AADIVAVRAM - Others

కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపల్లెలోని రామశర్మ తాను సకల శాస్త్ర పారంగతుడననీ, మహా పండితుడననీ గర్వంగా వుండేవాడు. ఊరిలోని వారందరిలో తానే ఉత్తమమైన వాడిననీ, తనకు ఎందులోనూ ఎవరూ సాటిరారని అనుకునేవాడు. పైగా పెద్దలు ఇచ్చిపోయిన ఆస్తిపాస్తులు, గుడిమాన్యాల వల్ల ఊరిలోని ధనవంతుల్లో కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. అవన్నీ అతనికి వినయ విధేయతలు, మంచితనం నేర్పక అహంభావాన్ని నేర్పాయి. చిన్నతనం నుండే.. అతని అహంభావానికి ఎందరో అవమానం పాలయినందున... కాలక్రమంలో ఎవరూ అతని జోలికి వెళ్లేవారు కాదు.
ఒకరోజు గుర్రపు బండిలో నగరానికి బయలుదేరాడు రామశర్మ. దారిలో అదే గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి గాభరాగా బండికి అడ్డు వచ్చి ‘అయ్యగారూ!... నగరానికి బయలుదేరిన నా భార్యకు మధ్యలోనే పురిటినొప్పులు వచ్చాయి. దారిలో ఆమెకి పురుడు పోయడానికి ఎవరూ లేరు. తమరి బండి మీద త్వరగా నగరానికి తీసుకెళ్లండి...’ అని చేతులెత్తి వేడుకొన్నాడు.
‘ఏరా!... ఎలా ఉంది నీకు..? నీ జీవితంలో ఏనాడైనా నాకు ఎదురొచ్చి ఇలా మాట్లాడావా... అయినా నీలాంటి అంటరాని జాతి వాడిని బండిలో ఎక్కించుకుని తీసుకెళ్లమంటావా? నీకెన్ని గుండెలురా?’ అని నిర్దాక్షిణ్యంగా అతని వంక చూసి, బండిని ముందుకు కదిలించాడు.
వెంటపడి ఎంత బతిమాలినా కసిరికొట్టి ముందుకు సాగిపోయాడు రామశర్మ. అయితే రామయ్య అదృష్టం బాగుండి ఆ వెనకాలే ఆ ఊరికే చెందిన వేమయ్య బండి వచ్చింది. ఆయన రామయ్య భార్యను సకాలంలో నగరానికి చేర్పించటంతో పెద్ద ముప్పు తప్పి.. ఆమెకి సుఖ ప్రసవం జరిగి సంతోషంగా తిరిగి వచ్చింది.
ఇది తెలిసిన ఊరిలో వారు రామశాస్ర్తీని చాటుమాటుగా అసహ్యించుకున్నారు. ‘చదువుంటే చాలా.. సంస్కారం అక్కర్లేదా..! ధనముంటే చాలా.. దయాగుణం అక్కర్లేదా?.. పదిమందికి సాయపడని అతని చదువెందుకు.. సంపదెందుకు..’ అని చీదరించుకున్నారు.
‘అందరికీ కష్టాలొస్తాయి.. ఇలాంటి వాడికి కష్టాలు రావా...!’ అని అందరూ అనుకున్నారు. మరి అందరి కోరికలు తీరే రోజు రావాలని కోరుకున్నారు.
ఇలా ఉండగా ఆ సంవత్సరం బాగా వర్షాలు కురియటంతో వాగులు, వంకలు ఒక్కటై.. పెద్దఎత్తున వరదలు వచ్చి ఏరు పొంగింది. పొంగిన ఏటి నీరు అగ్రహారాన్ని చుట్టుముట్టింది. ఊరంతా కదిలి దగ్గరలోని కొండ మీదికి చేరసాగారు. మొదట్లో తన ఇంటిని, వస్తువులను వదిలి వెళ్లని రామశాస్ర్తీ నీరు మరింత పెరగటంతో... భార్యాపిల్లలను తీసుకుని తానూ కొండవైపు బయలుదేరాడు.
ఒక చేత్తో భార్యను, మరో చేత్తో పిల్లవాణ్ణి పట్టుకుని నడుస్తున్నాడు రామశర్మ. పోయే కొద్దీ వరద ఉధృతం కావటంతో పట్టుతప్పి జారి నీళ్లలో పడగానే, అతని చేతిపట్టు విడిపోయి పిల్లవాడు ప్రవాహంలోకి జారిపోయాడు. వెంటనే రామశర్మ దంపతులు బిగ్గరగా అరవటంతో కొంచెం ముందున్న రామయ్య అది గమనించి వెంటనే ప్రవాహంలోకి దూకి, ఈదుకుంటూ వెళ్లి రామశర్మ కొడుకును రక్షించి ఒడ్డుకి తీసుకొచ్చాడు. తను ఆ రోజు అతని భార్యను బండి మీద తీసుకుపోవటానికి నిరాకరించినా.. దానిని మనసులో ఉంచుకోక.. ఆపదలో తన కొడుకును, ప్రాణాలకు తెగించి ప్రవాహంలో దూకి కాపాడిన రామయ్యను చూసి సిగ్గుతో తలవంచుకున్నాడు రామశర్మ. రామయ్యను కౌగిలించుకొని తనను క్షమించమని అడిగాడు.
చదువు, సంపదలతోపాటు సంస్కారం, మానవత్వం, పరోపకారం ఉండాలని... అవే మనిషిని మనిషిగా నిలబెడతాయని తెలుసుకున్నాడు. ఆ తర్వాత రామశర్మ పూర్తిగా మారిపోయాడు. ఊరి వారందరినీ తన వాళ్లుగా చూసుకుంటూ.. అందరితో కలసిపోయి వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ జీవనం సాగించాడు. అతనిలో వచ్చిన మార్పునకు అందరూ సంతోషించారు.

-ఎ.రెడ్డి కైపు