Others

లింగవివక్షకు స్వస్తి ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తి పురుషుల నిష్పత్తిని భారతదేశంలో పరిశీలిస్తే గతంలోకంటే కాస్త మెరుగైనదిగా చెప్పవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో స్ర్తిల సంఖ్య అధికంగా ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో స్వల్పంగా ఉందని చెప్పవచ్చు. కాలక్రమంలో తల్లిదండ్రుల దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ముఖ్యంగా చదువుకున్నవారిలో ఈ మార్పు కనిపిస్తోంది. ఆడపిల్ల పుట్టినా ఫర్వాలేదనే దృక్పథానికి వచ్చారు. మగపిల్లవాడి కోసం ఎదురు చూసే భావన చాలా వరకూ తగ్గింది. తద్వారా ఆడపిల్లల సంఖ్య ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా పెరుగుతోందని పరిగణించవచ్చు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా మగశిశువు కోసం ఎదురుచూడని తల్లిదండ్రులు వున్నారు. ఎక్కడో నిరక్షరాస్యత, అజ్ఞానంతో వున్నవారు మగపిల్లవాడి కోసం ఇంకా పాకులాడుతున్నారు. మగపిల్లవాడు పుట్టలేదని ఇల్లాలిని తరిమివేస్తున్న ఉదంతాలు అక్కడక్కడా లేకపోలేదు.
ఆడపిల్లలు దొరకని కులాలలో ఎలాంటి తారతమ్యం లేకుండా ఆదర్శ వివాహాలు చేసుకోవడం ఇటీవలి కాలంలో వచ్చిన మంచి పరిణామం. కొన్ని కులాల్లో మాత్రం లింగవివక్ష కారణంగా ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏ కులమైతేనేం? ఏ మతమైతేనేం? అనే ఉద్దేశంతో కులాంతర, మతాంతర విహాహాలకు ఇపుడు చాలామంది సుముఖత చూపుతున్నారు. తద్వారా కులవివక్షను రూపుమాపే దిశగా సమాజంలో కొంత మార్పు వస్తున్నది. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులు అభ్యసించినవారు, ఇతర దేశాల్లో స్థిరపడినవారిలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చదువుకున్న కుటుంబాలకు చెందినవారు కులాల అంతరాలు లేకుండా వివాహాలు చేసుకుంటున్నారు. ఇది ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ఎక్కువ మంది ఆడపిల్లలను కనేవారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందని తెలిశాక కొందరు భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ ఈ నేరాలకు కొందరు పాల్పడుతున్నారు.
లింగవివక్ష లేని సమాజంలోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మరోవైపు స్ర్తిల పట్ల గౌరవ మర్యాదలు లేని కారణంగా వారిపై లైంగిక నేరాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా, చట్టాలు మారినా స్ర్తిలపై లైంగిక దాడులు, అత్యాచారాలు తగ్గడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే కేవలం చట్టాల వల్ల సాధ్యం కాదు. సమాజంలో నైతిక విలువలు పెరిగితే తప్ప ఎలాంటి మార్పులు ఆశించలేం. మహిళలకు ఇంటాబయట భద్రత కరవైన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. స్ర్తిలు విద్యావంతులై పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడుతుండడం, కష్టతరమైన ఉద్యోగాల్లో సైతం సేవలందించడం కొంత ఊరట కలిగిస్తుంది.
సమాజంలో సమూల మార్పు రావాలంటే స్ర్తివిద్య అత్యంత అవసరం అని చెప్పక తప్పదు. ఆడపిల్లలను చదివించే విషయంలో గతంలో కంటే ఇపుడు తల్లిదండ్రుల దృక్పథంలో మార్పువచ్చింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అబ్బాయిలతో సమానంగా ఆడపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపుతున్నారు. ప్రభుత్వం కూడా విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో ఆశాజనకమైన మార్పులు చూస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఆకాంక్ష ఆడపిల్లల్లో, తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నపుడే- మహిళలు స్వతంత్రంగా తమ కాళ్లపై నిలబడే విధంగా స్వేచ్ఛతో, వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతారు. ఆడపిల్లల విషయంలో ఇప్పటికి సాధించింది కొంతే. సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అంగీకరించక తప్పదు.

- అయినం రఘురామారావు