AADIVAVRAM - Others

రామాయణం..59 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరాలు ఇస్తానని ప్రతిజ్ఞ చేయడం వల్ల బాధితుడైన దశరథుడు ఆవిర్లు వచ్చేలా నిట్టూరుస్తూ సుమంత్రుడితో పదేపదే ఇలా చెప్పాడు.
‘సుమంత్రా! రాముడి వెంట అడవికి వెళ్లడానికి రత్నాలతో నిండిన చతుర్విధ బలాలని సిద్ధం చేయి. కళాకారులైన వేశ్యలు, ధనవంతులైన వర్తకులు సైన్యంతోపాటు వెళ్లి శోభింపచేయు గాక. రాముడి మీద ఆధారపడి జీవించే వారికి, రాముడు బల ప్రదర్శనలు చేసే వారికి ఎక్కువ డబ్బిచ్చి వాళ్లని కూడా ఈ సేనతో రాముడి వెంట పంపు. ముఖ్యమైన ఆయుధాలు, పౌరులు, బళ్లు, అడవల్లో నివసించే బోయలు రాముడి వెంట వెళ్లాలి. రాముడు అడవిలో జంతువులని, ఏనుగులని వేటాడుతూ, అక్కడ దొరికే తేనెని తాగుతూ, అనేక నదులని చూస్తూ సుఖంగా జీవిస్తూ రాజ్యం గురించి ఆలోచించడు. నిర్మానుష్యమైన అడవిలో నివసించే రాముడి వెంట నా ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని కూడా పంపు. పుణ్యక్షేత్రాల్లో యాగాలు చేస్తూ, తగిన దక్షిణలు ఇస్తూ రాముడు ఋషులతో కలిసి అడవిలో సుఖంగా ప్రవాస కాలం గడపగలడు. ఆజానుబాహువైన భరతుడు అయోధ్యని పాలిస్తాడు. శ్రీమంతుడైన రాముడికి సమస్త భోగ వస్తువులు ఇచ్చి పంపు’
దశరథుడు చెప్పేది విన్న కైకేయికి భయం వేసింది. మొహం వాడిపోయింది. బలహీన కంఠస్వరంతో దిగులుగా, భయంగా రాజుతో ఇలా చెప్పింది.
‘రాజా! సారాన్ని ఇతరులు తాగేసిన మద్యంలా జనమంతా వెళ్లాక, ఖాళీ అయి, అనుభవించడానికి ఏమీ మిగలని ఈ రాజ్యం భరతుడికి అక్కర్లేదు.’
కైకేయి సిగ్గు విడిచి అతి దారుణంగా పలికిన మాటలు విని దశరథుడు ఇలా జవాబు చెప్పాడు.
‘ఓ శత్రువైన కైకేయి! నన్ను కాడికి కట్టావు. నేను దాన్ని లాగుతూంటే ఇంకా నన్ను పొడుస్తావేమిటి? ఓ చెడ్డదానా! నేను చెప్పక ముందే నువ్వు ఎందుకు అడ్డుకోలేదు?’
రాజు కోపంగా పలికిన ఆ మాటలకి కైకేయి రెట్టింపు కోపంతో ఇలా చెప్పింది.
‘మీ వంశంలోనే నగర మహారాజు తన పెద్ద కొడుకు సమంజసుడికి రాజ్యం ఇవ్వకుండా వెళ్లగొట్టాడు. రాముడు కూడా అలాగే వెళ్లాలి’
కైకేయి మాటలు విన్న దశరథుడు ‘్ఛ! ఎంత మాటన్నావు?’ అని మాత్రమే అన్నాడు. అక్కడ ఉన్న వారంతా సిగ్గుపడ్డారు.
కైకేయి అది లెక్క చేయలేదు. అక్కడే ఉన్న వృద్ధుడు, మంచి స్వభావం కలవాడు, రాజుకి అభిమాన పాత్రుడు ఐన సిద్దార్థుడు కైకేయితో ఇలా చెప్పాడు.
‘దుర్మార్గుడైన సమంజసుడు దారిలో ఆడుకునే పిల్లల్ని పట్టుకుని సరయు నదిలోకి విసిరేసి ఆనందించేవాడు. పౌరులంతా అది చూసి కోపంతో రాజుకి ఇలా ఫిర్యాదు చేశారు.
‘రాజా! నీకు ఒక్క సమంజసుడు మాత్రమే కావాలో లేక మేం కావాలో కోరుకో’
‘మీకు ఈ విధంగా భయం కలగడానికి గల కారణం ఏమిటి?’ రాజు వారిని ప్రశ్నించాడు.
దానికి ఆ ప్రజలు ఇలా బదులు చెప్పారు.
