Others

పనిచేద్దామా.. విశ్రమిద్దామా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రమ విలువైనది.. శ్రమ సంపద.. ప్రాచీనకాలం నుండీ మానవుడు శ్రమతోనే మనుగడ సాగిస్తున్నాడు. రాతియుగం నుండీ మనిషి శ్రమపడకుండా చెట్లనుండి దొరికిన కాయలను, భూమిలో లభించిన దుంపలనూ తింటూ కాలక్షేపం చేసుంటే, ఈనాడు కూడా అలాగే వుండేవారు. మేథస్సుతో కష్టపడి పనిచేసే శరీర నిర్మాణం మనిషికుంది. మనిషి శ్రమనుండే ఇంతటి వికాసము, నాగరికత నిర్మించబడ్డాయి. శ్రమతోపాటు శరీరానికి విశ్రాంతి కూడా అవసరం. అయితే, విశ్రాంతి పేరుతో ఎక్కువ సమయాన్నీ, కాలాన్నీ కూర్చుని గడిపేయడం అభివృద్ధికి విరుద్ధమే. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండీ దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల నిర్వహణలో కాలంగాని, శ్రమగాని వృథా కాకూడదు. అవి వృథా అయితే జరగవలసిన అభివృద్ధి బాగా తగ్గిపోతుంది. మనదేశంలో సెలవుల పేరుతో సంవత్సరంలో సుమారు సగం రోజులు వృథాగా గడిచిపోతున్నాయి. మిగిలిన రోజుల్లో మాత్రమే పని జరుగుతోంది. అంటే, ఉత్పత్తికి వినియోగించవలసిన పనిదినాలు అధిక సెలవులతో తగ్గిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ సంస్థలకూ, ప్రభుత్వ రంగ సంస్థలకూ ఉన్న సెలవులు అర్థరహితంగా అనిపిస్తాయి. వారం రోజుల్లో ఒక రోజు విశ్రాంతి సరిపోతుంది. కాని కేంద్ర ప్రభుత్వోద్యోగులకు వారానికి రెండు రోజులు సెలవు. రాష్ట్ర ఉద్యోగులకు వారానికి ఒక రోజు, ప్రతి నెలా రెండవ శనివారం సెలవు. ఈలోగా వారం మధ్యలో ఏదైనా పండగకుగాని, జాతీయ దినోత్సవానికిగాని ఒకటి రెండు రోజులు సెలవొస్తే, ఆ వారమంతా ఖాళీ! మిగిలిన పనిదినాల్లో కూడా ఏదో రకమైన సెలవు పెట్టేస్తారు కొందరు.
ఇవికాక పండుగలు, జాతీయ దినోత్సవాల సెలవులు. మన దేశంలో ఎన్నో మతాలున్నాయి. వీటిలో ప్రధానమైనవి- హిందూ, ముస్లిం, క్రైస్తవం, సిక్కు మతాలు. ఈ మతాల్లోని పండుగలకు సెలవులు. ఇవిగాక, జాతీయ నాయకుల జన్మదినాలకు, వర్ధంతులకు సెలవులు. ఆనాటి జాతీయ నాయకులెవరైనా తాము పుట్టిన రోజున ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చోమని ప్రజలకు చెప్పారా? ఆ రోజుల్లో కూడా పనిచేసి ఉత్పత్తిని పెంచితే, నిజంగా ఆ నాయకుల ఆత్మలు సంతోషిస్తాయి. ఎందుకంటే, ఆ నాయకులు దేశాభివృద్ధినీ, ప్రజా శ్రేయస్సునూ కోరారు. ఆ రోజుల్లో ఉదయానే్న వారి విగ్రహాలకు గాని, చిత్రపటాలకు గాని దండలు వేసి వారిని, వారి సేవలను గుర్తుచేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం ఒక అరగంట చాలు. ఆ రోజు మిగిలిన సమయమంతా పని చేసుకోవచ్చు. మొరార్జీ దేశాయ్ సుమారు వంద సంవత్సరాలు బతికారు. తాను చనిపోయిన రోజున సెలవు ఇవ్వొద్దని చెప్పారాయన. కాని ప్రభుత్వం ఆయన చనిపోయినపుడు రెండు రోజులు సెలవు ప్రకటించింది!
