Others

ఈ పాటలా... మనం పాడుకోవాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసామాన్యుడి నుంచి సామాన్యుడి వరకూ -అందరిచేతా తలలూపించేవే తెలుగు సినీ గీతాలు. దైనందిన జీవితంలో మనిషితో పెనవేసుకుపోయాయి. ఆపాతమధురాలను వింటూ పరవశించేవారు... పాట నోటికి రాకున్నా హమ్మింగ్‌గా అనుకునేవారు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి సినీ పాటలు ప్రస్తుతం అధఃపాతాళానికి దిగజారుతున్నాయన్న ఆవేదన
వినిపిస్తోంది. ఆనాటి సినిమా పాట తెలుగు సంస్కృతీ సంప్రదాయాన్ని నిలబెడితే.. ఈనాటి సినిమా పాట సంగీతపు హోరుతో ఇబ్బంది పెడుతోంది. అర్థంకాని సాహిత్యంతో విరక్తి పుట్టిస్తోంది. సినీ సంగీతాభిమానులకు తీవ్ర వేదన మిగులుస్తోంది.
***
పూర్వం ఒక నానుడి ఉండేది. గతాన్ని తల్లిలా భావించి వర్తమానాన్ని శిశువుగా చూసుకుంటే.. ఆ తల్లి శిశువుకిచ్చే స్తన్యమే సంస్కృతి అని! ఆ రోజుల్లో తల్లిని గౌరవించే రచయితలంతా శిశువులకు సాహిత్యపు స్థన్యాన్ని అందించారు. ఈనాటి కొందరు రచయితలు తప్పని పరిస్థితుల్లోనో, తప్పనిపించని పరిస్థితుల్లోనో విష సాహిత్యపు స్తన్యాన్ని శిశువుల చెవులకు అందిస్తున్నారు. ఆనాడు మధురమైన సాహిత్యపు విలువలున్న పాటలను అందించిన రచయితలు దాదాపు కనుమరుగైపోయారు. ఈనాటి రచయితలు తప్పకో, తప్పనిపించకో పచ్చి శృంగారంతో కూడిన పాటల్ని జనం చెవులకు వదలుతున్నారు. నాటికీ..నేటికీ ఎంత తేడా!
ఆనాటి రచయితకున్న స్వేచ్ఛ ఈనాటి రచయితకు లేదని భావించాలా? లేక ఆనాటి రచయితల సాహిత్యాభినివేశం ఈనాటి రచయితలకు లేదని అర్థం చేసుకోవాలో అర్థంకాని అయోమయం. ఒక్కటి మాత్రం నిజం! ఆధునిక సినిమా పాట నగర వీధుల్లో నగ్నంగా నర్తిస్తోంది!
సినీ రచయిత పాటను రాసినప్పుడు కథను, పాత్రల ఔచిత్యాన్ని మననం చేసుకుంటాడు. కథాసందర్భాన్నిబట్టి పాటలు రాసుకుంటాడు. రచయిత ఎలాగైనా గీతాన్ని రాస్తాడు. 1978లో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సీతామాలక్ష్మిలో ‘అలలు కదిలినా పాటే... ఆకు మెదిలినా పాటే.. కలలు చెదిరినా పాటే... ఏ పాట నే పాడను’ అంటాడు రచయిత. అంటే పాటను సాహిత్యపు విలువలతో ఎలాగైనా రాయవచ్చన్నది రచయిత భావన. అద్భుతమైన సాహిత్యానికి కొలమానం ఆ పాట. మరి ఈనాడు అలాంటి పాటలు ఒకటైనా వినిపిస్తున్నాయా?
సినిమా స్వర్గయుగపు కాలంలో రచయితలంతా సాహిత్యంపైనే దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. కథానుగుణంగా పాటను అందించారు. ఇప్పుడు వేరు. కథతో సంబంధం లేకుండానే పాట అందిపోతుంది. అదృష్టం బావుండి సందర్భానుసారం పాటవుంటే ఒకే. లేదంటే, కథకు సంబంధం లేని పాటే చచ్చినట్టు చూడాల్సి వస్తుంది. కథను వేరుగా, పాటను వేరుగా అవగతం చేసుకోవాల్సి వస్తుంది. దిగజారిపోతున్న తెలుగు సినీ గేయానికి ఇదొక సంకేతం.