‘బుద్ధి చెడిన ఈ సమంజసుడు ఆడుకునే మా చిన్నపిల్లల్ని మూర్ఖంగా సరయూ నదిలో పడేస్తూ ఆనందిస్తున్నాడు’
సగర చక్రవర్తి ఆ మాటలు వినగానే వారికి మంచి చేయాలనే కోరికతో కొడుకుని వదిలేశాడు. వెంటనే ఆయన అసమంజుడ్ని, అతని భార్యని కట్టుబట్టలతో రథం ఎక్కించి, ‘వీడ్ని యావజ్జీవిత కాలం దేశం నించి వెళ్లగొట్టండి’ అని సేవకులని ఆజ్ఞాపించాడు.
సమంజసుడు పాపకర్మం చేసిన వాడిలా దిక్కులు పట్టిపోయాడు. ధర్మాత్ముడైన సగర చక్రవర్తి తన కొడుకుని ఇలాంటి చెడ్డ పనులు చేయడం వల్లే వెళ్లగొట్టాడు. రాముడ్ని వెళ్లగొట్టడానికి అతను ఏం పాపం చేశాడు? రాముడిలో మాకు ఏ దోషం కనపడటం లేదు. అలా కాక నీకు రాముడిలో ఏదైనా దోషం కనపడితే అదేమిటో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. ఆ తర్వాత రాముడ్ని అడవికి పంపచ్చు. ఏం తప్పు చేయకుండా ధర్మమార్గంలో నడిచే వాళ్లని వెళ్లగొట్టడం ధర్మవిరుద్ధమైంది. అది దేవేంద్రుడి ఐశ్వర్యాన్ని కూడా కాల్చేస్తుంది. ఓ కైకేయి! నువ్వు రాముడి ఐశ్వర్యానికి ఆటంకం కలిగించకు. నీకు లోకంలో చెడ్డ పేరు రాకుండా కూడా చూసుకోవాలి కదా?’
సిద్దార్థుడి మాటలు విన్న రాజు బాగా అలసిన కంఠంతో విచారంగా కైకేయితో ఇలా అన్నాడు.
‘చెడ్డ ప్రవర్తన గల ఓ కైకేయి! నువ్వు సిద్దార్థుడి మాటలు కూడా వినడంలేదు. చెడ్డ పనులు చేసే నువ్వు చెడ్డ మార్గానే్న అవలంబించి నా మంచి కాని, నీ మంచి కాని తెలుసుకోలేక పోతున్నావు. నువ్వు చేసే పని సన్మార్గానికి విరుద్ధమైంది. నువ్వు, రాజైన భరతుడు చిరకాలంగా సుఖంగా రాజ్యాన్ని అనుభవించండి.’ (అయోధ్యకాండ సర్గ -36)
వెంటనే ఓ పాతికేళ్ల యువకుడు లేచి హరిదాసుతో చెప్పాడు.
‘నా పేరు రామదాసు. నేను రామాయణం మీద రీసెర్చ్ స్కాలర్‌ని. మీరు చెప్పిన కథంతా బావుంది కాని కొన్ని తప్పులు ఉన్నాయి. వాటిని చెప్తాను వినండి.’
ఆ తప్పులని మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
పంచ
మహాపాతకాలు ఏవి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
వాల్మీకి రామాయణంలో వేంకటాచలం ప్రసక్తి లేదు. మరి ఏ రామాయణంలో ఆ ప్రసక్తి వచ్చింది?
-కంబ రామాయణంలో. కిష్కింధ కాండలో సీతానే్వషణలో లంకకి వెళ్లే దారిలో రాముడు వేంకటాచలానికి సుగ్రీవ, హనుమంతులతో వచ్చాడని అందులో ఉంది. చంపూ రామాయణంలో కూడా రాముడు వేంకటాచలంలోని ఓ కొండ గుహలో నివసించాడని ఉంది.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.‘తన ధనాన్నంతా బ్రాహ్మణులకి, సేవకులకి దానం చేసి’ వచ్చి రాముడు వాకిలి దగ్గర నిలబడ్డాడని వాల్మీకి రాసాడు. హరిదాసు దీన్ని చెప్పలేదు.
2.మూడు వందల ఏభై మంది స్ర్తిలు కౌసల్య వెంట వచ్చారని హరిదాసు చెప్పడం విస్మరించాడు.
3.పధ్నాలుగు సంవత్సరాలు గడిచాక నేను మళ్లీ వస్తాను. అప్పుడు నన్ను చూస్తావు అని రాముడు రెండు సందర్భాల్లో దశరథుడికి చెప్పాడు. కాని హరిదాసు అది ఒక్క సందర్భంలోనే చెప్పాడు.
4.కైకేయి తప్ప మిగిలిన రాజభార్యలంతా ఏడ్చారు. ‘కైకేయి తప్ప’ అన్నది చెప్పడం హరిదాసు విస్మరించాడు.
5.‘వెయ్యి సంవత్సరాలపాటు నువ్వు ఈ భూమికి రాజుగా ఉండాలి’ అని దశరథుడితో రాముడు చెప్పిన మాటల్ని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి