Others

మొహమాటం మితిమీరితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురితో కలిసి సమాజంలో బతుకుతున్నప్పుడు ఎవరైనా సరే కొన్ని మర్యాదలు, మన్ననలు, పద్ధతులు పాటించక తప్పదు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి మర్యాదలు చేయటం.. మనం ఎవరింటికైనా అతిథిగా వెళ్ళినప్పుడు వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూనే హుందాగా ప్రవర్తించటం.. ఈ పద్ధతులన్నీ మన వ్యక్తిత్వానికి వనె్నతెచ్చేవిగా ఉంటాయి. గౌరవ మర్యాదల్లో ఏ లోటుపాట్లు, ప్రవర్తనా లోపాలు ఉన్నా అది చూసేవాళ్ళకు ఎబ్బెట్టుగా అనిపించడమేగాక మనమీద ఇతరులకు చులకన భావం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, బయట నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన నోటిమాట, మన శరీర భాష (బాడీ లాంగ్వేజి) విషయంలో మనం చాలా జాగ్రత్తగా మెలగాలి. మన ప్రవర్తనను ఇతరులు గమనిస్తుంటారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు.
ఊహ తెలిసినప్పటి నుంచీ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే సంస్కార పద్ధతులలో అతి ముఖ్యమైనది- మొహమాట పడటం! ఏ ఆంటీనో, అంకులో మన ఇంటికి వచ్చి ఓ బిస్కట్ ప్యాకెటో, చాక్లెట్ బాక్సో మన చేతిలో పెడితే ఇచ్చీ ఇవ్వగానే వాళ్ళ చేతుల్లోనుంచి దాన్ని లాక్కున్నంత పనిచేసి, అక్కడే ఆరాటంగా వాటిని లటుక్కున పిల్లలు నోట్లో వేసుకోలేరు. పిల్లలు ‘అయ్యో.. వద్దు ఆంటీ..’ అంటూ చేతులు ముడుచుకుని సిగ్గుపడుతూ, అమ్మ ‘తీసుకోమని’ కనుచూపుతో సైగ చేసాక అప్పుడు తీసుకుంటారు. అతిథులు బయటకు వెళ్ళిపోయాక పిల్లలు వాటిని తింటారు. పిల్లలు పెరిగి కాస్త లోకజ్ఞానం తెలిశాక, మరి కొన్ని మర్యాదలను మొహమాటం రూపంలో నేర్చుకుంటారు.
ఎవరి ఇంటికైనా భోజనానికి వెళ్ళినప్పుడు మనకోసమని ప్రత్యేకంగా వాళ్ళుచేసిన ఏ స్వీటో, హాటో ‘తినండి..తినండి’ అంటూ వడ్డిస్తుంటే ‘అయ్యో.. అంత వద్దండీ.. కొంచెం పెట్టండి’అంటూ మొహమాట పడిపోతాం. అవి మనకు ఎంత ఇష్టమైన పిండి వంటలైనా ఆబగా ఎగబడి పిడికిలి నిండాపట్టి బకాసురుడిలా తింటే ఏం బాగుంటుంది? ‘ఏంటా తిండి?’అని మనసులో విసుక్కుంటారు వాళ్ళు! మననో తిండిపోతుగా చూస్తారు. ‘మ్యానర్స్ లేదు’ అన్న ముద్ర మనమీద వేస్తారు. భోజనాల తర్వాత ‘టీ తాగుతారా?’అని వాళ్ళు మర్యాదగా అడిగితే వెంటనే మనం ‘ఆ తాగుతా!’అని బుర్ర ఆడిస్తే ఏం బాగుంటుంది. అలాకాక ‘అబ్బే! ఇప్పుడేం వద్దండీ- మీరు శ్రమపడకండి.. ముందు మీరు కూర్చోండి!’అంటే ఆ మొహమాటంలో ఎంత అందం ఉంది. అయితే- ఈ మొహమాటాల ఎక్కువ, తక్కువలు అనేవి మనం వెళ్ళినచోటునుబట్టి, వాళ్ళదగ్గర మనకు ఉన్న చనువు, స్వేచ్ఛ బట్టి రకరకాలుగా ఉంటాయి. స్నేహితుల దగ్గరైతే కాస్త ఫ్రీగా ఉంటాం. సమవయస్కుల దగ్గర కూడా కొంత చొరవ చూపించగలం. కానీ పెద్దల దగ్గర, అంతగా పరిచయం లేనివారి వద్ద అలా కుదరదు కదా. కాస్త ఎక్కువగా మొహమాట పడవలసిందే!
