Others

ద్రోహి (అపురూప చిత్రాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనిక మరియు పేద వర్గాలమధ్య రేగే సంఘర్షణను కథా వస్తువుగా తీసుకొని స్వతంత్రా వారు తమ తొలిచిత్రంగా ‘ద్రోహి’ని నిర్మించారు. 1948, డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రంలోని ముఖ్యపాత్రధారి, నిర్మాత నేటి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి తండ్రి కె.ఎస్.ప్రకాశరావు.
అప్పట్లో సినిమా ఆరంభించాలన్నా, కంపెనీని స్థాపించాలన్నా లైసెన్సు అవసరం. ఆ లైసెన్సులు కూడా ప్రభుత్వం ఎవరికి కావాలంటే వాళ్లకి ఇచ్చేది కాదు. అంతకుముందు సినిమాలు తీసిన సంస్థలకే కొత్త సినిమా ఆరంభించుకోవడానికి లైసెన్సు ఇచ్చేది. కె.ఎస్.ప్రకాశరావు 1946లో ‘గృహప్రవేశం’ చిత్రం ఆరంభించాలనుకొని అంతకుముందు లైసెన్సుగల సారథి కంపెనీ పేరుమీద వారు ఆ చిత్రాన్ని తీసుకొన్నారు. ఆ సినిమా బాగా నడిచింది. నిర్మాణం, పంపిణీ రెండూ ఒకరి చేతిలో వుంటే ఆర్థికంగా కూడా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో కె.ఎస్.ప్రకాశరావు, భాస్కరరావు ఇద్దరూ కలిసి స్వతంత్రతా ఫిల్మ్స్ ఆరంభించారు.
కె.ఎస్.ప్రకాశరావుగారు ‘ద్రోహి’ చిత్రం తలపెట్టినపుడు మిత్రులు, డిస్ట్రిబ్యూటర్లు అంతగా ప్రోత్సహించలేదు. అప్పుడు అన్నీ జానపదాలు, సాంఘికాలయితే కుటుంబ గాథలు వస్తున్నాయనీ ప్రజాభిరుచి వాటిమీదే వుందనీ, ఇలాంటి కథ గల చిత్రం అయితే రిస్క్ ఉండవచ్చునేమో అని నిరుత్సాహపరిచారు. కాని ఏదో ఒక నవ్యత, అభ్యుదయ భావం చూపి ధోరణిని మార్చడానికి ప్రయత్నించవచ్చునని, కథ జనాకర్షణమైనదేనని నచ్చచెప్పడం ఆయనకు కొంత కష్టమైంది.
ప్రకాశరావు కథ తయారుచేసుకొని, తాపీ ధర్మారావుతో మొత్తం సంభాషణలు వ్రాయించడం పూర్తిచేశారు. నార్ల వెంకటేశ్వరరావు, చక్రపాణి, కొడవటిగంటి కుటుంబరావుల అభిప్రాయం మేరకు, స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. గృహప్రవేశంలో పరిచయమైన ఎల్.వి.ప్రసాద్ బొంబాయిలో వుంటే వారిని పిలిపించి ‘ద్రోహి’ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఎల్.వి.ప్రసాద్ ఒక ముఖ్యపాత్ర కూడా ధరించారు. అప్పటికే రాళ్ళబండి కుటుంబరావు, కోన ప్రభాకరరావు చిత్రాలలో నటించి ఉన్నారు. ముఖ్యమైన విలన్ పాత్రను ఎవరికివ్వాలో అని ఆలోచించి రాళ్ళబండి చేత వేయించారు. ఆ పాత్రను ఆయన అద్భుతంగా పోషించారు. అలాగే తక్కిన పాత్రధారులంతా కూడా చాలా బాగా నటించారు. డైరెక్టర్‌గా ఎల్.వి.ప్రసాద్ ఏ నటుడి సామర్థ్యాన్ని వదలిపెట్టలేదు. ఇంకొక విషయం ఏమిటంటే నిర్మాత, దర్శకులు ఇద్దరూ ఈ చిత్రంలో రెండు ముఖ్యపాత్రలు ధరించడం.
సంగీత దర్శకుడిగా పెండ్యాల నాగేశ్వరరావుకి ద్రోహి తొలి చిత్రం. నిజానికి గృహప్రవేశం చిత్రానికి పెండ్యాలనే సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఆయన అంతకుముందు నుంచే మద్రాసులో ఉంటూ ఆర్కెస్ట్రాలో హార్మోనియం వాయిస్తూ కొందరు సంగీత దర్శకులకి సహాయపడుతూ వచ్చారు. గృహప్రవేశం చిత్రానికి ప్రకాశరావు ఆయన్ని అనుకున్నా, అప్పటికే గోపీచంద్, రజనీకాంతరావుకి మాట ఇచ్చెయ్యడంతో కుదరలేదు. అందువలన ఆయన ఆ చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఆ సినిమా తరువాత పెండ్యాల మరలా నాటకాలకు వెళ్లిపోతే, నిర్మాత ప్రకాశరావు పెండ్యాల నాగేశ్వరరావవుని ద్రోహి చిత్రానికి సంగీతం సమకూర్చడానికి పిలిపించారు. ఈ చిత్రంలో ఆయన ఎంత చక్కని సంగీతం అందించారో ఆనాటి అభిమానులకు తెలుసు. పెండ్యాల మంచి నటులు కూడా. ద్రోహి చిత్రంలో గూడెం వాళ్ళలో ఒక పాత్ర ధరించి చక్కగా చేశారు. అంతకుముందు గృహప్రవేశంలో కూడా నటించారు. అక్కడినుంచి ప్రకాశరావు గారి చిత్రాలు మొదటిరాత్రి, దీక్ష, కన్నతల్లి వగైరా చిత్రాలకు పెండ్యాల సంగీత దర్శకులు. ఐదారు సినిమాలలో పాత్రధారణ కూడా చేయడం జరిగింది. మొత్తానికి సినిమా పూర్తయింది. విడుదల కావడం, మంచి పేరు మరియు ప్రజాదరణ రెండూ ద్రోహి చిత్రానికిరావడం జరిగింది.
