Others

తెగేదాకా తెలుగుని లాక్కండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువాళ్లు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న సమయమది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ భోగరాజు పట్ట్భా సీతారామయ్య వంటి ప్రముఖులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు- ‘పట్ట్భా.. మీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుందయ్యా? అంతా మద్రాసీలే కదా?’ అన్నారట సర్దార్ పటేల్. వెంటనే పట్ట్భా తన జేబులోంచి అణాకాసు తీసి, దీనిమీద జాతీయ భాష హిందీ, అధికార భాష ఆంగ్లంతో పాటు, దేశంలో అధిక సంఖ్యాకులు మాట్లాడే బెంగాలీ, తెలుగు భాషల్లో ‘ఒక అణా’ అంటూ ఉండడాన్ని చూపించారట. ఆంగ్లేయులు ముద్రించిన ఈ నాణెం మీద మీ గుజరాతీ భాష లేదే!- అన్నారట. పట్ట్భా మాటలకు గాంధీజీ సహా ఎవరూ ఏమీ అనలేకపోయారట. పట్ట్భా వాదన ప్రకారం స్వాతంత్య్రానికి ముందే బ్రిటిష్ పాలకులు తెలుగు భాష ప్రాముఖ్యతను, ప్రత్యేకతను గుర్తించారని భావించాలి.
కాగా, తెలుగువాళ్లు ఇటీవల తెగని యుద్ధం చేసి తమ భాషకు ‘ప్రాచీన హోదా’ సాధించారు. అయినా ఏం లాభం? తెలుగుభాషను అతలాకుతలం చేస్తూ కొత్త పవనాలు హఠాత్తుగా వీస్తున్నాయి. అదీ తెలుగు ప్రభుత్వం నుంచే. ‘తెలుగులో చదివితే మీ భవిష్యత్ శూన్యం’ అని ఓ మంత్రిగారు సభాముఖంగా అన్నారట. ఆ మంత్రికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంగ్ల మాధ్యమ విద్యాసంస్థలు లెక్కకుమించి ఉన్నాయి. విద్యాశాఖ ద్వారా కాకుండా పురపాలక శాఖ ద్వారా గత అక్టోబర్‌లో- ‘తల్లిదండ్రుల కోరిక మేరకు మున్సిపల్ బడుల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామ’ని ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఏపి సిఎం నోరు విప్పలేదు గానీ, ఆ అమాత్యుడు మాత్రం తెలుగు భాషాభిమానులపై బాణాలు ఎక్కుపెట్టడం మొదలైంది. అంగన్‌వాడీ టీచర్లకూ ఆంగ్ల మాధ్యమంలో శిక్షణ ఇస్తామని, తమ ప్రభుత్వ విధానాలను దేశంలోని మిగతా రాష్ట్రాల వారూ అనుసరిస్తారని, ఎస్టీ గురుకులాల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, పురపాలక మంత్రిని అభినందించారు. మరోవైపు తెలుగును హిందీ టీచర్లు బోధించాలా? అంటూ హిందీ పండిట్ల సంఘం నిరసించింది. అంగన్‌వాడీల్లో ఆంగ్లం బోధించేందుకు తన విద్యాసంస్థ టీచర్లు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఎస్టీ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వం సిద్ధమవుతోందనే వార్తలు వినిపించాయి. విద్యాబోధనలో తెలుగు మాధ్యమానికి తిలోదకాలివ్వడమంటే భాషను నీరసపరచడమేనని సామాన్య జనం నుంచి, కవులు, కళాకారుల నుంచి నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. తెలుగు పరిరక్షణకు ఏపి, తెలంగాణ సిఎంలు నడుం బిగించాలని ఇటీవల ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు సందేశాన్ని ఇచ్చారు. క్రీ.పూ 400 నాటికే ఉన్న తెలుగుభాషను- ఇంటర్నేషనల్ అల్ఫాబెట్ అసోసియేషన్ 2012లో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ లిపిగా గుర్తించింది. కొరియన్ లిపిని అత్యుత్తమ లిపిగా ప్రకటించింది. మాతృభాషలోనే సృజనాత్మకత ఉందంటూ ‘ఇస్రో’ చైర్మన్ కిరణ్‌కుమార్ అన్నమాటలు తెలుగువారికి స్ఫూర్తిదాయకం. అయినా ఎవరిదారి వాళ్లదే అన్నట్టు సాగుతోంది వ్యవహారం.