తెలుగు సినీగీతాల ప్రస్థానాన్ని గమనిస్తే.. పరిశ్రమ ప్రారంభంలో అన్నీ పౌరాణికాలే కాబట్టి పద్యాలే ఎక్కువ ఉండేవి. 1950ల తర్వాత సినిమాలో పాటల ప్రాముఖ్యత పెరిగింది. బిఎన్ రెడ్డి, కెవి రెడ్డి, ఆదుర్తి, విశ్వనాథ్ లాంటి దిగ్గజ దర్శకుల కాలంలో పాటలు ప్రాముఖ్యత ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత సాహితీ విలువలున్న పాటలను రాయించుకొనేవారు. 1954లో వచ్చిన విప్రనారాయణలో పాట ‘చూడుమదే చెలియా’. సముద్రాల విరచితమైన ఈ పాట ఎఎమ్ రాజా పాడారు. 1950-70ల మధ్యకాలంలో అద్భుత సాహితీ విలువలున్న పాటలు శ్రోతలను వీనులవిందు చేశాయి. 1963లో వచ్చిన ‘జగదేక వీరుని కథ’ చిత్రంలో ‘శివశంకరీ... శివానంద లహరి...’ పింగళి విరచితమైన ఈ పాట ఈనాటికీ తెలుగు పాఠకుల మదిలో మెదులుతూనే ఉంటుంది. 1961లో వచ్చిన ‘వాగ్దానం’ సినిమాలోని ‘నిలువుమా నిలువునా నీలవేణి’, 1967లో వచ్చిన ‘నర్తనశాల’లో పాట ‘ఎవ్వరికోసం ఈ మందహాసం’, 1957లో వచ్చిన ఎంఎల్‌ఏ సినిమాలోని ‘నీ ఆశా అడియాశ’, 1960లో వచ్చిన మహాకవి కాళిదాసులోని ‘మాణిక్యవీణా మఫలాలయంతీం’, 1957లో వచ్చిన పాండురంగ మహాత్యం ‘హే కృష్ణాముకుందా మురారీ...’ ఇలా చెప్పుకుంటూపోతే అద్భుతమైన సాహితీ విలువలున్న పాటలు ఆనాడు మనకు సాక్షాత్కరించేవి. ఇప్పటికీ పాత పాటలను తెలుగువాళ్ళు ఆలింగనం చేసుకుంటున్నారంటే కారణం అందలి సాహిత్యపు విలువలే!
ఎప్పుడైతే హీరోయిజం తెరమీదకు వచ్చిందో అప్పుడే తెలుగుపాట అధఃపాతాళంలోకి నెట్టివేయబడింది. కథకాదు ముఖ్యం అనుకున్ననాడు... తెలుగు పాటలో సాహిత్యం కునారిల్లిపోయింది. అద్భుతమైన పాటలనందించిన సినారే, వేటూరి, ఆత్రేయలాంటి రచయితల కలాల్లోంచి కూడా చవకబారు పాటలు రావడం మన దురదృష్టం. 1971 తర్వాత ద్వందార్ధపు పాటలు వీరవిహారం చేశాయి. ‘చిలకకొట్టుడు కొడితే చిన్నదానా...’ యమగోలనుంచి, ‘రగులతోంది మొగలి పొద..’ ఖైదీ వరకు ఆ పరంపర కొనసాగింది. ఎక్కడో అలజడి.. అగ్నిపర్వతం లోనిది వేటూరి వ్రాసినది. ‘ఎక్కడో గుచ్చుకుంది చేపముల్లు...’ రౌడీనంబర్‌వన్... ఇవీ పాటల సాహిత్యం! పచ్చి శృంగారం రాజ్యమేలి సాహిత్యం మృగ్యమైంది.
ఒక్కసారి విచ్చలవిడితనం బాట పట్టిన తెలుగు పాట -ఇక వెనుదిరిగి చూడలేదు. ఒకరినిమించి ఒకరు, ఒకరినిదాటి మరొకరు -ద్వందార్థాల పాటలను జనంమీదకు వదిలారు. ఇక్కడ అదృష్టం ఏంటంటే -అవే పాటలు తెగ నచ్చేసినట్టు జనం కూడా వినేస్తున్నారు. అప్పుడప్పుడో, తప్పని పరిస్థితుల్లో ఒకప్పుడో సామర్థ్యమున్న సాహితీ రచయితలు మంచిపాటలు అందిస్తున్నా -అవి ఆదరణకు నోచుకున్నవి చాలాచాలా తక్కువ. అలాంటి పాటను సినిమా చూసేటప్పుడే తప్ప, ప్రత్యేకంగా విని ఆనందించే కాలం కనుమరుగైంది కనుక -రచయితలు ఏంరాసిన చెల్లుబాటైపోతుంది. సినిమాలో విపరీతంగా చూపించడానికి వీలుగానే పాటలను రచయితలు రాయక తప్పడం లేదు. ప్రేమ పాటలు చెదిరిపోయి ప్రాస పాటలొచ్చాయి. అలౌకికమైన ఆనందానుభూతులు పంచే పాటలు కనుమరుగై ఐటెంలు వచ్చేశాయ్. ఇది పాట అని చెప్పుకోవడానికి కూడా మనసు అంగీకరించనంత గొప్ప సెక్సీ సాహిత్యపు తాలింపుతో వస్తున్న వాటిని వినడానికి ఒక్కోసారి భయమేస్తోంది కూడా. మంచి సాహిత్యపు విలువలున్న పాట ఒక్కటైనా దొరక్కపోతుందా అని వెతుక్కునే వారికి, వస్తే బావుండునని అభిలషించే వారికి నేటి పాటలు ఖేదాన్ని కల్గిస్తున్నాయి. అర్ధంపర్ధంలేని పదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగని మంచి పాటలు లేవని, రావడం లేదని చెప్పలేం. కానీ, వస్తున్న వాటికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ప్రపంచానికి, సినీ సంగీతాభిమానులకు తెలియకుండానే మాయమైపోతున్నాయి. ఇకనైనా మంచి పాటలకోసం దర్శకులు ఆలోచిస్తారా? రచయితలు కృషిచేస్తారా? ఆ దిశగా మనం ఆశించవచ్చా.. ఆలోచించవచ్చా?

-మల్లారెడ్డి రామకృష్ణ