Others

‘క్విట్ టెంపుల్స్’ పోరుకు తరుణమిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ దుష్టపాలన అంతం కావాలని స్వాతంత్రోద్యమ కాలంలో ‘క్విట్ ఇండియా’ నినాదం ఎంతగా అవసరపడిందో- నేడు హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగిపోయేందుకు ‘క్విట్ టెంపుల్స్’ ఉద్యమం ఆరంభం కావలసి ఉంది. హిందూ దేవాలయాల పాలన, అజమాయిషీలను నేడు ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఆలయాల వనరులను తన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తూ హైం దవేతర మతస్థులకు ప్రజాధనంతో తాయిలాలిస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసే సమయం ఆసన్నమైంది. దేవాలయాల యాజమాన్యం నుండి ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ‘క్విట్ టెంపుల్స్’ అంటూ హిందువులంతా ఉద్యమించాలి. తమపై రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న వివక్షను, దోపిడీలను హిందువులు గమనించాలి.
క్రైస్తవుల చర్చ్‌లు గానీ, ముస్లింల మసీదులు గానీ ప్రభుత్వ యాజమాన్యంలో లేవు. కేవలం హిందువుల దేవాలయాలు, అందులోనూ మంచి ఆదాయం ఉన్నవాటినే ప్రభుత్వం చేజిక్కించుకుంటోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో, తిరుమల తిరుపతి పాలనా వ్యవస్థలో తమ మత మార్పిడిని కప్పిపుచ్చి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందినవారు 25 శాతం దాకా ఉంటూ హిందూ ఆలయాల ఆస్తులను, సంపదను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవులు చర్చ్‌లను నిర్మించుకోవటానికి 5 లక్షల రూపాయలు (3 లక్షల నుంచి ఇటీవలే పెంచింది), జెరుసలెం తీర్థయాత్రకు ఒక్కొక్కరికి 40 వేలు (ఇటీవలనే 25 వేలకు పెంచారు) ఇస్తోంది. ముస్లింల హజ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది 1,500 కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇచ్చింది. ఏపి ప్రభుత్వం హజ్ హౌస్‌లు, ఉర్దూ ఘర్‌లు, షాదీఖానాలు, మసీదులు కట్టడానికి, ఉర్దూ విశ్వవిద్యాలయం స్థాపనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తోంది. మసీదుల్లో ప్రార్ధనలను జరిపించే ఇమాంలకు నెలకు 5వేలు, ప్రార్ధనకు రమ్మని అరిచే ముఅజ్జినులకు మూడు వేలు ఇస్తోంది. ఈ రెండు మతస్తులకు ఇచ్చే సొమ్మంతా హిందువులు చెల్లించే పన్నుల నుంచే అత్యధిక శాతం కేటాయిస్తున్నారు.
గత 13 ఏళ్లుగా ఉద్ధృతమవుతున్న మత మార్పిడులను ఎదుర్కోవడానికి కొన్ని హిందూ ధర్మ రక్షణ సమాజాలు ఉద్భవిస్తున్నాయి. మేధావులతో కూడిన భారతీయ ధర్మ రక్షణ సమాఖ్య, ధర్మాచార్య సభలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో, తిరుమల తిరుపతి దేవస్థాన అధిపతులతో సంప్రదింపులు జరిపి కొన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. వాటిలో ప్రముఖ ఆలయాల్లో ‘దివ్య దర్శనం’ ఒకటి. ప్రతి సంవత్సరం ఏపిలో లక్షమంది దళిత హిందువులకు, బీదవారికి ఆరు ప్రఖ్యాత దేవాలయాల దర్శనాన్ని జరిపించాలని ఈ కార్యక్రమం చేపట్టారు. కానీ దీనికయ్యే ఖర్చును దేవాలయాల ఆదాయం నుండే భరించాలన్నారు. ఇందుకు భిన్నంగా పన్నుల ద్వారా సేకరించిన ప్రభుత్వపు సొమ్మును క్రైస్తవ, ముస్లింల ప్రయోజనాలకు వినియోగించడమా? హిందూ భక్తులు దేవుళ్లకిచ్చిన సొమ్ముతోనే దివ్యదర్శన ఖర్చులా? ఇదో వివక్ష. దివ్యదర్శనం పథకానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం దేవాదాయ, తితిదే శాఖలకు రీ ఇయింబర్స్ చేయాలి. ఆలయాలకు ధర్మకర్తల నియామకంపై ప్రభుత్వ పెత్తనం నశించాలి. అధికారంలో ఉండే పార్టీవారు తమ విధేయులను, పార్టీకి నిధులిచ్చే వారిని, ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఆలయ ధర్మకర్తలుగా నియమిస్తున్నారు. ఇలా నియమితులైన వారు స్వప్రయోజనాలకు పదవులను ఉపయోగించుకుంటున్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణ, ధర్మ ప్రచారం, మత మార్పిడులను ఎదుర్కొనే కార్యాచరణ, ఆలయ ప్రాంగణాల్లో విద్య, వైద్య సేవలందించడం, భజనలు, ప్రవచనాల ద్వారా, సంబరాల ద్వారా జాగరూక హిందూ సమాజ నిర్మాణం, దళిత జన సౌభ్రాతృత్వం పెంచడం వంటి కార్యక్రమాలు అమలు జరపడం లేదు. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే కోటీశ్వరులూ, వ్యాపారులూ ధర్మకర్తలవడం లజ్జాకరం. హిందువుల పట్ల వివక్ష, అన్యమత ప్రచారం, నిధుల దుర్వినియోగం వంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడాలంటే- ప్రభుత్వం దేవాలయాల యాజమాన్యం నుండి వైదొలగాలి. ఇందుకు తక్షణం ‘క్విట్ టెంపుల్స్’ ఉద్యమం ప్రారంభం కావాలి.

-త్రిపురనేని హనుమాన్ చౌదరి