కథా సంగ్రహం
గంగాధర రావు ప్రజల సొమ్ము అపహరించి గొప్పవాడయ్యాడు. దానికితోడు అతనికి పదవులపైన వ్యామోహం. రాజారావు గంగాధరానికి (రాళ్ళబండి కుటుంబరావు) కుడిభుజం. సరోజ (జి.వరలక్ష్మి) గంగాధరం కూతురు. పాకలో నివసించే సీత (లక్ష్మీరాజ్యం) తన తాతని వెంటబెట్టుకొని వీధుల్లో అడుక్కుంటూ ఉండగా, సరోజ నడుపుతున్న కారు క్రింద సీత తాత పడి గాయపడతాడు. సరోజ నిర్లక్ష్యంగా తన దారిన తాను పోతుంది. దయార్ద్ర హృదయుడైన డా.ప్రకాష్ (కె.ఎస్.ప్రకాశరావు) ఆ ముసలివాణ్ణి బ్రతికించ ప్రయత్నిస్తాడు కాని లాభం లేకపోతుంది. దిక్కులేని సీతకు డాక్టర్ తన ఇంటిలో ఆశ్రయం కల్పిస్తాడు. సరోజ, రాజా (కోన ప్రభాకరరావు) మంచి స్నేహితులు. అయినా సరోజ డాక్టరుగారిని వివాహమాడుతుంది. వైద్యవృత్తిలో డాక్టర్‌కి తీరిక లేక విలాసవతియైన సరోజతో విలాసాలు సాగించలేకపోతాడు. డాక్టరుతో ఎక్కువ చనువుగా ఉన్న సీత, తన కారు క్రిందపడిన ముసలివాని మనుమరాలన్న విషయం సరోజకు తెలుస్తుంది. రాజా సలహాతో సరోజ సీతపై దొంగతనం మోపుతుంది. గంగాధరరావు సీతని దండిస్తాడు. డాక్టర్ కూడా సీత దొంగ అని నమ్ముతాడు.
గూడెంలో అంటువ్యాధి ప్రబలుతుంది. వారికి సీత పరిచర్యలు చేసి తను కూడా మంచాన పడుతుంది. మరణావస్థలో వున్న సీతకి వైద్యం చేయడానికి డాక్టరు వస్తాడు. డాక్టరు ఎక్కువకాలం గూడెంలో గడుపుతుంటాడు. డాక్టరు తనకు దూరంగా ఉండడం సహించలేక, ఆ విషయం తన తండ్రితో సరోజ చెపుతుంది. కాని గంగాధరరావు పట్టించుకోడు. రాజా సరోజను తన వైపు త్రిప్పుకోవాలని డాక్టరుమీద లేని పోని మాటలు చెప్పి సరోజను తన వెంట తీసుకెళ్లి బలాత్కారం చేస్తాడు. రాజా మాటలు విన్నది గాని తన ఆటలు సాగనివ్వలేదు. రాజా నిజస్వరూపంతో తన తప్పు తెలుసుకుంటుంది సరోజ.
దీనజన బాంధువుడిలాగా ఉపన్యాసాలిస్తున్న గంగాధరరావుని బహిరంగంగా ఒకసారి డాక్టరు అవమానిస్తాడు. తనకు అవమానం, తన కూతురికి ఆశాభంగం కలిగించిన డాక్టరుని తన మనుష్యుల చేత కొట్టిస్తాడు. గూడెం వాళ్లు డాక్టరుకి అండగా నిలవటం వలన గూడెం గూడెంని తగులబెట్టిస్తాడు గంగాధరరావు. గూడెం వాళ్లు కోపోద్రిక్తులై గంగాధర వారి ఇంటికి బయలుదేరుతారు. ఉద్రేకంలో మంచి చెడ్డలు తెలియక చేసే పనులు కార్య సాధనానికి పనికిరావని ఆలోచించమని సీత వారిస్తుంది. సీత మంచి మాటలు చెప్పబోగా, దీనికంతటికీ కారణం నువ్వేనంటూ సీతను ఉద్రేకములో తన పిస్తోలుతో కాలుస్తాడు. సీత మరణిస్తుంది. సీత మానవతీతురాలు కాకపోయినా ఆమెలో మానవత్వం నశించలేదు. సత్యాన్ని గుర్తించగలిగింది. మానవ లోక కళ్యాణానికి శాంతి, అహింసల అవసరమని సీత గ్రహించింది. ఇదే ఆమె ఔన్నత్యం. తన నమ్మకాలకోసం సీత నిలబడ్డది. సరోజ తన తండ్రిని, రాజాని పోలీసులకు అప్పగించి తన గృహానికి ‘సీతాభవనము’ అని పేరు పెట్టుకుని బీదలకి అన్న వస్తద్రానాలు చేసి సీత పేరు స్మరించుకుంది.

-ఎ.సి.పుల్లారెడ్డి