Others

‘మీరు సింహాలు’! ( గోరుముద్ద)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్త మానవాళి నుద్దేశించి స్వామి వివేకానంద బోధించిన మాట. రాజసంతో, నిర్భయత్వంతో ఉట్టిపడే ఈ మృగరాజు గుణాలు అంటే స్వామి వివేకానందకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఇలా అంటారు.. ‘నేను ప్రతిరోజూ ధ్యానం చేసేటపుడు సింహాన్ని హృదయంలో తలచుకుని ధ్యానం చేస్తాను’. అడవికి రారాజైన ఈ మృగరాజులో దాగివున్న సహజ గుణం ఏమిటో తెలుసా? అది ఎపుడూ వర్తమానంలోనే జీవిస్తుంది. ఆకలి వేసినపుడే అలుపెరుగకుండా వేటాడుతుంది. ఆకలి తీరిన వెంటనే తన పక్కన ఏ జంతువు వెళుతున్నా అది పట్టించుకోదు. తొమ్మిదేళ్లపాటు తన బోధనలతో యావత్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకున్న ఈ యుగాచార్యుడు ఎక్కడికి వెళ్లినా, ఏ సభలో ప్రసంగించినా ‘గొర్రె సింహం’ కథ చెప్పేవారు. ఆయన గురువు రామకృష్ణ పరమహంస చెప్పిన ఈ కథ శిష్యుడు వివేకానందలో సహజంగా ఉన్న ఆధ్యాత్మికతను తట్టి లేపింది. అదే ఆయనను ఓ ఆధ్యాత్మిక శిఖరం వలే చేసింది. ఆ కథేమిటో తెలుసుకుందాం..

ఓ గొర్రెల కాపరి తన గొర్రెలను మేతకు అడవికి తోలుకువెళ్లాడు. ఆ సమయంలో నిండు నెలలతో ఉన్న ఓ ఆడ సింహం ఆహారం కోసం వెతుకుతోంది. గొర్రెలు కనిపించగానే వాటి మీదకు దూకింది. పాపం ఓ రాయి తగిలి సింహాన్ని కని చనిపోతుంది. ఆ గొర్రెల కాపరి గొర్రెలతో పాటు ఆ సింహం పిల్లను కూడా తీసుకుని వెళ్లి దానికి పాలు, గడ్డి వేసి పెంచుతాడు. ఈ సింహం పిల్లను స్వామి వివేకానంద ‘గొర్రె సింహం’ అనేవారు. ఇది మిగిలిన గొర్రెల వలే గడ్డి, పాలు తాగుతూ తనలో సహజంగా దాగివున్న సింహం లక్షణాలు అలవర్చుకోదు. మిగిలిన గొర్రెల వలే అరుస్తుంది కాని గర్జించదు. ఓ రోజు అడవికి మేతకు వెళ్లిన ఈ గొర్రె సింహం పిల్లను చూసిన మరో సింహం ఆశ్చర్యపోయింది. దాని లక్షణాలను వారం రోజుల పాటు పరిశీలించి.. ఓ రోజు ఈ మంద మీద పడి ఆ గొర్రె సింహం పిల్లను దొరకబుచ్చుకుని పక్కకు తీసుకువెళ్లింది. ఆ గొర్రె సింహం పిల్ల ‘నన్ను చంపొద్దు’ అని వేడుకుంటుంది. ‘అదేమిటి! నువ్వు సింహానివి. నిన్ను చూసి గొర్రెలే పారిపోవాలి కదా! అలాంటిది వాటితో పాటు వాటి వలే ఉన్నావు’ అని అంది. ‘నేను సింహాన్ని కాదు గొర్రెను’ అంది గొర్రె సింహం పిల్ల. సింహం ఎంత చెప్పినా ఆ గొర్రె సింహం వినకపోవటంతో చివరకు దాన్ని ఓ కొలను వద్దకు తీసుకువెళ్లి ‘నీ ప్రతిబింబం, నా ప్రతిబింబం ఒకేలా లేదా?’ అని ప్రశ్నించింది. అంతేకాదు నావలే గర్జించు అని నేర్పింది. నువ్వు ఈ గడ్డి కాదు తినేది అని మాంసం తీసుకువచ్చి పెట్టింది. అలా కొన్ని రోజులు పాటు ఆ గొర్రె సింహంలో దాగివున్న సింహం లక్షణాలను బయటకు తీసుకువచ్చింది. ఇంకేముంది ఆ గొర్రె సింహం తనలోని గొర్రె లక్షణాలను వదిలేసి సింహం వలే గర్జించే సరికి ఆ అడవి మొత్తం ప్రతిధ్వనించింది.
ఈ కథ చెబుతూ స్వామి వివేకానంద ‘ప్రజలారా! మీరంతా అమృతపుత్రులే. మీలో దాగివున్న ఆ వీర్యం, శౌర్యం అనే సహజమైన నిజతత్వాన్ని తెలుసుకోండి’ అని ఆయన ప్రతి హృదయాన్నీ తట్టిలేపారు. సింహాల్లా జీవించండి. గొర్రెల మందవలే గ్రుడ్డిగా అనుసరిస్తూ కష్టాలను కొని తెచ్చుకోవద్దు అని అంటారు. జిజియాభాయి ధీరత్వాన్ని ఉగ్గుపాలతో రంగరించి పోయటం వల్లే శివాజీ యోధుడుగా, సమర్థుడైన నాయకుడిగా మారాడు. కాని వర్తమాన కాలంలో చాలామంది తల్లులు తమ పిల్లలు అన్నం తినటం లేదని, మాట వినటం లేదని అదిగో! బూచోడు, ఇదిగో! పిల్లి అని భయపెడుతూ అన్నం తినిపిస్తారు. పసి మనస్సులో ఏర్పడిన ఆ భయం పెద్దయినా వారి మనస్సుల్లో నుంచి తొలగిపోదు అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. నిర్భయత్వాన్ని, ఉన్నత విలువల్ని, వీర పురుషుల గాథల్ని గోరుముద్దల్లో కలిపి తినిపిస్తే సింహాల్లా వర్తమానానికి దూరం కాకుండా, భూతకాలపు గోతులలో పడి ఆందోళన, మానసిక క్షోభకు గురికాకుండా బతుకుతారు.
‘సింహా’వలోకనం చేయిద్దాం..
సింహం వర్తమానంలో జీవిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు అది వెనక్కి తిరిగి తన పరిస్థితిని ఆకళింపుచేసుకునే గుణం కూడా కలిగి ఉంది. దీనినే సింహావలోకనం అంటాం. ఇలాంటి విశే్లషణాత్మకమైన ఆలోచనలు చేసేవారు ఎల్లప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనతోనే ఉంటారు. ఈ ఆలోచనా ధోరణి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వారు దేనికీ భయపడరు. ధైర్యంగా వర్తమాన పరిస్థితులను ఎదుర్కొంటూ, గతంలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా నిరంతరం జాగరూకతతో ముందుకు సాగుతారు.
ధైర్యవంతుల సాఫల్యతకు నిదర్శనంగా ఈ సింహావలోకనం నిలుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. 1897లో స్వామి వివేకానంద విదేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన చెన్నైలో నౌక దిగిన వెంటనే చేసిన పనేమిటంటే -ఆ నేలతల్లి ధూళిని తీసుకుని శిరస్సుపై ఉంచుకున్నారు. ‘‘నేను ఇక్కడకు రాకముందు ఈ దేశాన్ని మాత్రమే ప్రేమించేవాడిని. ఇపుడు ఈ దేశ ధూళి, గాలి, నీరు కూడా పవిత్రమే’’. ఇది ఆ దేశభక్తుడి సింహావలోకనం. అందుకే ఈ మానవజాతి ప్రేమికుడు సింహాన్ని ధ్యానించేవారు. భావిభారత పౌరులుగా పిల్లలు ఎదగాలంటే వారిలో సహజంగా నిబిడీకృతమైన అనంతశక్తిని తట్టిలేపండి అని స్వామిజీ పిలుపును అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-హరిచందన