AADIVAVRAM - Others

బిందువులే సిందువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామనాథం, రంగనాథం మంచి స్నేహితులు. ఒకే ఆఫీసు. ముఖ్యమైన పని ఉండటంతో ఇద్దరూ రంగనాథం ఇంటికొచ్చారు. రంగనాథం ఇల్లు పూర్వీకులు కట్టింది. విశాలంగా ఉంటుంది. ఇంటి ముందు ఖాళీ స్థలం, పెద్దపెద్ద చెట్లతో అందంగా ఉంటుంది. వీరు వెళ్లేప్పటికి ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకొంటున్నారు. గోలగోలగానే ఉంది. కానీ రంగనాథం వారినేమీ అనలేదు సరికదా ‘లోపలికి పోదాం. ఇక్కడ గొడవగా ఉంటుంది’ అంటూ రామనాథాన్ని ఇంటిలోపలికి తీసుకెళ్లాడు.
సాయంత్రం ఏడయింది. చీకట్లు ముసిరాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి లోనికొచ్చారు. ‘స్వప్నా, రామూ.. ఇలా రండి. అంకుల్‌కి నమస్కారం చెయ్యండి’ అని వాళ్లతో చెప్పి రామనాథంతో ‘వీళ్లిద్దరూ మా పిల్లలు. అమ్మాయి పదవ తరగతి, అబ్బాయి ఏడో క్లాసు చదువుతున్నారు’ అన్నాడు. పిల్లలిద్దరూ నమస్కారం పెట్టారు.
‘అయ్యాయా ఆటలు. స్నానం చేసి, భోంచేసి, చదువుకోండి’ అన్నాడు రంగనాథం. వాళ్లు లోపలికి వెళ్లిపోయారు.
రామనాథానికి ఆశ్చర్యం వేసింది. పిల్లలిద్దరూ అంతసేపు ఆటలు ఆడి వచ్చినప్పటికీ తండ్రిగా కోపపడని రంగనాథాన్ని చూసి.. ‘ఇంతసేపూ ఆడి వస్తే.. ఏమీ అనకుండా ఊరుకున్నావేమిటి? అమ్మాయి టెన్త్ క్లాస్. బోర్డ్ ఎగ్జామ్స్ కదా. ఆడుకోవటానికి సమయం కేటాయించకుండా పూర్తి స్థాయిలో చదువుకొంటే మరిన్ని మార్కులు వస్తాయి కదా’ అని ప్రశ్నించాడు.
ఇంతవరకూ చుట్టుపక్కల పిల్లలు ఆ స్థలంలో ఆడుకొంటున్నారేమోనని ఊరుకుండిపోయాడు. తన పిల్లల్ని పరిచయం చేయటంతో అలా ప్రశ్నించకుండా ఉండలేక పోయాడు.
‘ఆ ఆలోచనా విధానమే తప్పు రామనాథం. ఇంట్లోనూ, స్కూల్లోనూ ఎప్పుడూ చదువే అయితే వాళ్ల చిన్న మెదళ్లు ఏం కావాలి? దేనికైనా కొంత విరామం కావాలి. ఒక్కో అంశానికి ఒక్కో సమయాన్ని కేటాయించాలి. ఎప్పుడూ చదువు చదువూ అంటూ స్కూల్లోనూ.. ఇంట్లోనూ విసిగించి.. వేధించి.. వొత్తిడి పెంచి పిల్లలకు ఒక ఆట, పాట లేకుండా చేస్తున్నాం. ఎప్పుడూ కంప్యూటర్లంటూ.. పుస్తకాలంటూ బుర్రకి పదును పెట్టడం వరకూ ఫర్వాలేదు గానీ.. శరీరానికి కూడా కొంత వ్యాయామం అవసరం. శారీరక శ్రమ లేందే తిన్న తిండి వొంటికి పట్టదు. పుస్తకాలు ముందువేసుకొని కూర్చుంటే.. బుర్ర చురుగ్గా పని చేయదు. కాబట్టి ఆటలకి కొంత సమయాన్ని కేటాయించినట్లయితే అటు తెలివితేటలూ పెరుగుతాయి. మెదడుకి పదును పెరిగి.. విద్యాబుద్ధులు అలవడతాయి’ అంటూ వివరించాడు రంగనాథం.
‘చెప్పడం వరకూ ఫర్వాలేదు. కానీ ఆచరణ విషయంలోకి వచ్చేసరికి ఇటు స్కూళ్లల్లోనూ ఆట స్థలాలు ఉండటం లేదు... కనుకనే ఇండోర్ గేమ్స్ పేరిట ఏవేవో చిన్నచిన్న ఆటలతోనే సరిపెడుతున్నారు’ ఎదురుప్రశ్నించాడు రామనాథం.
‘మున్సిపల్ క్రీడా స్థలాలు ఉంటాయి. వాటిని అభివృద్ధి చేయాలని ప్రజలు పట్టుబడితే ప్రభుత్వం కదలివస్తుంది. స్కూళ్లలోనూ క్రీడా విభాగాన్ని ఏర్పాటు చేయమని డిమాండ్ చేయాలి. స్కూల్‌లోని ప్రతి విద్యార్థి తప్పనిసరిగా క్రీడల్లో పాల్గొనేట్టు చేయగలిగినట్లయితే క్రీడల పట్ల విద్యార్థులకు సైతం ఆసక్తి పెరుగుతుంది’ అంటూ సూచించాడు రంగనాథం.
-ఇది పాత అంశమే అయినప్పటికీ ఆచరణ సాధ్యం కాదు అని ఎవరికి వారు నిర్లిప్తతతో వ్యవహరించటం.. మార్కుల ప్రాతిపదికన చదువులు సాగటానికి ఓ విధంగా కారణమవుతోంది. అంతా మనకెందుకులే అని చేతులు ముడుచుకొని కూర్చోవటంవల్ల ‘క్రీడ’ల పట్ల పిల్లలు కూడా అనాసక్తి కనబరుస్తున్నారు. ‘మార్పు’ రావాలని కోరుకోవటం కాదు.. ఆ మార్పునకు పునాది మన ఇంట్లోంచే వేయాలన్న సూత్రాన్ని పాటించినట్లయితే ‘బిందువులు కలిస్తే సిందువు అవుతుంది’ అంటూ నీతిని ప్రబోధించాడు రంగనాథం.

-ఆకెళ్ల వెంకటసుబ్బలక్ష్మి