Others

చైతన్యమే ఆయుధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన క్షణం నుంచి మరణించేవరకూ ప్రతి ఒక్కరూ వినియోగదారుడే. నగదు చెల్లించి వస్తువులను, సేవలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ వినియోగదారుడే. అయితే కొలతలు, కల్తీ, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత హామీలు, ఆశలు రేకెత్తించే దృశ్య ప్రకటనలతో వినియోగదారులు నిత్యం మోసపోతున్నారని తెలిసిన నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నడీ వినియోగదారుల చట్టాన్ని రూపొందించాడు. భారత్‌లో 1986లో ఈ చట్టం రూపుదిద్దుకుంది. కానీ 1986లోని కొన్ని నిబంధనలను మార్పు చేయాలని భావించినా కేంద్ర ప్రభుత్వం 2015లో నూతన వినియోగదారుల చట్టాన్ని రూపొందించింది. ఇది అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఎన్ని చట్టాలు చేసినా ప్రజల్లో చైతన్యం లేకపోవడం, అవగాహనారాహిత్యం వల్ల విక్రయదారులు ధరల్లో, కొలతల్లో, నాణ్యతలో వినియోగదారులను మోసగిస్తున్నారు. ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. బియ్యం, నెయ్యి, టీ పొడి, పాలు, నూనెలు ఇలా ఒకటని ఏమీ లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే కూడా ఎక్కువకు అమ్ముతున్నారు. ముఖ్యంగా ప్రయాణ కేంద్రాల్లో ఈ ధరల మోసం ఎక్కువగా ఉంటోంది. మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతోనూ మోసాలు చేస్తున్నారు. ఇలాంటి మోసాల నుంచి రక్షణకు ప్రభుత్వం వినియోగదారులకు హక్కులు కల్పించింది. కొన్న ప్రతి వస్తువుకు బిల్లు అడిగి తీసుకోవాలన్నది అందులో ఒకటి. గ్యారంటీ, వారంటీ పీరియడ్, కాలపరిమితి వివరాలు అడగి తీసుకోవాలి. ఈ విషయాలపట్ల వినియోగదారులలో అవగాహన కల్పించేందుకు ఏటా డిసెంబర్ 24వ తేదీని వినియోగదారుల హక్కులదినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 1986 డిసెంబర్ 24న మనదేశంలో తొలిసారిగా వినియోగదారుల చట్టానికి రాష్టప్రతి ఆమోదముద్ర వేశారు. అప్పటి నుంచి ఆ రోజను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నారు. మిగతా చట్టాల్లాగానే ఇది పటిష్టమైనదే వినియోగదారులను మోసగించేవారిని శిక్షించే అవకాశం ఇందులో ఉంది. వినియోగదారుల రక్షణ చట్టంలోని 6వ విభాగం ప్రకారం వినియోగదారుడిని సాధికారుడిని చేయడానికి ఆరు ప్రాథమిక హక్కులను కల్గించారు. భద్రత, సమాచార, ఎంపిక చేసుకోవడం, వాదనను వినిపించే అవకాశం, పరిష్కారం పొందడం, తెలియచేసే హక్కులను కల్పించారు.
వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకనే హక్కును కలిగియుండటమే వినియోగదారుల హక్కు అని అర్థం. వినియోగదారుల హక్కులలో ఆరోగ్యదాయకమైన ఆహారం కూడా ఒకటని 2015 సంవత్సరంలో ప్రపంచ వినియోగదారుల దినం సందర్భంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 1986 సంవత్సరం నాటి వినియోగదారుల రక్షణ చట్టానికి శాసనరూపం కల్పించినప్పటికీ ఆ చట్టం ముఖ్యోద్దేశమైన తక్కువ ఖర్చుతో, సులభమైన రీతిలో సత్వర న్యాయం అందించడం అనే పరమార్థం ఇప్పటికీ నెరవేరలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారుల రక్షణ చట్టానికి సవరణను ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మనదేశంలో సుమారు 27 వేల వినియోగదారుల సంఘాలున్నాయని అంచనా. రాల్ఫ్ నాదేర్‌ని వినియోగదారుల ఉద్యమ పితామహునిగా పిలుస్తారు. వినియోగదారుల సేవలకు నష్టం కలిగినా సహకార సంఘాల ద్వారాగానీ, నేరుగాగానీ ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వినియోగదారుల ఫోరాలు ఉంటాయి. డబ్బులు చెల్లించి రశీదు పొందితే అన్ని సేవలు వినియోగదారుల చట్టాల పరిధికిందకి వస్తుంది. ఫిర్యాదు చేసిన 90 నుండి 150 రోజుల పరిమిత వ్యవధిలో న్యాయం పొందడానికి వీలుంది. జాతిపిత మహాత్ముడు కూడా వినియోగదారుడి విలువేమిటో చెప్పారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వేలలో బలమైన వినియోగదారుల ఉద్యమాలు నడిచాయి. బలమైన చట్టాలు చేశారు. ప్రస్తుతం మన దేశంలో కూడా డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చిన నేపథ్యంలో బలమైన కొత్త చట్టం రూపకల్పన చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టు 10న లోక్‌సభలో సరికొత్త వినియోగదారుల బిల్లును ప్రవేశపెట్టారు. ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించిన స్థారుూ సంఘానికి నివేదించారు. ఆ సంఘం ముఖ్యమైన సిఫార్సులు చేస్తూ ఏప్రిల్ 26 మే 2016న ఒక నివేదికను సమర్పించింది. దానికి అనుగుణంగా ఈ మార్పులు చేసి, ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో తిరిగి ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న వినియోగదారుల పరిరక్షణ చట్టంలో ఈ క్రింది అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది. వినియోగదారుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడటం, వినియోగదారుడికి నిత్యావసర వస్తువులు, సేవలు అందుబాటులోకి తేవడం, ఎవరికైతే ప్రయోజనాలు అందడం లేదో వారి హక్కుల్ని కాపాడటం, వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు ముప్పువాటిల్లకుండా రక్షణ కల్పించడం, వినియోగదారుల గోప్యతను కాపాడటం, తప్పుదోవ పట్టించే, మభ్యపెట్టే వ్యాపార ప్రకటనలలో వినియోగదారులను మోసపుచ్చకుండా ఉండటం, వస్తువులు, సేవల, నిబంధనలు, వర్తించే ఫీజు, తుది ఖరీదు తదితర విషయాలపై పూర్తి సమాచారాన్ని తెలియచేయడం, వ్యవసాయ వినియోగదారులు, సంస్థలు తమకు నష్టం చేకూర్చే విషయాలను వేదికలపై నిర్భయంగా చెప్పుకోవడానికి అవకాశం కల్పించడం వంటివి వాటిలో కొన్ని. ముందే చెప్పినట్లు చట్టాలు ఎన్ని తెచ్చినా వినియోగదారుడిలో చైతన్యం వస్తేనే వాటివల్ల ప్రయోజనం కలుగుతుంది.

-కె.రామ్మోహనరావు