Others

త్యాగధనులు.. స్ఫూర్తిప్రదాతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సమాజంలో పోలీసుల పాత్ర అంత్యంత కీలకమైంది. వాస్తవంగా పోలీసులు లేని సమాజాన్ని మనం ఊహించలేం. పోలీసు శాఖ లేకపోతే నేరాలు విచ్చలవిడిగా జరగతాయనడంలో సందేహం లేదు. వారు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజాన్ని రక్షిస్తూ ఉంటారు. మనం రోజూ రాత్రి 10-12 గంటల తర్వాత నిద్రపోతూ ఉంటాం. పోలీసుల డ్యూటీ ప్రధానంగా ఆ తర్వాతనే మొదలవుతుంది. గ్రామాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ పోలీసులు ‘బందోబస్తు’ డ్యూటీలో ఉంటారు. మనం గాఢంగా నిద్రపోతూ ఉంటే పోలీసు బృందాలు గస్తీ తిరుగుతూ ఉంటాయి. పోలీసుల డ్యూటీ 24 గంటల పాటూ ఉంటుంది. అంటే పోలీసులు రాత్రివేళల్లో ఊరూ-వాడల్లో తిరుగుతూ నేరగాళ్ల ఆటకట్టిస్తూ ఉంటే మన హాయిగా మన ఇళ్లళ్లో ఫ్యాన్లు, ఎసిలు వేసుకుని నిద్రపోతూ ఉంటాం. పోలీసులు ఖచ్చితంగా విధులు నిర్వహిస్తున్నందువల్లేనే మనం ప్రశాంతంగా ఉంటున్నామని చెప్పుకోకతప్పదు.
పండగలు, పబ్బాలు వస్తే సామాన్యజనమైన మనమంతా పండగను ఎంత ఘనంగా జరుపుకోవాలో ఎన్నోరోజుల ముందు నుండే ప్రణాళికలు వేసుకుని పండగల రోజుల్లో ఆనందంగా గడుపుతూ ఉంటాం. కొత్త బట్టలు వేసుకుని, గుళ్లకు వెళ్లి దేవుడికి పూజలు చేసి, ఉన్నదాంట్లో మంచి భోజనం చేసి, సరదాగా కబుర్లు, ముచ్చట్లు చెబుతూ పండగరోజు కుటుంబ సభ్యులతో, బంధుమిత్రుల మధ్య గడిపేస్తుంటాం. డబ్బున్నవాళ్లు, మరికాస్త ముందుకు వెళ్లి మందూ, విందుల్లో పండగ రాత్రిళ్లు గడుపుతుంటారు. పండగ అయిపోగానే మనం పరామర్శించుకుంటూ ‘పండగ ఎలా జరిగింది’? అన్న ప్రశ్నలు వేసుకుంటుంటాం.
సాధారణ ఉద్యోగులకు పండగరోజు సెలవు ఉంటే పోలీసులకు అదేరోజు అదనంగా డ్యూటీ ఉంటుంది. పండగ సందర్భంగా సొంతంగా వాడుకునే హక్కు ఉన్న సెలవులను కూడా వాడుకునేందుకు వీలుకాదు. పండగ సందర్భంగా సెలవులు లేవంటూ కిందిస్థాయి పోలీసులకు నెలరోజుల ముందుగానే హెచ్చరికలు వెళుతుంటాయి. పండగరోజు పోలీసులంతా తమ తమ పోలీసు స్టేషన్లలోనే ఉండాల్సి వస్తుంది. ప్రార్థనా మందిరాలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రధాన కూడళ్లలో రోజు కన్నా ఎక్కువ సేపు విధుల్లో ఉండాల్సి వస్తుంది. పండగ రోజుల్లో సకాలంలో భోజనం చేసేందుకు కూడా పోలీసులకు వీలు కాదు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే భాగ్యం ఉండదు. రోజు కన్నా పండగరోజు ఉదయమే పోలీసు స్టేషన్‌కు వెళ్లి అర్ధరాత్రికో, అపరాత్రికో ఇంటికి చేరుతుంటారు. అందుకే పోలీసుల కుటుంబ సభ్యులు ‘ఈ పండగలు ఎందుకొస్తాయో! మా ప్రాణాలను తీయడానికి!!’ అనుకోవడం సహజంగా జరుగుతుంది. పండగపూట పోలీసులు కొత్త బట్టలు వేసుకునే భాగ్యానికి కూడా నోచుకోరు. పండగ భోజనం ప్రత్యేకంగా ఉండదు. పైగా ఒక్కోసారి పస్తులు ఉండాల్సి వస్తుంది. అంటే పోలీసులు తమ జీవితాలను సమాజం కోసం ధారపోయాల్సి వస్తుంది. మొంబత్తి (కొవ్వొత్తి) తనను తాను కాల్చుకుంటూ ఇతరులకు వెలుగు ప్రసాదిస్తున్న విధంగా పోలీసుల జీవితాలు సమాజానికి వెలుగును అందిస్తున్నాయి.
