AADIVAVRAM - Others

రామాయణం.. 60 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు సారథి ఐన సుమంత్రుడు వెంటనే లేచి తల కదుపుతూ, మాటిమాటికీ నిట్టూరుస్తూ, చేతులు నులుముకుంటూ, పళ్లు కొరుకుతూ ఎర్రబారిన కళ్లతో, కోపంతో, దశరథుడి అభిప్రాయం కూడా తెలుసుకుంటూ, చాలా విచారంగా వాడి బాణాల్లాంటి, వజ్రాయుధం లాంటి మాటలతో కైకేయి హృదయాన్ని కుదిపేస్తూ ఆమె రహస్యాలన్నీ ఛేదిస్తున్న వాడిలా ఇలా చెప్పాడు.
‘ఓ కైకేయి! కదలని, కదిలే ఈ ప్రపంచానికి అంతటికీ రాజు, నీ భర్త ఐన దశరథ మహారాజునే నువ్వు స్వయంగా వదిలేసావు. అలాంటి నీకు ఈ లోకంలో చేయకూడని పనంటూ ఏదీ లేదు. దశరథ మహారాజు ఇంద్రుడిలా జయించడానికి శక్యం కాని వాడు. పర్వతంలా కదల్చడానికి శక్యం కాని వాడు. మహా సముద్రంలా క్షోభింపచేయ శక్యం కాని వాడు. అలాంటి రాజుని ఈ చెడ్డ పనులతో బాధ పెట్టే నువ్వు నీ భర్తని చంపుకుంటున్నావు. చివరికి కులానే్న నశింపచేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. నీకు వరాలిచ్చి, నిన్ను పోషించే భరె్తైన దశరథుడ్ని అవమానించకు. రాజు మరణించినప్పుడు వయస్సు ప్రకారం రాజపుత్రులు రాజ్యాన్ని పొందుతారు. రాముడి విషయంలో ఆ పద్ధతిని మార్చాలని కోరుతున్నావు. నీ కొడుకు భరతుడు రాజై భూమిని పాలించుగాక! మేమంతా రాముడు వెళ్లిన చోటికే వెళ్తాం. నువ్వు చేయదలుచుకున్న అమర్యాదకరమైన పనిని బట్టి నీ దేశంలో బ్రాహ్మణుడైన వాడు ఎవడూ నివసించకూడదు. మేమంతా తప్పక రాముడ్ని అనుసరించి వెళ్తాం. బంధువుల చేత, బ్రాహ్మణులు అందరిచేత, సత్పురుషుల చేత వదిలేయబడ్డ నీకు రాజ్యం లభించినా ఏం ఆనందం పొందుతావు? నువ్వు మర్యాదకి విరుద్ధమైన పనిని చేస్తున్నావు. నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నా భూమి వెంటనే బద్దలై తనలో నిన్ను కలుపుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మహా బ్రహ్మర్షులు సృష్టించే, మండే, చూడటానికి భయంకరంగా ఉండే, ‘్ఛ!’ అనే వాక్‌దండాలు కూడా రాముడ్ని అడవికి పంపాలని పట్టుబట్టే నిన్ను ఎందుకు కాల్చివేయడం లేదు? ఎవడైనా మామిడి చెట్టుని గొడ్డలితో నరికేసి వేప చెట్టుకి సేవ చేసినా, దాన్ని పాలతో కడిగినా వాడి విషయంలో కూడా వేప చేదుగానే ఉంటుంది.
జన్మతః వచ్చిన నీ స్వభావం నీ తల్లి స్వభావం లాంటిదే అనుకుంటున్నాను. నీ తల్లికి ఉన్న చెడ్డ పట్టుదల గురించి ఇదివరకు విని ఉన్నాం. ఒక మహాపురుషుడు మీ తండ్రికి ఓ గొప్ప వరాన్ని ఇచ్చాడు. దాని ప్రభావం వల్ల నీ తండ్రి సమస్త ప్రాణుల మాటలని అర్థం చేసుకునే వాడు. పశుపక్ష్యాదుల మాటలు కూడా అతనికి అర్థం అయ్యేవి. ఓ రోజు మీ నాన్న మంచం దగ్గర ఓ చీమ మాట్లాడిన మాటలు విని పెద్దగా నవ్వాడు. అప్పుడు నీ తల్లి ఆయన తనని ఎగతాళి చేస్తున్నాడని భావించి, కోపంతో, తన భర్త ప్రాణం పోయినా సరే అనుకుని, ‘ఓ రాజా! ఎందుకు నవ్వావో చెప్పు’ అని కోరింది. అప్పుడు రాజు ఆమెతో, ‘ఓ రాణి! నేను నీకు కారణం చెప్తే వెంటనే మరణిస్తాను’ అని చెప్పాడు. అప్పుడు నీ తల్లి ఆ కేకయ రాజుతో ‘నువ్వు బతికితే బతుకు. లేదా చావు. ఏమైనా నీ నవ్వుకి కారణం చెప్పి తీరాలి. నన్నీ విధంగా ఎగతాళి చేయడానికి వీల్లేదు’ అని చెప్పింది. అప్పుడా రాజు తనకా వరం ఇచ్చిన మహా పురుషుడికి ఇది నివేదించాడు. ఆ మహాపురుషుడు నీ తండ్రితో, ‘ఓ రాజా! నీ భార్య మరణించినా, నశించినా నువ్వు మాత్రం ఆ రహస్యాన్ని చెప్పద్దు’ అని సూచించాడు. మనసు కుదుటపడ్డ ఆయన నీ తల్లిని వదిలేసి కుబేరుడిలా సుఖంగా ఉన్నాడు.
