Others

భీమాంజనేయ యుద్ధం ( ఫ్లాష్‌బ్యాక్ @50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(ఫ్లాష్‌బ్యాక్ @50)

కథ, రచన: తాండ్ర సుబ్రమణ్యం
కెమెరా: రామచంద్రన్
ఎడిటింగ్: జిడి జోషి
కళ: కుదురువల్లి నాగేశ్వరరావు
నృత్యం: చిన్ని, సంపత్
సంగీతం: టివి రాజు
స్పెషల్ ఎఫెక్ట్స్: ఎస్‌ఎస్ లాల్
దర్శకత్వం: ఎస్‌డి లాల్

గోకుల్ పిక్చర్స్ అధినేత దోనేపూడి కృష్ణమూర్తి సమర్పణలో మహాలక్ష్మి మూవీస్ పతాకంపై వి రామకోటేశ్వర రావు నిర్మించిన తొలి చిత్రమే -్భమాంజనేయ యుద్ధం. సతీ తులసి, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం చిత్రాలను రచించిన పౌరాణిక నాటక రచయిత తాండ్ర సుబ్రమణ్యం రాసిన నాటకం ఆధారంగా దీన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కొన్ని పద్యాలు, పాటలను ఆయనే అందించటం విశేషం. భారతదేశం తరపున రెండుసార్లు ఒలింపిక్స్‌కు హాజరైన వెయిట్ లిప్టర్ కామినేని ఈశ్వరరావు ఈ చిత్రంలో ఆంజనేయుడి పాత్ర పోషించారు.

శ్రీకృష్ణుడు (హరనాథ్) రుక్మిణితో పాండవుల గురించి ముచ్చటించే సన్నివేశంతో చిత్రం ప్రారంభమవుతుంది. అర్జునుడు దివ్యాస్త్రాల కోసం తపస్సు చేస్తున్నాడని, భీముడు ద్రౌపదితో తీర్థయాత్రల్లో ఉన్నాడని చెప్పే సన్నివేశమది.
ద్రౌపదిని వదలి పండ్ల కోసం భీముడు వెళ్ళగా, ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఘటోత్కచుడు (సత్యనారాయణ) ఆమెను బంధించబోతాడు. దాంతో భీముడు, ఘటోత్కచుని మధ్య పోరాటం జరుగుతుంది. ఇంతలో హిడింబి వచ్చి వారిరువురూ తండ్రీ కుమారులన్న నిజం తెలిపి యుద్ధాన్ని నివారిస్తుంది. అక్కడ నుంచి బయలుదేరిన తండ్రి భీమసేనునితో, తనను తలచుకున్నపుడు రాగలనని చెబుతాడు ఘటోత్కచుడు.
గంధర్వలోకంలో అలకాపురి రాజు కుబేరుడు (ముక్కామల). అతని కుమారుడు నలకూబరుడు (కాంతారావు). తనను వలచిన రంభ (విజయలలిత)ను తిరస్కరించి, మరో యువతి సౌదామిని (రాజశ్రీ)ని ప్రేమిస్తాడు. సభలో జరిగిన నృత్య పోటీలలో రంభను జయించి నాట్యరాణి బిరుదు పొందుతుంది సౌదామిని. తమ సరస్సులోగల సౌగంధిక కమలాలను ప్రతిరోజూ పూజకు తేవాలని సౌదామినిని ఆదేశిస్తాడు కుబేరుడు. కుబేరుడి ఆదేశాన్ని పాటిస్తూంటుంది సౌదామిని. ఒకరోజు నలకూబరుడు ఆమెను అడ్డగించి తన ప్రేమను తెలుపుతాడు. ఓ సౌగంధిక పుష్పాన్ని ఆమె తలలో తురిమి, దానే్న మంగళసూత్రంగా భావించమంటాడు. వీరి ప్రణయం వల్ల కుబేరుని పూజకు ఒక పుష్పం తక్కువవుతుంది. దాంతో ఆగ్రహించిన కుబేరుడు శపించడంతో సౌదామిని భూలోకం చేరుతుంది. రంభ కారణంగా నీటిపాలై తన సిగలో సౌగంధికాన్ని పోగొట్టుకుంటుంది. చివరకు ఆంజనేయుని ఆశ్రమం చేరుతుంది. గంగానదిలో ద్రౌపదికి ఈ సౌగంధిక పుష్పం దొరుకుతుంది. అలాంటి పుష్పాలు మరిన్ని కావాలని ద్రౌపది కోరడంతో, భీమసేనుడు (దండమూరి రాజగోపాల్) అలకాపురి వెళ్ళి వాటిని సంపాదిస్తాడు. ఆ పుష్పాలు చేజారి సౌదామిని వలన ఆంజనేయుని వద్దకు చేరతాయి. వాటిలో సౌదామిని కోల్పోయిన పుష్పం ఉంటుంది. దానిని తనకు ఇవ్వాలని కోరిన సౌదామిని కోర్కెను భీముడు తిరస్కరిస్తాడు. దీంతో భీమాంజనేయ యుద్ధం తలెత్తుతుంది.
