Others

తెలుగమ్మ పదాబ్జములకు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష కమ్మదనం నలుదిశలా చాటుదాం
తెలుగులోని అమ్మదనం ఎలుగెత్తి పాడుదాం

వెనె్నట్లో విరబూసిన పొన్నల నునులేత మిసిమి
గరిక పూలపై మెరిసే అరుణారుణ ఉదయ రశ్మి
పలుకుల పొత్తిళ్లలోన పొదవిన చెలువమ్ము తెలుగు
స్వాతి చినుకు ఏటి తళుకు రెమ్మల చిరుగాలికులుకు
తుమ్మిపూలు గుమ్మపాలు అమ్మమ్మల మురిపాలు
ఒక్కసారి ఎదురైతే కలిగే తమకమ్ము తెలుగు
జోలపాడు ఊయల ఎలకోయిల కలస్వనము తెలుగు

శతాబ్దాల నాటి భాష మృతభాషగమార నీకు
కృతఘు్నడై తల్లి కంట క్షుభితాస్రులు రాల నీకు

ఆకలేసిన పాప ‘మమీ మిల్కివ్వ’మంటె
మురిసిపోవు తెలుగు మహిళ మరచిపోయె ఓనమాలు
కనిపించదు కథలు చెప్పు తాతయ్యల ఆనవాలు
పాలిచ్చే పయ్యెదలో విష సంస్కృతి గునపాలు
లాలిపాట లేదు తెలుగు లాలిత్యం జాడ లేదు
నాగరికం ముసుగులోన ఆంగ్ల భాష వ్యామోహం
తెలుగువారి ముంగిటనే చెలరేగెడి విద్రోహం

తల్లిపాల భాషలోని అమ్మదనం మరవద్దని
ఎలుగెత్తి పాడుదాం తెలుగును కాపాడుదాం

పొలం గట్టు గుండెతట్టు పల్లెపట్టు తలకట్టు
కలకండ పలుకులమరిన మన అక్షరాల జతకట్టు
మణికళికలు రసగుళికలు గుణింతాల కనుపట్టు
తెలుగువాడి సొంతమయిన పద్యమ్మొక తేనెపట్టు
కవికలముల కలరవముల పలికే తియ్యందనాలు
తెలుగు తల్లి గళసీమను అలదిన సిరిచందనాలు

తెలుగును బతికించరండి తల్లి ఋణం తీర్చుకోండి
దేశ భాషలందు తెలుగు లెస్సని గళమెత్తరండి

ఉట్టి వెన్న పొట్టనింపు అమ్మల కనుసన్న తెలుగు
మట్టి మమత వుట్టిపడే గట్టిగింజరా తెలుగు
పనసతొనల కలగలిసిన తాటిముంజరా తెలుగు
కరకుదనం లేని చెరకు తీయనైన పూతరేకు
పెద్దబాల శిక్ష గరపు సుద్దుల కన్నాకు తెలుగు
వద్దను చిన్నారినోట ముద్దుల గోర్ముద్ద తెలుగు
కనె్నల నునుసిగ్గులందు వనె్నల గోరింట తెలుగు
పాల నురుగు పొంగులెత్తు లేగల తుళ్లింత తెలుగు

పొల్లులు పొక్కిళ్లు మరచి తెలుగును దిగజార్చి తల్లి
ఒళ్లు గుల్ల చేయవద్దు తల్లడిల్ల నీయ వద్దు

కవిత్రయం విరచించిన మన పవిత్ర భారతం
పోతన భాగవతమ్మున వడబోసిన భక్తిరసం
పెద్దన తెలుగమ్మ నుదుట దిద్దిన అక్షర తిలకం
శ్రీనాథుని సీసమందు కదం తొక్కు నుడికారం
వీధినాటకాల నాడు విహరించిన రాగాలు
తోలుబొమ్మలాట లందు తైతక్కల సరాగాలు
గంగిరెద్దు సయ్యాటలు బుర్రకథలు కోలాటలు
ఇంటిముందు జుంటి తేనెలైన యక్షగానాలు
కనుమరుగైపోకముందె వినిపింపుము మేలుకొలుపు
జనజాగృత నవోదయం కొరకె జనని ఎదురుచూపు

ఏదేశ మేగినా వేదికేదైనా
వినిపించుము తెలుగు గుండె నగారా
పాడవోయి తెలుగు పాట మనసారా!
పలకవోయి తెలుగు మాట నోరారా!

- టి.హెచ్. నటరాజారావు 8106243636