అయితే, ఇతర రంగాల్లో శ్రమిస్తున్నవారికి ఇన్ని సెలవులు లేవు. ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకూ ఇన్ని సెలవులున్నాయా? అసంఘటిత వర్గాలైన రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారులు, కుమ్మరి, కమ్మరి మొదలైన వృత్తుల పనివార్లకు అసలు సెలవులే ఉండవు. వీరు విశ్రమించాలన్నా ఏదైనా పని చేసుకోవాలన్నా, ఆ రోజుల్లో ఆదాయాన్ని వదులుకోవాల్సిందే. సామాజిక సమన్యాయం విషయంలో ఇదొక కొత్తకోణం! విశ్రాంతి లేకుండా శ్రమించేవారు ఉత్పత్తి చేస్తుంటే, ఆ ఫలితాలను విశ్రాంతి తీసుకునే వర్గాలు కూడా పొందుతాయి. ఇది సమన్యాయమా? సోషలిజమా? ప్రజలంతా దేశ పౌరులే అయినపుడు, అందరికీ సమన్యాయాన్ని రాజ్యాంగం కల్పించినపుడు, ఈ వివక్షతను ఏ నాయకుడూ, ఏ సిద్ధాంతకర్తా ఎందుకు ప్రశ్నించరు? ఈ విషయంలో మనకర్థమయ్యేదొక్కటే- ఈ అసంఘటిత వర్గాల ప్రజల ఓట్లు అసంఘటితంగా ఉంటాయి కనుక, వారి కష్టనష్టాలను వీరెవరూ పట్టించుకోరు.
సంపద, పెట్టుబడి పెరగడానికి మనిషి యొక్క శ్రమ ముఖ్యపాత్ర వహిస్తుందని కారల్‌మార్క్స్, ఇతర సామాజిక, ఆర్థిక సిద్ధాంతకర్తలు చెప్పారు. అలాంటి శ్రమయొక్క ఫలితం- ఇప్పుడు వివక్షతో దేశంలో ప్రజల మధ్య పంచబడుతున్నది. ఇది నిజం. కష్టపడి పనిచేస్తున్నవారికి విశ్రాంతి కూడా కావాలి. విశ్రాంతికోసం సెలవులుండాలి. అయితే, ఈ సెలవులు అనే విశ్రాంతి సమయం హేతుబద్ధంగా నిర్ణయించబడాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు, అసంఘటిత రంగాల్లోని రైతులు, కూలీలు, చిరు వ్యాపారులు, వృత్తి పనివారు- అందరూ పనితోపాటు విశ్రాంతిని కూడా పొందుతూనే, ఆయా సెలవుదినాల్లో కూడా కొంత ఆదాయాన్ని పొందగలిగేలాగున హేతుబద్ధీకరించబడాలి. ఇది మానవతా దృక్కోణం. ఈ దృక్కోణానికి ఏ సిద్ధాంతాలైనా, చట్టాలైనా అడ్డురావు.
శ్రమ విలువ, సమయం విలువ గుర్తించబడాలి. శ్రమ, విశ్రాంతి మతాలపరంగా, కులాలపరంగా, వర్గాలపరంగా నిర్ణయం కావు. శ్రమ, ఉత్పత్తి, సంపద, సంపద పంపకంపరంగా నిర్ణయించబడాలి. జాతీయ భావనా దృక్పథంతో నిర్ణయించబడాలి. ఎందుకంటే దేశ సంపద అందరికీ చెందుతుంది. రాజకీయ కారణాలు, పార్టీల ప్రయోజనాలూ ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయకూడదరు. శ్రమ విలువను కూడా సమానంగా గౌరవించేదే శ్రేయోరాజ్యం. ప్రజల యొక్క జాగృతితోనే ఇది సాధ్యమవుతుంది.

- మనె్న సత్యనారాయణ ఫోన్: 99890 76150