స్వర్గంలోని సౌగంధిక పుష్పాలను సౌదామిని సంగ్రహించిందని భావించిన కుబేరుడు -ఆమెను కురూపిగా మారుస్తాడు. భీమునికి గర్వభంగం కలగించేందుకు శ్రీకృష్ణుడు నారదునిచే ఆడించిన నాటకం ప్రళయానికి దారితీస్తుంది. దీంతో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై భీమాంజనేయులు వాయుపుత్రులు కనుక సోదరులని తెలిపి యుద్ధాన్ని నివారిస్తాడు. రాబోయే మహాభారత యుద్ధంలో అర్జునుడి జెండాపై ఆంజనేయుడిని నిలపాలని చెబుతాడు. సౌదామిని, నలకూబరుల వివాహాన్ని కుబేరుడు జరిపించటం, భారత యుద్ధంలో అర్జునుని రథంపైనున్న జెండాపై ఆంజనేయుని చూపటంతో చిత్రం ముగుస్తుంది.
ద్రౌపదిగా యస్ వరలక్ష్మి, నారదునిగా చలం, భటుని పాత్రలో రమణారెడ్డి నటించారు. జానపద, క్రైమ్ చిత్రాల దర్శకత్వంలో పేరుగాంచిన యస్‌డి లాల్ ఈ చిత్రానికి చక్కని అర్థవంతమైన సన్నివేశాలను రూపొందించారు. వీరి సోదరుడు యస్‌యస్ లాల్ చిత్రానికి తగిన స్పెషల్ ఎఫెక్టులతో మెప్పించారు.
అలకాపురిలో సౌదామిని నలకూబరుల ప్రణయం, అముని అవతారం పూరె్తై మహాప్రస్థానానికి సాగటం, భీముడిని ఆంజనేయుడు తన వాలంతో బంధించటం, వాలంనుంచి తండ్రిని విడిపించ ఘటోత్కచుడు అశక్తుడు కావటం, హనుమంతుడి వాలం ఘటోత్కచుని మెడకు చుట్టుకొని భీముడు, ఘటోత్కచుడు, ఆంజనేయుడు ఒకే ఫ్రేములో కనిపించటం లాంటి సన్నివేశాలు అద్భుతం అనిపిస్తాయి.
మరోసారి భీమాంజనేయుల మధ్య నారదుడు నిలవటం, ఘటోత్కచుడు శ్రీరామునిగా మారి భంగపాటుకు గురవ్వటం, భీమసేనుడు సౌగంధిక పుష్పాలు ధరించిన ద్రౌపదిని కలలో చూస్తుంటే, దేవభటుడు రమణారెడ్డి ఆ సజ్జను తస్కరించటంలాంటి సన్నివేశాలు దర్శకుడి పనితనం, చమత్కారానికి అద్దం పడతాయి. చిత్రంలో భీమాంజనేయ యుద్ధాన్ని వైవిధ్యంగా చిత్రీకరించారు. భీముని చేతిలో గద ఎగిరిపోయినపుడు, కొండ శిఖరంపై నిలచిన ఆంజనేయుని మట్టుబెట్టేందుకు భీముడు ఆ కొండను భుజంతో, పిడికిలి బిగించి వట్టిచేతులతో ఢీకొంటాడు. ఆ ధాటికి సముద్రాలు పొంగి, కొండ చరియలు విరిగిపడటాన్ని -ఎంతో థ్రిల్లింగ్‌గా చిత్రీకరించారు.
కళాదర్శకులు కుదరవల్లి నాగేశ్వరరావు అలకాపురి సెట్‌కు అద్భుత శోభ చేకూర్చారు. సౌదామిని, నలకూబరుల ప్రణయ గీతం, రంభ, సౌదామినిల విడివిడి నృత్యాలు, సరోవర దృశ్యాలు, సభా భవనంలో చక్కని సెట్టింగ్స్ రూపొందించి ఆకర్షణ కలిగించారు. పాత్రధారులంతా తమ పరిపూర్ణ నటనతో పాత్రలకు రాణింపుతెచ్చారు.
చిత్ర గీతాలు:
రంభ (విజయలలిత)పై చిత్రీకరించిన గీతం -పలికే రాగం పిలిచే భావం నేనేలే నింగిలోనా (ఎల్‌ఆర్ ఈశ్వరి- సినారె). ఈ గీతం చంద్రవంకలో సాగుతున్నట్టు, గాలిలో వూయల ఊగుతున్నట్టు సెట్టింగ్స్ వేసి అద్భుతంగా చిత్రీకరించారు. సౌదామిని, రంభల మధ్య పోటీ నృత్య గీతం -నేనే నేనే మధుగీతి నవరస పూరిత నవ విలాసవతిని నేనే (పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి- ఆరుద్ర). సౌగంధిక పుష్పాలతో ముక్కామల శివార్చన చేసే పద్యం -కాళి చిత్త సరోజ బంధహరా గంగా శశాంక ప్రియ (వెంకటరావు-రచన తాండ్ర). రాజశ్రీ నృత్యం చేస్తుంటే, ప్రేమికుడు కాంతారావును చూపిస్తూ కనువిందైన సెట్టింగ్స్‌తో రమ్యంగా చిత్రీకరించిన ప్రణయగీతం -సురభామిని సౌదామిని కలహంస ఓలె ఇటురావె, తెలినవ్వు వెనె్నలలు తేవే (ఘంటసాల- సినారె). వీరిరువురిపై చిత్రీకరించిన మరో ప్రణయగీతం -సిగలోన విరిసిన సౌగంధికా చెలిమికి నీవే నవదీపిక (ఘంటసాల, పి సుశీల- సినారె). రంభ, సౌదామినిగా మారి నలకూబరుని ముందుచేసే నృత్య గీతం -ఇటు ఇటు ఓ రాజా ఎటు ఎటు (ఎల్‌ఆర్ ఈశ్వరి- సినారె). విజయలలిత, రమణారెడ్డిలపై చిత్రీకరించిన గీతం -వీరుడనే, ధీరుడనే వినవే ఓ భామా ఔనన్నా కాదన్నా (పి శ్రీరామ- రచన రాజశ్రీ). శ్రీరాముని ప్రార్థిస్తూ ఆంజనేయుడు పాడే గీతం -రామా రఘుకుల సోమ శ్రీరామ జయరామ నీల నీరద కోమల (ఘంటసాల- తాండ్ర). ఆంజనేయునిపై చిత్రీకరించిన మరో పద్యం -రామ నామ సుధామధురాతి మధుర (ఘంటసాల -తాండ్ర). మరో పద్యం -జపమేమి చేసేనో జనక మహారాజు కల్యాణరాముని కాళ్ళు కడుగ (ఘంటసాల- తాండ్ర). శ్రీరాముడు (హరనాథ్) లక్ష్మణుడు (కొమ్మినేని శేషగిరిరావు)ని గూర్చి తెలిపే పద్యం -అనుజన్ముండటంచు సంతతము నాకానంద సంజాత (ఘంటసాల- తాండ్ర). శ్రీరాముని మహాప్రస్థానం గూర్చిన పద్యం -అవశిష్టంబులు దీర్చి సర్వము పరిత్యాగము గావించు (ఘంటసాల- తాండ్ర). భీమసేనునిపై పద్యం -ప్రాంచిత కీర్తిశాలియగు పాండు నృపాలుడు (మాధవపెద్ది- తాండ్ర). భీముని బంధిస్తూ ఆంజనేయుని పద్యం -ఆలము చేయబూని నిటలాక్షుడు (ఘంటసాల- తాండ్ర). ఆంజనేయునిపై మరో పద్యం -కలన జయింపలేక బలగర్వమడంగియు (ఘంటసాల- తాండ్ర). మరో పద్యం -్ధరణి శ్రీరామచంద్రుడే దైవమేని (ఘంటసాల- తాండ్ర). నలకూబరుని ముందు సౌదామిని పాడే నృత్యగీతం -కలలన్ని ఫలించే ఈనాడే (పి సుశీల- సినారె). సౌదామిని, ఆంజనేయులపై చిత్రీకరించిన భక్తిగీతం -జయ జయ జానకి రామ (ఘంటసాల, సరోజిని- రాజశ్రీ). చిత్రం చివర నేపథ్యంలో భారతయుద్ధ ప్రారంభం గూర్చి వచ్చే పద్యం -పండెన్ దుష్ట చతుష్టయంబునకు పాపము (ఘంటసాల- తాండ్ర). అలరించేలా సంగీత దర్శకుడు టివి రాజు గీతాలు రూపొందించారు. చిత్రంలో హీరో కాంతారావుకు రెండు గీతాలు, మిగిలిన వాటిలో ఆంజనేయ పాత్రధారి కామినేని ఈశ్వరరావుకు ఘంటసాల ప్లేబాక్ పాడటం విశేషం. ఆ పద్యాలు, గీతాలు శ్రోతలను భక్తిపారవశ్యం కలిగించేలా రూపుదిద్దుకోవటం ప్రత్యేక విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి