Others

కలియుగ వైకుంఠం.. రంగనాథ ఆలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర శ్రీరంగంగా కీర్తిపొందిన నెల్లూరు శ్రీరంగనాయకుల ఆలయం కధాసారాంశం స్కాంద పురాణంలో ప్రస్తుతించారు. పెన్నానదీ ప్రాంతమైన పినాకిని నదీ తీరాన కొలువైన రంగనాథస్వామికి శయన నారాయణుడు (పళ్లికొండ పెరుమాళ్ళు)గాను ఈ ప్రాంతాన్ని శ్రీ వైకుంఠం (చిత్తరమేళ విణగళ్)గా చరిత్ర ప్రసిద్ధి చెందింది. పురాణ గ్రంథాల పుటలు తిరగవేస్తే వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీ సమేతంగా భూలోక విహారమే సంకల్పించి ఆదిశేషుని క్రీడా శైలముగావలసినదిగా ఆజ్ఞాపించాడు. అంతట ఆదిశేషుడు పినాకిని నదీ తీరాన గంగా ప్రభవించ సత్యలోక పర్యంతం ప్రవర్థమానుడయ్యెను. శ్రీమన్నారాయణుడు గరుడవాహనదారుడై తన పాదంతో ఆ గిరి స్పృశించెను. ఆనాటి నుండి ఆ ప్రాంతం తల్పగిరిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తపస్సు చేసిన కశ్యప మహాముని పుండరీక యాగము చేయుచుండ ఏకాదశి పుణ్యదినాన కశ్యప ముని కోర్కె మేరకు కలియుగ శ్రీవైకుంఠంగా ఖ్యాతి చెందేలా శ్రీమన్నారాయణుడైన రంగనాథస్వామి ఈ క్షేత్రంలో వెలిశాడు. కశ్యప మహర్షి ప్రార్థన మేరకు ఆదిశేషుడు శేషసాయి కాగా శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి సహితంగా శయనించెను. నాభి నుండి బ్రహ్మ ఉద్భవించెను. ఉత్తర ముఖుడైన శ్రీరంగనాథుడును సేవించిన భక్తులకు కోరిన వరాలిచ్చే భక్తవల్లభుడిగా కీర్తిపొందుతున్నాడు.
చరిత్ర పుటలు తిరుగవేస్తే ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు సింహపురి (నెల్లూరు) ప్రాంతాన్ని సందర్శించి దేవాలయ నిర్మాణం చేశారు. క్రీ.శ. 12వ శతాబ్దంలో రాజేంద్ర ఉభయకులోత్తన చోళ కాలంలో గర్భాలయాన్ని నిర్మించారు. 1849లో ఎర్రగుడిపాటి వెంకటాచలం పంతులు ఏడు అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించాడు. తొమ్మిది దశాబ్దాల పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యులు ఈ దేవాలయాన్ని బంగారు గరుడ వాహనం, అద్దాల మండపం, నగలు కానుకలుగా సమర్పించారు.
ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ప్రతి సంవత్సరం మే నెలలో భగవాన్ రామానుజాచార్యుల జన్మదినాన పూల పల్లకి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ‘ఎ’ గ్రేడ్ ఆలయంగా గుర్తింపు వున్న ఈ ఆలయంలో శ్రీరంగనాథస్వామి తెప్పోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని నీటిపారుదల శాఖను కోరామని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ప్రస్తుతం మంచికంటి సుధాకరరావు ఆలయ చైర్మన్‌గా భక్తుల సేవలో భాగం పంచుకొనగా కోవూరు జనార్దన్ రెడ్డి కార్యనిర్వాహణాధికారిగా దేవాలయ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భోగి పండుగ రోజున కళ్యాణం, కనుమ పండగ రోజున కనుమ పార్వేటి ఉత్సవం జరుపుతారు. ధనుర్మాసంలో స్వామివారికి అధ్యయనోత్సవం (పగల్‌పత్తు- రాపత్తు) అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సింహపురి వాసులకు ఇలవేల్పుగా పూజలు అందుకుంటూ ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతోంది.

-మురళీధర్