అసలిది భూగోళమా? ప్లాస్టిక్ గోళమా?’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1950 నుంచి ఇప్పటివరకు 8.3 బిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి చేయబడింది. అందులో చాలాభాగం భూతలంపై వ్యర్థ పదార్థాలుగా డంప్ చేయబడింది. ‘సైన్స్ జర్నల్’ (2015)లో కొందరు శాస్తవ్రేత్తలు తెలిపిన అధ్యయనం వివరాలు ఆందోళనకలిగించేలా ఉన్నాయి. 2010 నాటికి 8 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సాగర జలాలలో డంప్ చేయబడ్డాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.
ఇప్పటిదాకా వ్యర్థ పదార్థాలుగా మారిన ప్లాస్టిక్‌లో ‘రీ సైకిల్’ చేయబడింది కేవలం 9 శాతమే. 12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చి బూడిద చేయబడ్డాయి. మిగతా 79 శాతం వ్యర్థాలను భూమిలో పాతిపెట్టడమో, ఆరుబయట పరిసరాలలో డంప్ చేయడమో చేస్తున్నారు. ప్రపంచంలో ప్లాస్టిక్ ఉత్పత్తులను ఇలాగే పారబోస్తే 2050 నాటికి భూగోళంపై 12 బిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయి.
‘ఇప్పటిదాకా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్‌లో అధిక భాగం బయోడిగ్రేడబుల్ (అంటే సహజంగా భూమిలో కలిసిపోయేది) కాదు. అందువల్ల భూమిలో పాతిపెట్టబడిన లేదా భూమిపై డంప్ చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలతో వందల, వేల సంవత్సరాలపాటు సహజీవనం చేయాల్సి వుంటుంది’ అని జెన్నా జంబెక్ అంటారు. ఈమె యూనివర్సిటీ ఆఫ్ గోర్జియా (ఏథెన్స్) ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్. ‘ప్రస్తుత పారిశ్రామిక యుగంలో మనం వినియోగించే వస్తువుల గురించీ, వాటి వ్యర్థాల నిర్వహణ పద్ధతుల (వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్) గురించీ సరిగా అంచనా వేయలేకపోయాం’ అని జెన్నా జంబెక్ అంటారు. ‘సైన్స్ అడ్వానె్సస్’ జర్నల్‌లో శాస్తవ్రేత్తలు అందించిన గణాంకాలను బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 1950 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తులు 2 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంటే 2015 నాటికి 500 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులలో అధిక శాతం మన దైనందిన జీవితాలలో కొద్దికాలం ఉపయోగించి పారవేసేవే ఉంటున్నాయి. రకరకాల వస్తువులను వివిధ ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు వాటిని ప్యాక్ చెయ్యడానికి ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. ప్రతిరోజూ వందల్లో వినిమయమై, వ్యర్థాలుగా రోడ్ల పక్కన కుప్పలుగా పేరుకుంటున్న క్యారీ బ్యాగుల సంగతి మనకు తెలిసిందే! వీటిని ఒకసారి వాడి పారేస్తాంగా.
‘పారిశ్రామిక ఉత్పత్తులలో స్టీల్, ప్లాస్టిక్‌లకు చెందినవి ఎక్కువగా వినిమయమవుతన్నాయి. స్టీల్ వస్తువులను దశాబ్దాల తరబడి ఉపయోగించుకోవచ్చు. అదే ప్లాస్టిక్ వస్తువుల వినిమయ కాలం చాలా తక్కువ. ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ వస్తువులలో సగం కొద్దికాలంలోనే వ్యర్థాలుగా మారిపోతున్నాయి’ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన రోనాల్డ్ గేయర్ అంటున్నారు. పారిశ్రామికంగా ప్లాస్టిక్ ఉత్పత్తుల వృద్ధి రేటు నానాటికీ పెరుగుతోంది. ఇది తగ్గే సూచనలు ఏ కోశానా లేవు. 1950 నుండి 2015 వరకు జరిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులలో సగం శాతం గత 13 సంవత్సరాలలో జరిగినవే.
‘ఎప్పుడైనా సరే లెక్కకు మించిన ఉత్పత్పులు, వాటి వ్యర్థాల నిర్వహణ దాదాపు అసాధ్యంగానే వుంటుంది. కాబట్టి ప్లాస్టిక్ ఉత్పత్తుల నియంత్రణ విషయంపై మనం దృష్టిపెట్టాలి. ఇందుకు అవసరమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి. భావితరాల జీవనానికి హాని కలిగించని ఉత్పత్తులపైనే పరిశ్రమలు దృష్టిపెట్టాలి’ అని రోనాల్డ్ గేయర్ అంటారు.
ఇక ప్లాస్టిక్ వ్యర్థాల రీ సైక్లింగ్ గణాంకాలు చాలా నిరాశాజనకంగానే వున్నాయి. 2014 నాటికి ఐరోపాలో 30 శాతం, చైనాలో 25 శాతం, అమెరికాలో 9 శాతం మాత్రమే ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చెయ్యబడ్డాయి. ‘నేడు ప్లాస్టిక్ ఎంతగా పెరిగిపోయిందంటే ఎక్కడికి వెళ్లినా సరే ప్లాస్టిక్ వ్యర్థాలు లేని పరిసరాలే మనకు కనబడవు. సముద్రాల పరిస్థితి కూడా ఇంతే’ అని జెన్నా జంబెక్ అంటారు. మన జీవితాల నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని మొత్తంగా తొలగించలేకపోవచ్చు. కానీ అవసరాలకు మించి మనం చేస్తున్న ప్లాస్టిక్ వస్తు వినియోగం, వాటి వ్యర్థాల విషయమై ఒకసారి మనమంతా పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ పరిశోధకులు అంటున్నారు.

-దుగ్గిరాల రాజకిశోర్