మున్సిపల్ బడుల్లో ప్రతిరోజూ తరగతులు ప్రారంభానికి ముందో గంట, పాఠశాల ముగిశాక మరో గంట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక శిక్షణ పొందినవారికి ‘కెరీర్ ఫౌండేషన్ కోర్సు’ నిర్వహించి, పరీక్షలు పెట్టి ‘అడ్వాన్స్‌డ్ ఫౌండేషన్ కోర్సు’లో చేర్పిస్తున్నారు. అక్కడ మంచి మార్కులు వచ్చిన వారికి పోటీ పరీక్షలు రాసేందుకు తర్ఫీదు ఇస్తారట! ఈ దారెటో అందరికీ అర్థమైంది. ప్రభుత్వ బడులను క్రమంగా నీరసింపజేసి, బోధనరంగాన్ని ప్రవేటు సంస్థలకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్ర ఇది అని ఉపాధ్యాయ సంఘాల వారు ఆందోళనలు చేశారు. ఇక జనం నాడి ఎలా ఉందంటే- ‘పక్కింటి కుర్రాడు అమెరికా వెళితే.. ఇక మావాడు ఎప్పుడెళ్తాడు?’ అన్న ఆందోళన మొదలై ఆంగ్లం పట్ల ఆసక్తి చూపుతున్నారు. అంతేగాని- పొరుగు రాష్ట్రాల్లో వారి మాతృభాషల్ని ఎంతగా గౌరవిస్తున్నారు..? మన భాష సంగతేమిటి? అన్న ఆలోచనే లేదు.
తమిళనాడు, కేరళ, కర్నాటకల్లో జనం ప్రాంతీయ పార్టీలకే పెద్దపీట వేస్తున్నారు. అందుకే నేతలు ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలని పరితపిస్తున్నారు. మన దగ్గర రాజకీయ పార్టీలు భాషను శాసిస్తున్నాయి. అదే మనం బాధ పడాల్సిన విషయం. ఈ బాధను ప్రజలు, నేతలు అర్థం చేసుకుని ముందుకు వెళ్లకపోతే భవిష్యత్‌లో జటిల సమస్యలు అనివార్యం. ఆంగ్ల మాధ్యమాన్ని పూర్తిగా ఎవరూ నిరసించడం లేదు. కాకుంటే తమ భాషను చిన్నచూపు చూడడాన్ని తెలుగువాడు భరించలేకపోతున్నాడు. ప్రాథమిక స్థాయి వరకూ మాతృభాషలో బోధన జరిగితే అంతకుముందు మాట్లాడడం నేర్చుకున్న భాషలో రాయడం, చదవటం నేర్చుకుంటారు. ఒక భాష అలవడ్డాక ఆ అనుభవంతో ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఇది పెద్దలు సైతం గుర్తించాల్సిన అంశం. తెలుగు రాష్ట్రాలు దాటి, ఈ దేశం దాటి జీవించేవాళ్లు ఎంతమంది? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నివసించేవాళ్లు ఎంతమంది? ఇక్కడి వాళ్లకు తెలుగు వద్దా? తెలుగుదేశాన్ని ఆంగ్ల దేశంగా మార్చేసి, అన్ని వయసుల వారూ తెలుగుదనాన్ని పక్కనపెట్టి- భాషపరంగా ఆంగ్ల బానిసత్వాన్ని స్వీకరించాలా?

- డా. వేదగిరి రాంబాబు సెల్: 93913 43916