పోలీసు శాఖ ఉన్నదన్న భయంతో నేరాలకు పాల్పడేవారి సంఖ్య బాగా తక్కువగా ఉందని చెప్పుకోక తప్పదు. వాస్తవంగా చెప్పుకోవాలంటే నేరస్తుల గుండెల్లో పోలీసులు నిద్రపోతుంటారు. పోలీసులు తమను గమనిస్తూనే ఉంటారన్న అనుమానం నేరస్తుల మదిలో ప్రతిక్షణం మెదులుతూ ఉంటుంది. పోలీసుల చేతికి చిక్కి శిక్షకు గురికావడం ఎందుకన్న ఆలోచనతో చాలా మంది నేర ప్రవృత్తి కలిగిన వారు నేరాలకు దూరంగా ఉంటుంటారు.
1959 అక్టోబర్ 21 న భారత్-చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలోని ఆక్సాయిచిన్-హాట్‌స్ప్రింగ్ వద్ద గస్తీ తిరుగుతున్న 20 మంది భారతీయ సరిహద్దు భద్రతా దళంపై చైనా సైనికులు ఆకస్మిక దాడి చేశారు. ఆ దాడిలో 10 మంది పోలీసు సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి బలిదానానికి చిహ్నంగా ఏటా అక్టోబర్ 21 న ‘పోలీసు అమరవీరుల దినోత్సవం’ జరుపుకుంటున్నాం.
మన దేశ సరిహద్దులను భారతీయ సైనికులు, వైమానిక దళం, నావికాదళం రక్షిస్తూ ఉంటుంది. 24 గంటల పాటు పహరా కొనసాగుతూనే ఉంటుంది. అలాగే దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవించేందుకు వీలుగా పోలీసు శాఖ పనిచేస్తోంది. లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తదితర పేర్లతో రక్షక దళాలు పనిచేస్తున్నాయి.
పోలీసులకు అడుగడుగునా గండాలే. జీవితంలో ప్రతిక్షణం ఒక యుగంగా గడపాల్సి వస్తుంది. ప్రతిరోజూ రాత్రివేళ పోలీసులు అనుకుంటూ ఉంటారు...‘హమ్మయ్య ఈరోజు ప్రశాంతంగా గడిచింది’ అని. సమ్మెలు, ఆందోళనలు, నిరసనలు జరుగుతూ ఉంటే పోలీసులే సాధారణంగా ‘లక్ష్యం’ అవుతుంటారు. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసే జనం, రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగుతూ, విధ్వంసం సృష్టిస్తుంటారు. అడ్డుకునే పోలీసులపై తరచూ దాడులు జరుగుతూ ఉంటాయి. సమాజంలో కులాలు, మతాలు, గ్రూపులు, ప్రాంతాలు, భాషల వారీగా ఎవరు ఆందోళన చేసినా పోలీసులు రంగంలోకి దిగి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సి ఉంటుంది. నిరసనలు, ఆందోళనలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి రాకపోతే పోలీసులపైనే సంబంధిత నేతలు తదితరులు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.
సమాజంలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు తరచూ పోలీసు, భద్రతాబలగాలపై దాడులు చేస్తూ ఉంటారు. అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు, కిందిస్థాయి పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క నక్సలైట్లే కాదు, సంఘవిద్రోహులు కూడా పోలీసులపై దాడులు చేస్తూ, ప్రాణాలు తీస్తున్నారు. వాస్తవంగా పోలీసు శాఖలో చేరే వారంతా మన తోటి వారే. మన బంధువులు, స్నేహితులు, హితులు, పరిచయం ఉన్నవారే ఉంటారు. ఈ శాఖలో చేరే ముందు వారికి శత్రువులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. ఉద్యోగంలో చేరిన తర్వాత విధి నిర్వహణలో సంఘవిద్రోహులు పోలీసులకు శత్రువుల్లా పనిచేస్తూ ఉంటారు. సంఘవిద్రోహుల ఆటలు కట్టించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతిక్షణం, ప్రతిరోజూ పనిచేస్తూనే ఉంటారు. విధి నిర్వహణలో కొంత మంది పోలీసులు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఏటా వందలాది మంది బలిదానం అవుతుంటారు. గత డెబ్బై ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది పోలీసులు అమరులయ్యారు. జాతీయ స్థాయిలో అమరులైన పోలీసుల సంఖ్య వేలల్లో ఉంటుంది.
పోలీసుల జీవితాలను, విధి నిర్వహణను మనమంతా అర్థం చేసుకుని వారికి సహకరించాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితిని గమనిస్తూ, సామాజిక వ్యతిరేకులు, సంఘ విద్రోహులు ఎవరైనా సంచరిస్తున్నా, ఎక్కడైనా మకాం వేసి ఉన్నా, మనం గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడం మన కనీస బాధ్యత. కొన్ని సందర్భాలలో మన గుర్తింపు కార్డు చూపించమని పోలీసులు అడుగుతూ ఉంటారు. గుర్తింపు కార్డు చూపాల్సిన కనీస బాధ్యత మనపై ఉంటుంది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మనం మనవంతు సహకారం అందిద్దాం. సమాజంలో శాంతి, భద్రతలు కాపాడటంలో మన వంతు కృషి చేద్దాం. పోలీసులకు, వారి కుటుంబాలకు మనం అండగా ఉండాలి. నైతికంగా మనం అండగా ఉంటే పోలీసులు తమ విధినిర్వహణ మరింత బాగా చేస్తారనడంలో సందేహం లేదు. సమసమాజాన్ని స్థాపించడంలో కలిసి ముందుకు అడుగేద్దాం.

-పి.వి. రమణారావు 98499 98093