మొహమాటం మంచిది కాదని ఎవ్వరూ అనరు. కాకుంటే అది కాస్త హద్దులో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మన వంటికి, మనసుకు కూడా చాలా మంచిది. అతిగా మొహమాటపడి.. సిగ్గుతో మెలికలు తిరిగిపోయి అవతలివాళ్ళు ఏమనుకుంటారోనని ఇష్టంలేనివి బలవంతాన ఎక్కువ తిన్నా, ఉపయోగపడని బహుమతులను వద్దనలేక తీసుకున్నా ఆ తరువాత బాధపడాల్సింది మనమే. కనుక కొన్ని సందర్భాలలో ఇతరులు ఆఫర్ చేసిన దాన్ని- ‘ప్లీజ్.. ఏమనుకోకండి.. నాకు ఆ పదార్థం ఇష్టం ఉండదు అనో, నేను షుగర్ పేషెంట్‌ని గనుక స్వీట్ తినకూడదు’అనో మర్యాద పూర్వకంగా తిరస్కరిస్తే అవతలివాళ్ళు అర్థం చేసుకుంటారు. బంధుమిత్రులను, ఇరుగుపొరుగును ఇష్టపడటం, గౌరవించడం తప్పక చేయవలసిన పనే అయినా.. అది మన ఇష్టాయిష్టాలను, మన సొంత పనులను, మన సమయాన్ని త్యాగం చేసి మరీ చేసేది కాకూడదు. ‘క్షమించండి... ఇప్పుడు మీతో నేను బయటికి రాలేను.. అర్జంటుగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.. సారీ.. మీరు చెప్పిన పని ఇప్పుడు నేను చేయలేను.. నాకు ఆఫీసుకు టైమ్ అవుతోంది.’వంటి చిన్న చిన్న తిరస్కారాలతో మన సంగతి మనం చూసుకుంటే అందులో తప్పేమీ లేదు. వాళ్ళుకూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ అర్థం చేసుకునే సంస్కారం లేని వాళ్ళయి ఒక మాట పెడసరంగా అన్నా, సాధించినా మనమేమీ పశ్చాత్తాప పడవలసిన అవసరం లేదు.
అయినవాళ్లు అని భావించే వారిలోనే రకరకాల మనుషులు ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడం చేతకాక చిన్నచిన్న విషయాలకే పెద్ద పెద్ద త్యాగాలు చేయటానికి సిద్ధపడే అతి మొహమాటస్థులను అలుసుగా తీసుకుని, వాళ్ళను ఎలా తమ పనులకు వాడుకోవాలో అని ఎత్తులువేసే స్వార్థపరులు మనచుట్టూనే చాలామంది ఉంటారు. మన బలహీనతల్ని ఒకసారి వాళ్ళు కనిపెట్టేసారంటే మనల్ని మాటిమాటికీ వాళ్ళ బుట్టలో పడేయాలనే చూస్తారు. అలాంటి వాళ్ళకు లొంగకుండా స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో మన వ్యక్తిత్వాన్ని మనం గౌరవించుకుంటూ స్వేచ్ఛగా ముందుకు సాగిపోయేలా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనం కాస్త స్ట్రిక్ట్‌గా, స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా, ఓపెన్‌గా ఉండగలిగితే- మరోసారి వాళ్ళు మన జోలికి రారు. మనకు కష్టాన్ని, నష్టాన్ని కలిగించాలని ప్రయత్నించరు.
ఇంతకూ.. అసలు సంగతేమంటే- మొహమాటం అందరికీ ఉండాలి గానీ మరీ అంత మొహమాటం అవసరం లేదని! ‘దాని మోతాదు ఎంత’అన్నది సమయ, సందర్భాలను బట్టి, అవతలి వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి ఎవరికివారే నిర్ణయించుకోవలసినది. అతి మొహమాటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులే కాదు.. పెద్దపెద్ద నష్టాలు, కష్టాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. లేకుంటే ఎన్నో సంఘటనలు మనకు గుణపాఠాలు నేర్పడానికి సిద్ధంగా ఉంటాయి. తేనె పూసినట్టుండే తియ్యటి మాటలతో తెగ మొహమాట పెట్టేసి- ఏ కాగితం మీదంటే ఆ కాగితం మీద సంతకాలు పెట్టించుకుని, తాము చేసే అప్పులకు ఇవతలి వాళ్ళను ష్యూరిటీగా నిలబెట్టిన వాళ్ళు, ఆస్తులు రాయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మొహమాటాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా ఉత్తమం.

-కొఠారి వాణీచలపతిరావు