పాపదృష్టిగల ఓ కైకేయి! నువ్వు కూడా నీ తల్లిలాగే చెడ్డవాళ్లు అనుసరించే దారిలోనే నడుస్తూ అజ్ఞానంతో దశరథుడి విషయంలో ఇలాంటి చెడ్డ పట్టుదలతో ఉన్నావు. కొడుకులకి తండ్రి గుణాలు, కూతుళ్లకి తల్లి గుణాలు వస్తాయని లోకంలో అంతా చెప్పుకునే మాట నిజమేనని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. నువీ విధంగా తల్లి పోలిక ఉన్నదానివి కాకు. రాజు మాటని మన్నించి, ఆయన కోరిక ప్రకారం నడుచుకుని పౌరులు అందర్నీ కాపాడు. నువ్వు పాపాత్ముల చెప్పుడు మాటలు విని దేవేంద్రుడితో సమానమైన వాడు, భూలోకానికి రాజు ఐన నీ భర్తకి పాపం వచ్చేట్లు చేయకు. తప్పులు చేయని వాడు, శ్రీమంతుడు, కమలాల వంటి కళ్లు గల దశరథుడు నీకు ఇచ్చిన మాటని అసత్యం చేయలేడు. కాబట్టి నువ్వే నీ అభిప్రాయాన్ని మార్చుకోవాలి.
రాముడు అన్నదమ్ముల్లో పెద్దవాడు. ఉదార స్వభావుడు. పనులని చేయడంలో సమర్థుడు. స్వధర్మాన్ని కాపాడుకునేవాడు. ప్రాణులందర్నీ రక్షించేవాడు. మహా బలశాలి. అలాంటి రాముడికి రాజ్యాభిషేకం జరిగేట్లు చూడు. ఓ కైకేయి! రాముడు తండ్రైన దశరథ మహారాజుని వదిలి అడవికి వెళ్తే లోకంలో నీకు అపవాదు కలుగుతుంది. అందుచేత రాముడే రాజ్యాన్ని పాలించుగాక! నీ మనసులోని దుఃఖాన్ని వదులు. ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి రాముడు తప్ప ఇంకెవరూ సమర్థులు ఈ అయోధ్యలో లేరు. రాముడికి యవరాజ్యాభిషేకం చేసాక మహాబలశాలి ఐన దశరథుడు తన పూర్వ పురుషుల ఆచారాన్ని పాటిస్తూ తపస్సు కోసం అడవికి వెళ్తాడు.’
సుమంత్రుడు ఈ విధంగా మంచి మాటలు, కైకేయి బాధపడే తీవ్రమైన మాటలు దశరథుడి ముందు చెప్పి మళ్లీ నమస్కరిస్తూ నిలబడ్డాడు. కాని సుమంత్రుడు ఎన్ని చెప్పినా కైకేయి ఏ మాత్రం కలత చెందలేదు. ఆమె మనసులో ఏ మాత్రం బాధ కలగలేదు. ఆమె మొహంలో రంగులు మారలేదు. (అయోధ్యకాండ సర్గ 35)
మంచినీళ్లు తాగి హరిదాసు చెప్పాడు.
‘ఇవాళ 25వ సర్గ చెప్పాను. రేపు 26 సర్గ చెప్తాను’
వెంటనే శ్రోతల్లోని ఒకతను లేచి ఇలా చెప్పడం ఆశే్లష విన్నాడు.
‘నేనీ సర్గని క్షుణ్ణంగా చదివాను. మీరు చెప్పిన వాటిలో నాకు ఐదు తప్పులు కనిపించాయి’
అతను వాటిని వివరించాడు.
మీరు ఆ తప్పులని కనుక్కోగలరా?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
పంచ మహాపాతకాలు ఏవి?
-బ్రాహ్మణ హత్య, బంగారం అపహరణ, మద్యపానం, గురుద్రోహం. ఐదోది, ఈ నాలుగు పాపాలు చేసే వారితో స్నేహం.
*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.సగర రాజు పెద్ద కొడుకు పేరు అసమంజసుడు. సమంజసుడు కాదు.
2.సిద్దార్థుడు మంత్రి. ఇది హరిదాసు చెప్పలేదు.
3.అసమంజసుడికి దేశ బహిష్కరణ శిక్ష పడ్డాక ఓ చిన్న గునపం, గంప తీసుకుని పర్వతాలని తవ్వాడు. ఇది హరిదాసు చెప్పలేదు.
4.‘చంద్రుడిలో మాలిన్యం ఎలా ఉండదో అలా రాముడిలో కూడా దోషం ఉండదు’ అనే సిద్దార్థుడు చెప్పిన ఉపమానాన్ని చెప్పడం హరిదాసు విస్మరించాడు.
5.‘నేను ఈ రాజ్యాన్ని, సుఖాన్ని, ధనాన్ని వదిలి రాముడితో కలిసి ఇప్పుడే అరణ్యానికి పోతాను’ అని దశరథుడు కైకతో చెప్పిన మాటల్ని హరిదాసు చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి