మీకు తెలుసా ?

బాలవాక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడు. వృత్తిని దైవంగా భావించే వ్యక్తి. విద్యార్థులే అతడి లోకం. ఎప్పుడో సెలవులకు తప్ప అస్తమాను సొంత ఊరికి వెళ్లడు. గది అద్దెకు తీసుకుని ఒంటరిగా అక్కడే నివాసముంటున్నాడు. ఎనిమిదవ తరగతి చదువుతూన్న సిద్దూ అతని ప్రియ శిష్యుడు. పేదరికం వల్ల తల్లిదండ్రులు వాణ్ణి బడి మాన్పించేసి పనిలో పెట్టాలనుకున్నప్పుడు తనే అడ్డుపడి వాడికి కావలసినవి కొనిస్తూ దగ్గరుండి చదివిస్తున్నాడు. సిద్దూ కూడా మాస్టారికి తోడుగా ఉంటూ అతడికి ఎప్పుడు ఏం కావాలన్నా తెచ్చిపెడుతూ ఎంతో సహాయకారిగా ఉంటున్నాడు. సత్యానికి ఎప్పుడూ బడి ధ్యాసే. వారాంతపు సెలవుల్లో సైతం చదువులో వెనుకబడిన విద్యార్థులకు స్కూల్లోనే పాఠాలు బోధిస్తుంటాడు. అందుకే అతడంటే అందరికీ గౌరవం.
ఇలా ఉండగా బడికి దసరా సెలవులిచ్చారు.
సత్యం బ్యాగు సర్దుకుని ఊరికి వెళ్లాలనుకుంటూ ఉండగా ‘మాస్టారూ! ఆ బ్యాగు ఇలా ఇవ్వండి నేను పట్టుకుంటాను’ అన్నాడు సిద్దు పరుగెత్తుకుంటూ వచ్చి.
‘అక్కర్లేదురా. నువ్వు ఎత్తలేవు. కాంప్లెక్స్ దగ్గర్లోనే ఉంది కదా. నేను వెళ్తానే్ల. నువ్వు ఇంటికి పోయి చెప్పిన పాఠాలు చదువుకో’ అన్నాడు సత్యం.
ఆ మాటకు ‘పరవాలేదండి’ అంటూ మాస్టారి చేతిలోంచి బ్యాగు అందుకుని భుజానికి తగిలించుకున్నాడు సిద్దు.
మరేమనలేక మిన్నకుండిపోయాడు సత్యం.
ఇరువురూ మెల్లగా నడుచుకుంటూ కాంప్లెక్స్ చేరుకునేసరికి వెళ్లవలసిన బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.
అది ఎక్కడ తప్పిపోతుందోనని ఆదరా బాదరాగా బస్సెక్కి చివరి సీట్లో కూర్చున్నాడు సత్యం.
సిద్దూ కూడా గభాలున బస్సెక్కి మధ్యలో ఉన్న ఖాళీ సీటు చూసి ‘ఇక్కడ కూర్చోండి మాస్టారూ బావుంటుంది’ అన్నాడు.
‘ఎక్కడైతే ఏంరా. ఇక్కడ కూర్చుంటే స్టేజి రాగానే తొందరగా దిగిపోవచ్చు’ సున్నితంగా వాడి అభ్యర్థనను త్రోసిపుచ్చాడు సత్యం మాస్టారు.
‘అది కాదు సార్. బస్సు మధ్యలో కూర్చుంటే కుదుపు ఉండదు. హాయిగా ప్రయాణం చేయవచ్చు రండి’ అంటూ మాస్టారి చేయి పుచ్చుకున్నాడు సిద్దు.
చేసేదేం లేక ‘సరే పద’ అని చెప్పి శిష్యుడు చూపించిన సీట్లో అయిష్టంగా చతికిలపడ్డాడు సత్యం.
బస్సు కదిలే వేళకి ‘వస్తాను మాస్టారూ! హ్యాపీ జర్నీ’ అని చెప్పి వెళ్లిపోయాడు సిద్దు.
వాడు వెళ్లిపోగానే తిరిగి వెనక సీట్లోకి పోదామనుకున్నాడు సత్యం. అయితే అప్పటికే ఆ సీటు మరో వ్యక్తి ఆక్రమించడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు.
బస్సు బయలుదేరింది. కాస్సేపటికి వేగం పుంజుకుంది. ప్రయాణీకులు సీట్లలో జోగుతూ రెప్పలు వాలుస్తున్నారు.
ఉన్నట్టుండి దభీమన్న భీకర శబ్దం.
డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.
వెనక నుంచి లోడ్‌తో వస్తున్న భారీ లారీ బస్సును ఢీకొట్టడంతో బండి వెనుక భాగం నుజ్జునుజ్జయ్యింది. చివరి సీట్లో కూర్చున్న ప్రయాణీకులకు కాళ్లు, చేతులు విరిగాయి.
ఆ దృశ్యాన్ని చూసిన సత్యం మాస్టారు భయంతో బిర్రబిగుసుకు పోయాడు. సిద్దూ మాట కాదనలేక తను బస్సు మధ్యలో కూర్చోవడం ఎంతో మంచిదైంది. లేకపోతే వాళ్లతోపాటు తనకీ దెబ్బలు తగిలేవి. అందుకేనేమో ‘బాలవాక్కు బ్రహ్మ వాక్కు’ అంటారు. ఏది ఏమైతేనేం సిద్దూ వల్ల తనివాళ బతికి బట్టకట్టగలిగానని అనుకుని మనసులోనే వాడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

దూరి వెంకటరావు